గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:41

భూ సమస్యలకు చెల్లు చీటీ!

భూ సమస్యలకు చెల్లు చీటీ!

  • పేదల ఇండ్లకు హక్కు కల్పిస్తాం
  • రెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి
  • ఎల్‌ఆర్‌ఎస్‌ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాం
  • అవసరమైతే సాదాబైనామా గడువు పెంపు
  • ఎమ్మెల్యేలు ప్రజలతో ఉంటే.. వాళ్లే గెలిపించుకొంటారు
  • అబద్ధాల బీజేపీ.. అన్నింటినీ ప్రైవేటు చేస్తున్నది
  • నదీజలాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనానికి ప్రశంస
  • ఉమ్మడి ఆరు జిల్లాల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌

 పేదవారికి ఆత్మబంధువులుగా ప్రజాప్రతినిధులుండాలి. నేను అనే అహం, గర్వం ఉండొద్దు. ఆ ఫీలింగ్‌ రావొద్దు. ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు, అర్హులైనవారికి చేరే విధంగా చూడటంలో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర. ప్రజల సమస్యల్లో మనం భాగమైతే.. వాటి పరిష్కారానికి కృషిచేస్తే వాళ్లే తిరిగి మనల్ని గెలిపించుకుంటారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకం కావాలి.

                                - ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త రెవెన్యూ చట్టాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పేదప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని తెలిపారు. రెవెన్యూ చట్టంతో పేదప్రజల, రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో పేదలు కట్టుకున్న ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వం తెచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆదేశించారు. పనిచేయడంతోపాటు చేసిన పనిని చెప్పుకోవడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. ఎన్నిక ఏదైనా సీరియస్‌గా తీసుకోవాలని, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 104 స్థానాల్లో గెలుస్తుందని పలు సర్వేల్లో తేలిందని, రెండు  

ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్‌సభ్యులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. రెవెన్యూ చట్టం, ధరణి వెబ్‌సైట్‌లో వివరాల నమోదు, కృష్ణా , గోదావరి జలాలు, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలు, దుబ్బాక, శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, బీజేపీ ప్రభుత్వ తీరుపై కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం రెవెన్యూ చట్టం, ధరణి వెబ్‌పోర్టల్‌ సహా పలు అంశాలపై ఎమ్మెల్యేలకున్న సందేహాలను నివృత్తి చేశారు. 

దేశానికే ఆదర్శం.. రెవెన్యూ చట్టం..

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం అద్భుతమైనదని, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు ఈ చట్టం ద్వారా దాదాపు అన్ని  సమస్యలు పరిష్కారమవుతాయని, కొద్ది సమస్యలుంటే భూముల సర్వే తరువాత అవి పరిష్కరమవుతాయని పేర్కొన్నారు. పోడు, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూములకు సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారంచూపేందుకు ప్రయత్నిస్తామని స్పష్టంచేశారు.  

మిగులు జలాల్లో మనకూ వాటా  

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు స్పష్టమైన వాటా ఉన్నదని, ఇప్పటికీ కేటాయించిన నీళ్లకంటే ఎక్కువగా వాడుకోవడంలేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయినా మన ప్రాజెక్టులకు అడ్డుపడేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని చెప్పారు. బేసిన్‌ కాకపోయినా కృష్ణానీటిని ఏపీ తరలించుకుపోతుంటే కృష్ణా బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని ఆక్షేపించారు. బేసిన్‌లోలేని ప్రాంతానికి నీళ్లు ఏ విధంగా తీసుకుపోతారని ప్రశ్నించారు. ఏపీ తీసుకుపోతుంటే కేఆర్‌ఎంబీ ఏంచేస్తున్నదని ప్రశ్నించారు. గోదావరి జలాల్లో గత యాభై ఏండ్లుగా మూడువేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని, వీటిని వినియోగించుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టడంలేదన్నారు. నదీ జలాలకు సంబంధించిన సమగ్ర వివరాలపై ప్రజాప్రతినిధులందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు.

దసరాకు ధరణి పోర్టల్‌

దసరాకు ధరణి వెబ్‌పోర్టల్‌ ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మొదట వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించుకుందామని తెలిపారు. పట్టణాల్లో, పల్లెల్లో ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నారని, కానీ ఆ భూములు వారి పేరు మీద లేకపోవడంతో వారసులకు బదిలీ కావడంలేదని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు చాలా మున్సిపాలిటీల్లో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరిద్దామని చెప్పారు. కేంద్రం పరిధిలోని భూచట్టాలు మినహా రాష్ట్ర పరిధిలో భూచట్టాల పరిధిలోని అంశాలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. 

నియోజకవర్గాలకు ఎమ్మెల్యేనే ఫైనల్‌

నియోజకవర్గానికి ఎమ్మెల్యేదే బాధ్యత అని, మంత్రులు.. ఇతరులు వేరే నియోజకవర్గాల్లో జోక్యంచేసుకోరని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ధరణిలో వివరాల నమోదుకు ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో ఎమ్మెల్యేలంతా భాగస్వాములు కావాలని, దళితవాడలకు పోవాలని, వారితో మమేకం కావాలని సూచించారు. పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో ఇండ్ల, ఇండ్ల స్థలాల నమోదు చురుకుగా సాగేలా పార్టీ నాయకులంతా పాల్గొనాలని, ప్రజల్లో చైతన్యం తేవాలని పేర్కొన్నారు. స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అధికార యంత్రాంగానికి సహకరిస్తే తొందరగా సర్వే పూర్తి అవుతుందన్నారు. ప్రజలకు సందేహాలు ఉంటే  తీర్చాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అవసరమైతే సాదాబైనామా గడువు పెంచుకుందామని కూడా పేర్కొన్నారు. 

అబద్ధ్దాల బీజేపీ 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదని.. మాటలు తప్ప చేతలు ఏమీలేవని సీఎం కేసీఆర్‌ అన్నారు. వారిది అబద్ధ్దాల ప్రచారం ఎక్కువని చెప్పారు. ఆసరా పింఛన్లలో వారిచ్చేది రెండుశాతంలోపేనని, అయినా మొత్తం తామే ఇచ్చినట్లుగా ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో రూ.50 వేల కోట్లకు పైగా ఇస్తుంటే, వాళ్లు మాత్రం తెలంగాణకు రూ.20 వేల కోట్లు ఇస్తున్నారని.. రూ.30 వేల కోట్ల వరకు రాష్ర్టానికి రావాల్సి ఉన్నదని వివరించారు. గతంలో అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించినప్పుడు తెలంగాణకు రూ.2 లక్షల కోట్లు ఇచ్చానని చెప్పారని, దానిపై తాను స్పందించి ఎక్కడా ఇచ్చారో చెప్పాలని, అంత మొత్తం ఇచ్చినట్లుగా నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామాచేస్తానని కూడా చెప్పానని గుర్తుచేశారు. వారిలో ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ఊపునిచ్చిందే బీజేపీఅని చెప్పారు. వాజపేయి ప్రభుత్వంలో ప్రత్యేకంగా పెట్టుబడుల ఉపసంహరణశాఖను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ, ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి తలుపులు బార్లా తెరుస్తున్నారని అన్నారు. వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా దేశంలోని అనేక పార్టీలను కూడగట్టగలిగామని తెలిపారు. విద్యుత్‌ చట్ట సవరణపైనా ఇతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చామని చెప్పారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినా తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. 

రైతులకు, ప్రజలకు నష్టం కలిగిస్తే ఊరుకోం

వ్యవసాయచట్టానికి మద్దతివ్వాలని పలువురు కేంద్రమంత్రులు అనేకమార్లు తనను సంప్రదించారని, వాటికి స్పందించలేదని సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పారు. ప్రజలకు, రైతులకు నష్టం కలిగించే ఎలాంటి చట్టాలనైనా టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందని తేల్చిచెప్పారు. రైతులకు తీవ్రనష్టం కలిగించే వ్యవసాయబిల్లును కేంద్రం మూజువాణి ఓటుతో ఆమోదించుకోవటం  హేయమైన చర్య అని పేర్కొన్నారు. రాష్ర్టాల్లో సైతం బీజేపీ తనకు మెజార్టీ లేకున్నా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇదే విధంగా చేశారన్నారు. మహారాష్ట్రలోనూ ఇదే విధంగా చేయాలని చూసినా అక్కడ విఫలమయ్యారని గుర్తుచేశారు.

ఎమ్మెల్యేల సందేహాలకు సమాధానాలు 

మధ్యాహ్న భోజనం తరువాత ప్రారంభమైన సమావేశం రాత్రి 7 గంటలకు వరకు సాగింది. సీఎం కేసీఆర్‌ ప్రసంగించిన తరువాత ఎమ్మెల్యేల సందేహాలను నివృత్తిచేశారు. ఈ సమావేశంలో రెవెన్యూచట్టం, ధరణి వెబ్‌పోర్టల్‌ వివరాల నమోదు సహా జీవో 58, 59 తదితర అంశాలపై ఎమ్మెల్యే సందేహాలకు సీఎం కేసీఆర్‌ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. దాదాపుగా గంటన్నరపాటు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఎక్కువగా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న వ్యవసాయ భూసమస్యలు, ఇంటి భూసమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో ప్రభుత్వ అసైన్‌మెంట్‌ భూములను కొందరు అమ్ముకొని.. వారు మరొకరికి అమ్ముకోవటంతో వాటిల్లో ఇండ్లు కట్టుకున్నారని, వారి ఇండ్లు రిజిస్టర్‌ కాలేదని, వారి పేరుమీదుగా ఆ ఇంటి స్థలాలు రెగ్యులరైజ్‌ అయ్యేలాచూడాలని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కోరారు. షెడ్యూల్‌ ఏరియాలో వక్ఫ్‌భూములు ఉన్నట్లుగా చూపుతున్నారని కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. పోడు భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్‌ల్యాండ్‌, ఎఫ్‌టీఎల్‌ భూములు ఇలా అనేక వాటిపై సందేహాలను వ్యక్తంచేశారు. వాటన్నింటిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు జారీఅయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ధరలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కానీ అంత ఎక్కువగా ధరలు ఏమీలేవని, అయినా ఎల్‌ఆర్‌ఎస్‌ ధరలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సాదాబైనామా గడువు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలకు స్థానికంగా ఎదురయ్యే సమస్యలకు సీఎంవోలోని శేషాద్రిని సంప్రదించాలని, పట్టణ ప్రాంత సమస్యలకు సీడీఏంఎ సత్యనారాయణను సంప్రదించాలని వారి ఫోన్‌నంబర్లను అందించారు. ఆ స్థాయిలో కూడా సమస్యలు ఉత్పన్నమైతే మంత్రి కేటీఆర్‌కు చెప్పాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పేదప్రజలకు రెగ్యులరైజ్‌చేసే భూములను క్యాబినెట్‌లో చర్చించాల్సిన వాటికి అవసరమైన సాంకేతిక సమస్యలన్నింటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మిగిలిన నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 

 సమావేశంలో పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, మంత్రులు మహమూద్‌ అలీ, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్‌తోపాటు రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. 

నేను అనే అహం ఉండొద్దు

ప్రజలు ఎవరు వచ్చినా సమస్యలపై ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వారి సమస్యలను ఓపిగ్గా వినాలని,  వ్యక్తిగా మంచి మనిషి అయినా, పెద్దగా పేరు ఉన్నా.. నాయకుడిగా సక్సెస్‌ కావడం ముఖ్యమని చెప్పారు. ఇందుకోసం అందర్నీ కలుపుకొని పోవడం, వారి సమస్యల పట్ల స్పందించాలని హితవు చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కాకపోయినా.. తమవంతు ప్రయత్నంలో లోపం మాత్రం ఉండవద్దని స్పష్టంచేశారు. పేదవారికి ఆత్మబంధువులుగా ప్రజాప్రతినిధులుండాలని, నేను అనే అహం, గర్వం ఉండొద్దని, ఆ ఫీలింగ్‌ రావొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు, అర్హులకు చేరేలా చూడటంలో ఎమ్మెల్యేలది కీలక పాత్రని తెలిపారు. ప్రజల సమస్యల్లో భాగమైతే.. వాటి పరిష్కారానికి కృషిచేస్తే వాళ్లే తిరిగి మనల్ని గెలిపించుకుంటన్నారని మార్గదర్శనంచేశారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకం కావాలని, సమస్యలపై సానుకూలంగా స్పందించాలని సూచించారు. 

నమస్తే తెలంగాణ కథనానికి ప్రశంస... 

శనివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. మా నీళ్లు మా హక్కు పేరుతో ప్రచురితమైన కథనం చాలా బాగుందని అన్నారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన సమగ్ర వివరాలు అందులో ఉన్నాయని తెలిపారు. ఈ కథనాన్ని అందరూ భద్రపర్చుకోవాలని, ఎప్పుడైనా ఈ వివరాలు అవసరముంటాయని, ఈ వివరాలపై ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలని చెప్పారు. రెండు నదులకు సంబంధించిన వివరాలను ప్రచురితమయ్యాయని తెలిపారు.


logo