సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 01:15:29

చిన్నారుల జాడకు ‘దర్పణ్‌'

చిన్నారుల జాడకు ‘దర్పణ్‌'

  • యాప్‌తో తప్పిపోయిన బాలల వెతుకులాట
  • ఆపరేషన్‌ ముస్కాన్‌-6లో సాంకేతిక వ్యూహం
  • సీసీటీఎన్‌ఎస్‌లో వివరాలు: ఏడీజీ స్వాతిలక్రా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మికులుగా మారిన, తప్పిపోయిన చిన్నారుల జాడకోసం సాంకేతిక వ్యూహాన్ని అమలుచేస్తున్నామని మహిళా భద్రతావిభాగం ఇంచార్జి, ఏడీజీ స్వాతిలక్రా తెలిపారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూనే ఆపరేషన్‌ ముస్కాన్‌-6 ను చేపట్టినట్టు  మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సిబ్బంది, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంకోసం టెలి, వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన చిన్నారుల అదృశ్యం కేసుల వివరాలు పూర్తిగా సీసీటీఎన్‌ఎస్‌ (క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ సిస్టమ్స్‌)లో అప్‌లోడ్‌చేయాలని ఆదేశాలిచ్చినట్టు వివరించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఫొటోలు సరిగా లేకపోతే, ఫిర్యాదుదారులతో మాట్లాడి స్పష్టంగా ఉన్న ఫొటోలు అప్‌లోడ్‌చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు కేంద్రహోంశాఖ పరిధిలో పనిచేస్తున్న చైల్డ్‌ ట్రాక్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌చేసేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌కు స్పెషల్‌ లాగిన్‌ ఐడీలను ఇచ్చామన్నారు. ప్రతి ఠాణా పరిధిలో ఉన్న చిన్నారుల వసతిగృహాలు, ప్రైవేట్‌ ఆశ్రమాలు, చైల్డ్‌కేర్‌ హోంల వివరాలు విధిగా స్టేషన్‌హౌజ్‌ ఆఫీసర్లు సేకరించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఆపరేషన్‌ ముస్కాన్‌- 6లో భాగంగా ఇప్పటికే ఆన్‌లైన్‌ డాటాలో అందుబాటులో ఉన్న మిస్సింగ్‌ చిన్నారుల ఫొటోలను వివిధ రాష్ర్టాల్లో మిస్సింగ్‌, అనాథ ఆశ్రమాల్లో, ఎన్జీవోలు నిర్వహిస్తున్న వసతి గృహాల్లో ఉంటున్నవారి ఫొటోలతో దర్పణ్‌ యాప్‌ (ఫొటోల్లోని ముఖ కవళికల ఆధారంగా గుర్తిస్తుంది) ద్వారా పోల్చిచూసి జాడ కనిపెట్టేందుకు ప్రత్యేక సాంకేతిక బృందం పనిచేస్తున్నట్టు వివరించారు. 


logo