సోమవారం 28 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 06, 2020 , 00:28:24

మల్క చెరువుకు మహర్దశ

మల్క చెరువుకు మహర్దశ

ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్న అధికారులు

కొనసాగుతున్న పనులు 

ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకులను అలరించనున్న ప్రాంతం 

70శాతం పూర్తయిన పనులు

బండ్లగూడ, ఆగస్టు 5: ఒకప్పుడు మురికి నీటికి నిలయంగా ఉండేది మల్క చెరువు. ఇప్పుడు నందన వనంగా రూపుదిద్దుకుంటున్నది. రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి వద్ద ఉన్న మల్క చెరువు ప్రస్తుతం ఒక పిక్నిక్‌ స్పాట్‌గా మారుతున్నది. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును అన్ని హంగులతో అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే చెరువు చుట్టూ 70శాతం పనులను పూర్తి చేసుకుని సెప్టెంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చెరువుల పరిరక్షణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. చెరువులను కబ్జా కోరుల నుంచి కాపాడటంతో పాటు వాటిని ప్రజలకు ఉపయోగకరంగా తీర్చి దిద్దుతున్నది. అంతేగాకుండా ఎన్నో చెరువులను ఇదివరకే సుందరీకరిస్తూ.. అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్‌ మండల పరిధిలోని హైదర్‌గూడ సర్వే నంబర్‌ 63, 64, 66లలోని 15 ఎకరాల్లో ఉన్న మల్క చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పూడికతీత పనులు పూర్తి చేసి చెరువు చూట్టూ వాకింగ్‌ ట్రాక్‌, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చెరువులోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చెరువులోకి మట్టి జారకుండా ఉండేందుకు రాతి కట్టడంతో పాటు బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారుల కోసం చిన్న చిన్న పార్కులు, ఓపెన్‌ జిమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు

మల్క చెరువు అభివృద్ధి పనులు గత ఏడాది జనవరిలో ప్రారంభమైనవి. మొత్తం నాలుగు కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. మల్క చెరువు చూట్టూ ఉన్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుది. ఇప్పటికే పనులు పూర్తికావచ్చాయి. 

- నాగరాజు, ఇరిగేషన్‌ ఈఈ 


logo