శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Sep 14, 2020 , 00:15:50

విరాట్‌ మూర్తి విశ్వనాథ

విరాట్‌ మూర్తి విశ్వనాథ

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ నవలను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హిందీలోకి ‘సహస్ర ఫణ్‌' పేరుతో అనువదించారు. తెలుగు సాహిత్యంలోని ఒక మహాగ్రంథాన్ని హిందీ పాఠకులకు పరిచయం చేసే బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించిన సాహిత్య, భాషా పిపాసి ఆయన. విశ్వనాథ గొప్పతనాన్ని హిందీ సాహిత్యా భిమానులకు వివరిస్తూ అనువాద గ్రంథానికి పీవీ రాసిన ప్రవేశిక తెలుగు రూపం ఇది.

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ నవలను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హిందీలోకి ‘సహస్ర ఫణ్‌' పేరుతో అనువదించారు. తెలుగు సాహిత్యంలోని ఒక మహాగ్రంథాన్ని హిందీ పాఠకులకు పరిచయం చేసే బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించిన సాహిత్య, భాషా పిపాసి ఆయన. విశ్వనాథ గొప్పతనాన్ని హిందీ సాహిత్యా భిమానులకు వివరిస్తూ అనువాద గ్రంథానికి పీవీ రాసిన ప్రవేశిక తెలుగు రూపం ఇది.

ఈ వేయిపడగలు జాన్‌ క్రిస్టోఫి వంటి నవల అయినప్పటికీ దీనిలో చరిత్ర, సాంఘికశాస్త్రం, రాజనీతి, ప్రాచీన సంస్కృతి యొక్క సర్వోత్కృష్ట నియమాలు ఉన్నాయి. ఇందులో పెద్ద ఎత్తున రసము చిప్పిలుతుంటుంది. కొందరి ఉద్దేశంలో ఇది నవల కాదు. బహుశ వారు అలా అనడానికి  కారణం దీనిలో నవలను మించి అనంతమైన విషయాలు చెప్పబడటం కావచ్చు. 

ఇరువయ్యో శతాబ్దపు భారతీయ సాహిత్యకారుల్లో ప్రముఖ స్థానం ఆక్రమించుకొన్న శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సుప్రసిద్ధ గద్యకథ ‘వేయిపడగలు’ గురించి హిందీ పాఠకులకు నాలుగు మాటలు మనవి చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన ప్రతిభా విశేషం ఒక్క తెలుగు ప్రాంతానికే పరిమితం కావడం న్యాయం కాదని, ఒక్క ప్రాంతం మాత్రమే వారి ప్రతిభా సర్వస్వాన్ని ఇముడ్చుకోజాలదని వారితో పరిచయమున్న పలువురు భావిస్తారు. 

సాహిత్యరంగంలో ఆయన వ్యక్తిత్వం అపూర్వమైనది. అనన్య సామాన్యమైంది. అద్వితీయమైంది. సాధారణంగా ఒకే వ్యక్తిలో కలిసివుండని అనేక సల్లక్షణాలు ఆయనలో మూర్తీభవించి ఉన్నాయి. వారిలో సాహిత్య ప్రజ్ఞ ఎంత, తాత్త్వికత ఎంత, భావుకత ఎంత, రసాత్మకత ఎంత అనే ప్రశ్నలకు సమాధానమివ్వడం కఠినమైన పని. నేటివరకు ఈ ప్రశ్నలను లోతుగా పరిశీలించడం జరిగినట్టు లేదు. కావున సాహితీ పరిశోధన జరపాల్సిన వారికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అద్భుతమైన క్షేత్రం కాగలదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆంధ్రసాహిత్య రంగంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మకుటాయమానమైన కవిగా, నవలా రచయితగా, విమర్శకుడిగా సుప్రసిద్ధులు. ఆయన ప్రతిభ సర్వతోముఖమైనది. నేటి సాహిత్య రీతులలో ఆయన స్పృశించని అంశం లేదు. ముట్టుకొని బంగారం చేయని వస్తువు లేదు. కవిగా ఆయన విశిష్టత ప్రత్యేకమైంది. నేటి ఆధునిక యుగంలో ఆయన తెలుగువారికి శ్రీమద్రామాయణ కల్పవృక్షమనే ఒక అద్భుతమైన మహాకావ్యాన్ని అందించినారు. నేటివరకు తెలుగులో వచ్చిన రామాయణాలన్నింటిలో ఈ కల్పవృక్షం మకుటాయమానమైందని అనేకమంది విద్వాంసుల అభిప్రాయం. విశ్వనాథ ఆద్యంతం కవియే. ఆయన ఏ రచన చేసినా అందులో మూలతః కావ్యత్వమే ఉంటుందని 

పలువురి అభిప్రాయం.

రామాయణ కల్పవృక్షమే కాక శ్రీ సత్యనారాయణ గారు అనేక ఖండకావ్యాలను, గీతకావ్యాలను రాశారు. ఆయన రాసిన కిన్నెరసాని పాటలు చదివి ఒడలు పొంగిపోయే లక్షలాది జనులున్నారు. అటు మహాకావ్యాలు, ఇటు గేయరచన ఒక చేతినుండి వెలువడటం, రెండు కూడా ప్రజారంజకాలు కావడం ఇంకెక్కడా కనిపించదు.

ఆయన నవలలు, చిన్న కథలు పాఠకాదరణ పొందినాయి. ఇక్కడ ఆయనను ఒక విరాట్‌మూర్తి అని అభివర్ణించాల్సి వస్తుంది. ఇన్ని భిన్నమార్గాలు ఒక కలం నుండి రావడం గొప్ప విలక్షణత. 

ఆయన ప్రతి పుస్తకంలో వస్తువు ఏమి, భాష శైలి ఏమి అనేది తరచిచూచి తీరాల్సిందే. ఆయన పిపీలికాది బ్రహ్మపర్యంతం ఏ వస్తువునైనా తన రచనల్లో జొప్పిస్తారు. ఆయన పాత్రలు చాలా విలక్షణంగా ఉంటాయి. అయినా ఆ పాత్రలు ఎక్కడినుంచో తెచ్చినవి కావు. 


కేవలం కల్పితాలు కావు. ప్రతిదినం మనం చూస్తున్న మనుషులే ఆ పాత్రలకు మాతృకలు. ఆ పాత్రలలో కల్పనా వాస్తవముల మనోహర సమావేశం చూడముచ్చటగా ఉంటుంది. ఇది విశ్వనాథ విశిష్టత. ఆయన ధ్వనివాది. ఆయనకు అన్నిటికంటే కావ్యంలో ధ్వని ప్రధానం. ఆయన గొప్ప వ్యాఖ్యాత. కొందరు పండితులు ఆయనను అభినవ మల్లినాథుడు అంటా రు. ఆయన పూర్వ మహాకవుల గ్రంథాల్లో నుంచి మహాధ్వనులెన్నో మనకు ఎత్తిచూపారు. వ్యాసాలు రాశారు. అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన                 ఉపన్యాసాలు వినితీరాల్సిందే. 

ఆయన వాణి ఒకప్పుడు ధీర గం భీర గంగావాహిని. మరొకప్పుడు పర్వతం పైనుండి దూకి ప్రవహించే సెలయేరు. ఒకప్పుడు మేఘాలు గర్జిస్తున్నట్టు ఉంటుంది. మరొకప్పుడు కోకిల తన పంచమ స్వరంలో ‘కుహూకుహూ’ నినాదము చేసిన్నట్టు ఉంటుంది. శబ్ద ప్రయోగం ఎలా ఉండాలనేది స్వతంత్రంగా నిరూపించడం ఆయన ప్రత్యేకత. 

శబ్ద ప్రయోగం ఉంటేనే ఉత్తమ సాహిత్యమని ఆయన సిద్ధాంతీకరిస్తారు. శ్రోతల చేత అంగీకరింపజేసేందుకు ప్రయత్నిస్తారు. తాను స్వయంగా శబ్దాన్ని అలాగే ప్రయోగిస్తుంటారు.

ఇందుకే సాహిత్యంలో ఆయన అద్వితీయుడని చెప్పాను. ఆయన రచనలను అర్థం చేసుకోవాలంటే ప్రధానమైన ఒక విషయముంది. దానిని తెలుసుకోకపోతే ఎన్ని తెలిసినా లాభం లేదు. అదే విచారణ శీలత. అది తెలియనిచో ఆయన కావ్యములు తెలియనట్లే. ఆయన ఇటు ఎం ఏ పట్టభద్రులు. అటు ప్రాచీన సంప్రదాయ మర్మాలు ఎరిగినవారు. వేదోపనిషత్‌ శాస్త్రములు చదివినవారు. ఆయన సాహిత్య వ్యాసంగం ఆరంభించిన రోజుల్లో దేశం ప్రాక్‌, పాశ్చాత్య సంస్కృతుల స్పర్థకు లోనవుతున్నది. ఎగుళ్ళుదిగుళ్ళుగా నున్నది. ఈ రెండు పెద్ద ప్రవాహాలాయన హృదయంలో సంఘర్షించాయి. ఇందులో ప్రాచీన సంస్కృతి గెలిచింది. అది మహాకావ్యాలుగా ప్రావిర్భవించుట ప్రారంభించింది. వేయిపడగలలో శ్రీ విశ్వనాథ.. ధర్మారావు ద్వారా తన సిద్ధాంతాలను నిరూపించారు. ఆ ధర్మారావు పదునారణాల వైదికుడు. ఇంగ్లీషు విద్యా ప్రభావం చేత దొరతనం వారి ఆసరా చూసుకొని భారతీయ సంస్కృతీ క్షేత్రంలో నిత్యం దురాక్రమణ జరుగుతున్నది. విద్వాంసుడు, ప్రతిభావంతుడు అయిన ధర్మారావు కుత్సిత మార్గాలను అసహ్యించుకుంటాడు. 

ఆధునిక సభ్యత పేర కొత్తరకపు వితండవాదాలు బయలుదేరి సంఘంలో ఘోరమైన అన్యాయం విచ్చలవిడిగా జరుగుతుండటం చూసి ఆయన గుండె జ్వలించింది. మన సంస్కృతిలోని లోతుపాతులు తెలుసుకోకుండానే  క్షుద్రబుద్ధితో విమర్శించడం నేడొక ఫ్యాషన్‌గా పరిణమించింది. ఈ విషయంలో విశ్వనాథ సద్భావన అపారమైనది. 

ఒక్కమాటలో చెప్పాలంటే ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అనే పరమసత్యమే అది. ఆయన రాసిన సర్వకావ్యాల వెనుకనున్న ఈ సత్యం వేయిపడగలలో వ్యాపక రూపాన్ని సంతరించుకున్నది.

భారతీయ జీవన పద్ధతిలో, భారతీయ జీవన ధర్మలో సంక్రమించిన సంధికాలాన్ని విస్పష్టంగా వివరించి చెప్పేందుకే ఈ గ్రంథం రాయబడిందని చెప్పవచ్చు. ఈ కాలంలో ప్రాచీన ధర్మాలు బోలుబోలుగనున్నవి. గుణవంతముగా లేవు. ఇదొక సంఘర్షణ. ఇది ఒక అనిశ్చితత్వము. పై మెరుగులతో కనులు మిరుమిట్లు గొలుపజూసే ఈ కొత్త విలువలు ఎలాంటివి? వీటి లక్ష్యశుద్ధి ఎలాంటిది? ఇవి ఎంతటి తప్పుదోవలు తీస్తున్నాయి? ఈ రహస్యాలు చెప్పేందుకే ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథం ఒక విషయాన్ని నిశ్చయంగా చెప్తున్నది. మన సమాజ నిర్మాణం మన చిరంతన పునాది మీద జరగాలి. మరే పునాది మీద జరిగినా అది బోలుబోలుగా ఉండక తప్పదు. ఈ మాత్రం మాటలు వేయిపడగల మహారహస్యం చెప్పేందుకు చాలవు. అయినా ఇదొక సాహిత్య గ్రంథం. వేదాంత గ్రంథం కాదు. శాస్త్ర గ్రంథం కాదు. దీనిని ఒక కళాత్మకమైన గ్రంథంగా, రసప్రధానమైన రచనగా పరిశీలించడం సమంజసం. ఈ గ్రంథంలోని పాత్ర చిత్రణం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాత జమీందారు కృష్ణమనాయుడు, ఆయన కొడుకు రంగారావు, మనుమడు హరప్ప ముగ్గురు మూడు విధాలైన విలక్షణ వ్యక్తులు. దేవదాసి గణాచారి, రుక్మిణమ్మారావు, రామేశ్వరశాస్త్రి వీరు ఉదాత్తులైన వ్యక్తులు. వీరందరితో ఏ సంఘర్షణ నిరూపించేందుకు ఈ గ్రంథ రచన ఆరంభించబడిందో ఆ సంఘర్షణలోని భారతీయ సంస్కృతికి లక్ష్యమైన యుగం మునిగిపోతున్నది. ఇష్టమా, ఇష్టము కాదా అన్న ప్రశ్న కాదు. వారు తిరిగిరారు. ఇది గ్రంథకర్తకు తెలుసు. అస్తమిస్తున్న ఆ వ్యవస్థను రచయిత పరమోదాత్తంగా చిత్రించారు. కానీ ఆ వ్యవస్థే నిత్యంగా ఉండాలని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆదర్శప్రాయుడైన యువరాజుగా హరప్పను ఎంత ఉదాత్తంగా చిత్రించినా తక్కిన యువరాజులు రంగేళీ జీవితంలో మునిగి తేలుతున్నారన్న సత్యం స్పష్టంగానే చాటారు.

మిగిలినవారు ధర్మారావు, అరుంధతి. ప్రకృతి పురుషులా అన్నట్టు అనాది ధర్మ ప్రతీకలు. కాల నిరపేక్ష వైదికతా ప్రతినిధులు. వీరు జన్మిస్తారు, నవ్వుతారు, దుఃఖిస్తారు. శారీరకంగా చనిపోతారు. కానీ వారిలో శాశ్వత ధర్మం ఉంటుంది. వారు శాశ్వతులు. ఈ ధర్మభూమిలో వారికి మరణం లేదు. ‘సంభవామి యుగే యుగే’ అనేదానికి వారు మూలభూతులు.

ఆయనకు తన పాత్రల మీద ఎంత అనురాగమో! తాను వారిలో కలిసి బతుకుతున్నట్లు రాస్తారు. ఆయనకు ఏ పాత్రపైనా ద్వేషం లేదు. ఈ నవలలో ప్రతినాయకుడు లేడు. ప్రతినాయక స్థానం ఈ కథలో ఒక వ్యక్తికి ఇవ్వలేదు. ఒక దృక్పథానికి ఇచ్చారు. ఇందులో స్వధర్మ, పరధర్మాల సంఘర్షణ నిరూపితమైంది.

 ఈ గ్రంథమునందలి భాష సంస్కృత గర్భితంగా ఉంటుంది. ఒక మహాగద్యకావ్యంలా ఉంటుంది. ఆద్యంతాలు దీర్ఘసమాసాలున్నాయి. ఎందుకిట్లా ఉండాలి? అంటే భావానుకూలమైన భాష ఉండాలన్న నిబంధన ఉంది. ఈ వేయిపడగలు ఆ రీతిలో రాయబడింది. ఈ భాష వల్ల పాఠకులకు ఇబ్బంది కలుగదు సరికదా కల్పన యొక్క ఉదాత్తతను గ్రహించేందుకు సహాయకారిగా ఉంటుంది. 

ఒక్కొక్కప్పుడు ఈ భాష వల్ల కావ్యసౌందర్యము ధగధగలాడిపోతుంది. ఇలా సంస్కృత భాషా ప్రాచుర్యమే కాక ఈ వేయిపడగలులో మనోహరమైన సరసమైన తెలుగుభాష కూడా ఉంది. కథోపకథనంలో మన మామూలు భాష ఒక విసురులో, ఒక కాకువులో ఒక వ్యంగ్యాన్ని, ఒక ధ్వనిని నిరూపించేందుకు ఉపయోగింపబడింది. ఏమి సొగసైన తెలుగు భాష!

కావున భాషా దృష్టితో కూడా వేయిపడగలకు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అది వేయిపడగలులోని వర్ణనలు. ఆ వర్ణనలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అక్కడక్కడ వెన్నెలను వర్ణించేందుకు తెచ్చిన ఉపమానాలు, సర్పాలను వర్ణించేందుకు చేసిన పోలికలు బహు విచిత్రంగా ఉంటాయి. వర్ణన ల్లో కల్పనాశక్తి, సూక్ష్మదర్శిత్వం, భాషాధికారం, వ్యాపకమైన సంవేదన శీలత ఉట్టిపడుతాయి. వర్ణనలు లేకుంటే కథాక్షతి జరుగదు, కానీ రచన యొక్క ఉదాత్తబింబానికి క్షతి కలుగుతుంది. ఈ వర్ణనలు చదివితే చాలామంది కవులు, పండితులు కావచ్చు. అది వారికెంతో ఉపయోగపడుతుంది.

- అనువాద మూలం: రాధాకృష్ణమూర్తి, 

సేకరణ: గండ్ర లక్ష్మణరావు

ఈ గ్రంథమునందలి భాష సంస్కృత గర్భితంగా ఉంటుంది. ఒక మహాగద్యకావ్యంలా ఉంటుంది. ఆద్యంతాలు దీర్ఘసమాసాలున్నాయి. ఎందుకిట్లా ఉండాలి? అంటే భావానుకూలమైన భాష ఉండాలన్న నిబంధన ఉంది. ఈ వేయిపడగలు ఆ రీతిలో రాయబడింది. ఈ భాష వల్ల పాఠకులకు ఇబ్బంది కలుగదు సరికదాకల్పన యొక్క ఉదాత్తతను గ్రహించేందుకు సహాయకారిగా ఉంటుంది.

భారతీయ జీవన పద్ధతిలో, భారతీయ జీవన ధర్మలో సంక్రమించిన సంధికాలాన్ని విస్పష్టంగా వివరించి చెప్పేందుకే ఈ గ్రంథం రాయబడిందని చెప్పవచ్చు. ఈ కాలంలో ప్రాచీన ధర్మాలు బోలుబోలుగనున్నవి. గుణవంతముగా లేవు. 


logo