సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 18, 2020 , T00:15

ప్రజాస్వామ్యం-నిరసన

ప్రజాస్వామ్యం-నిరసన

సుప్రీంకోర్టు నిరసన హక్కును, ఇతరుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమతుల్యం సాధించే ప్రయత్నించింది. ఈ క్రమంలో షాహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగించే అంశంపై చర్చ మొదలైంది. అయితే రెండు నెలలకు పైగా సాగుతున్న షాహీన్‌బాగ్‌ నిరసన నేపథ్యం, ప్రభావం, ప్రాధాన్యం విస్మరించలేనిది. గత ఆరేండ్ల కాలంలో దేశంలో మూకదాడులు జరుగుతుండటం పట్ల ఆందోళన పెరిగిపోతున్నది. సోషల్‌ మీడియాలో విద్వేష ప్రచారం కూడా కొన్ని సామాజికవర్గాలకు భయాందోళనలను సృష్టిస్తున్నది. ఈ క్రమమే మహిళలు ముందుకు వచ్చి ప్రదర్శనలు జరిపే పరిస్థితికి దారి తీసింది.

దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం, నిరసన హక్కులపై అర్థవంతమైన చర్చ సాగడం హర్షణీయం. షాహీన్‌బాగ్‌లో రెండు నెలలకుపైగా సాగుతున్న నిరసనపై సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన ఆదేశాలు గమనార్హమైనవి. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు ఊతం ఇచ్చాయనడంలో సందేహం లేదు. అయితే ఈ నిరనసన ప్రదర్శన రాకపోకలకు ఆటంకంగా మారిందనే విషయమై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో పరమోన్నత న్యాయస్థానం నిరసన తెలిపే హక్కును గుర్తిస్తూనే, ఇతరులకు ఆటంకం కలుగకుండా చూడాలని సూచించింది. రాకపోకలకు అంతరాయం కలుగుతున్నందు వల్ల నిరసన ప్రదర్శకులను తొలిగించాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిరసనహక్కును ప్రాథమికహక్కుకు భంగం కలుగకుండా, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా పరిష్కారం సాధించాలని భావించింది. ఇందుకు మధ్యవర్తులను నియమించింది. దేశవ్యాప్తంగా ఐదు వేల షాహీన్‌బాగ్‌లు పుట్టుకొస్తాయి అంటూ ఒకరు నిరసన ఉద్యమకారుడు చేసిన వ్యాఖ్యను ప్రస్తావించినప్పుడు, ‘ ఐదు వేల నిరసనలు తలెత్తినా సమస్య లేదు. రహదారులపై ఆటంకం కలుగకూడదనే కోరుకుంటున్నాం... నిరసన తెలుపడం ప్రాథమికహక్కు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాసనానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడానికి అనుమతించాల్సిందేనని అంటూ, నిరసనలలోనే అభిప్రాయం రూపుదిద్దుకుంటుందని ధర్మాసనం వివరించింది. అయి తే హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటుందని, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా రహదారులపై కాకుండా, నిర్దేశిత స్థలంలో నిరసన ప్రదర్శనలు జరుపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఇటీవలే అహ్మదాబాద్‌లో ఇచ్చిన ఒక ప్రసంగంలో నిరసనలపై వెల్లడించిన అభిప్రాయాలు పరిశీలించదగినవి. నిరసనలు ప్రజాస్వామ్యంలో ‘సేఫ్టీవాల్వ్‌' వంటివని అంటూ అసమ్మతిని దేశ వ్యతిరేకమైనదిగా, ప్రజాస్వామ్య విరుద్ధమైనదిగా ముద్ర వేయకూడదని హితవు చెప్పారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అభివృద్ధికి, సామాజిక సమన్వయానికి అవకాశం కల్పిస్తుందనీ, అయినప్పటికీ బహుళ సమాజంలోని అస్తిత్వాలు విలువలపై గుత్తాధిపత్యాన్ని నెరుపలేదని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు. రాజ్యాంగయం త్రాంగంతో అసమ్మతిని అణిచివేయ యత్నిస్తే, భావ వ్యక్తీకరణ చేయలేని భయానక పరిస్థితి ఏర్పడుతుందని కూడా అన్నారు. అసమ్మతికి తావు లేకుండా చేస్తే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికి, సామాజిక అభివృద్ధికి ప్రాతిపదికలు ధ్వంసం అవుతాయని కూడా ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, హక్కు లు, నిరసన మొదలైన అంశాలపై గత శతాబ్దంలోనే విపులమైన చర్చ సాగింది. 


పార్లమెంటులో మెజారిటీ నిర్ణయాలు, పాలన మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. సమాజంలోని అన్నివర్గాల గొంతు ను ప్రభుత్వం వినాలె. పార్లమెంటు బయట కూడా తమ ఆవేదనను వినిపించి న్యాయం పొందే అవకాశం భిన్నవర్గాలు ఉండాలనేది ప్రజాస్వామిక సూత్రం. అయితే నిరసనలు తెలుపడమే లక్ష్యం కాదు. ప్రజలు తమ అసమ్మతిని వినిపించడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి నిరసన తెలుపడం ఒక సాధనం మాత్రమే. నిరసనలు చేయడానికి అవకాశం ఇవ్వడమే కాదు, సమాజంలోని బలహీనవర్గాలు తమ గొంతును ఎంత మెల్లగా వినిపించినా దానికి స్పందించే సున్నితత్వం ప్రభుత్వానికి ఉండటమే ప్రజాస్వామ్య లక్షణం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్టు ప్రజలు నిరసన తెలుపుతున్నప్పుడు, మధ్యలో సమీక్షించుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబుకుతున్న నిరసనల విషయంలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్య చేశారు. సుప్రీంకోర్టు నిరసన హక్కును, ఇతరుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమతుల్యం సాధించే ప్రయత్నించింది. ఈ క్రమంలో షాహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగించే అంశంపై చర్చ మొదలైంది. అయితే రెండు నెలలకు పైగా సాగుతున్న షాహీన్‌బాగ్‌ నిరసన నేపథ్యం, ప్రభావం, ప్రాధాన్యం విస్మరించలేనిది. గత ఆరేండ్ల కాలంలో దేశంలో మూకదాడులు జరుగుతుండటం పట్ల ఆందోళన పెరిగిపోతున్నది. సోషల్‌ మీడియాలో విద్వేష ప్రచారం కూడా కొన్ని సామాజికవర్గాలకు భయాందోళనలను సృష్టిస్తున్నది. ఈ క్రమమే మహిళలు ముందుకు వచ్చి ప్రదర్శనలు జరిపే పరిస్థితికి దారి తీసింది. షాహీన్‌బాగ్‌ దాడి దేశవ్యాప్త నిరసనలకు స్ఫూర్తినిచ్చింది. ఇది రాజకీయంగానే కాదు, సామాజికంగా కూడా ఆయావర్గాలలో మార్పుకు దోహదపడవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏ సాధారణంగా సమాజంలోనైనా భిన్నత్వం ఉంటుంది. ఇక మన దేశంలోనైతే భిన్నత్వం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వం శాసనాలు చేసే ముందు భిన్నవర్గాల ఆకాంక్షలను, ఆందోళనలను దృష్టిలో పెట్టుకోవాలె. ప్రభుత్వం చేసిన శాసనమే కాదు, పరిపాలనా విధానం కూడా ఆందోళనలకు దారి తీయవచ్చు. నిరసనలు షాహీన్‌బాగ్‌లో జరుగుతాయా, మరోచోటనా అనేది కాదు, నిరసనల పట్ల ప్రభుత్వం ఏమేర స్పందిస్తుందనేది ప్రధానం. 


logo