మంగళవారం 26 మే 2020
Telangana - May 11, 2020 , 01:31:47

రాష్ట్రంలో మరో మూడ్రోజులు వానలు

రాష్ట్రంలో మరో మూడ్రోజులు వానలు

  • కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, ఆవర్తనం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉపరితల ద్రోణి, ఆవర్తనం కొనసాగుతున్నందున రాగల మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, మరాఠ్వాడ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఇంటీరియర్‌ కర్ణాటక, ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతోపాటు దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పియర్‌ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో దాదాపుగా ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వారు పేర్కొన్నారు. 

వీటి ప్రభావంతో రాగల మూడ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వారు తెలిపారు. రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశమున్నట్లు చెప్పారు. 

ధర్మారంలో రాలిన మామిడి

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో శనివారం రాత్రి గాలివాన బీభత్సానికి మామిడి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖిలావనపర్తి, కటికెనపల్లి, కొత్తూరు, సాయంపేట, బొమ్మారెడ్డిపల్లి, చామనపల్లి గ్రామాల్లో కోతకు వచ్చి, తెంపేందుకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు నేలరాలగా రైతులు లబోదిబోమంటున్నారు. ఆదివారం ఉదయం ఉద్యాన అధికారి జ్యోతి తోటలను పరిశీలించి దాదాపు 508 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు తెలిపారు.logo