ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 18, 2020 , T00:05

ఆశ్రితులను ఆదరిద్దాం

ఆశ్రితులను ఆదరిద్దాం

రెండు శతాబ్దాల సుదీర్ఘ సహజీవనం తర్వాత కూడా ఒక వలస జాతి స్థానిక జాతితో మమేకం కాలేకపోవడానికి కారణాలేమైనా ఉండొచ్చు, అంతమాత్రాన్నే వారి జాతీయతను తిరస్కరించడం అహేతుకం. వారికి కనీస హక్కులు నిరాకరించడం అమానుషం. రోహింగ్యాల 200 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా స్థానిక రాఖైన్‌లు వారు విదేశీయులుగా, అక్రమ వసలదారులుగా చూడటం అమానవీయం.

రోహింగ్యాలు అనగానే ఎవరైనా చెప్పగలిగే మాట వారు ముస్లిం వర్గ ప్రజలు అని. నిజానికి రోహింగ్యా ఒక మతానికి సంబంధించిన పదం కాదు. గత 200 ఏండ్ల కాలంలో నాటి అవిభాజ్య భారత్‌లోని బెంగాల్‌, అసోం ప్రాంతాలనుంచి కూలీలుగా, రోడ్డు నిర్మాణ కార్మికులుగా, పోర్టర్లుగా వలసపోయి మయన్మార్‌ (బర్మా)లోని రాఖైన్‌ (అరకాన్‌) రాష్ట్రంలో స్థిరపడినవారు.  తమను తాము రోహింగ్యాలుగా చెప్పుకోవడంతో అదే వారి జాతినామం గా స్థిరపడిపోయింది. నిజానికి రోహింగ్యాలలో ముస్ల్లింలతో పాటు నాడు వలసపోయిన హిందువులు కూడా ఉన్నారు. కాకపొతే వారి సంఖ్య అత్య ల్పం. అందుకే ప్రపంచానికి రోహింగ్యాలంటే ముస్లింలుగా ప్రపంచానికి పరిచయమైంది. 1430లో నాటి స్వతంత్ర అరకాన్‌ (ప్రస్తుత రాఖైన్‌ ప్రాంతం) దేశంలోకి మొదలైన భారతీయ బెంగాలీ ముస్లింల వలసలు, బర్మారాజు 1784లో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే వరకు కొనసాగాయి. ఆ తర్వాత 1824లో బ్రిటన్‌ బర్మాను ఆక్రమించుకొని బ్రిటిష్‌ ఇండియా లో భాగంగా పరిపాలించింది. ఆ కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం, రోడ్డు నిర్మాణాల కోసం రైతుకూలీలుగా, పోర్టర్లుగా పనిచేసేందుకు నాటి బెంగాల్‌, అసోం ప్రాంతాల నుంచి వేలాదిమంది భారతీయులను ముఖ్యంగా ముస్లింలను తరలించింది. ఫలితంగా అరాకాన్‌లో ముస్లిం ల సంఖ్య పెరిగిపోయింది. ఈ వలసలు 1948లో బర్మాకు స్వాతంత్య్రం ప్రకటించేదాకా కొనసాగాయి. బెంగాల్‌ నుంచి బర్మా వరకు సాగిన వారి ప్రయాణాన్ని వలస అని కూడా చెప్పలేం, ఎందుకంటే నాడు బెంగాల్‌, బర్మా రెండూ బ్రిటిష్‌ ఇండియాలో భాగమే. దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బతుకుదెరువు కోసం పోవడమే.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తమకు సహకరిస్తే యుద్ధానంతరం ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తామన్న బ్రిటిష్‌ వాగ్దానాన్ని విశ్వసించి రోహింగ్యాలు  బ్రిటిష్‌ సైన్యానికి అండగా నిలిచారు. బ్రిటిష్‌ వారు వారి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు కానీ, రోహింగ్యాల స్వతంత్ర కాంక్ష వారిని బర్మా ప్రజల దృష్టిలో చొరబాటుదారులుగా నిలిపింది. పర్యవసానంగా సాంస్కృతిక విభేదాలు, భూ వివాదాలు పెరిగాయి. వీటన్నింటి ఫలితమే ఇప్పుడు జరిగిన, జరుగుతున్న నరమేధం. 2016-17వరకు మయన్మార్‌లోని రాఖైన్‌ రాష్ట్రంలో రోహింగ్యాల సంఖ్య 11లక్షలకు పైనే. ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు పరిమితమైంది. వారి జీవితాలు ఛిద్రమయ్యాయని చెప్పడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. ఐరాస 2018లో చేసిన ప్రకటన ప్రకారం ప్రపంచంలో అత్యంత వివక్షకు గురైన మైనారిటీ వర్గం  రోహింగ్యాలు.

మయన్మార్‌ (బర్మా) జనాభాలో బౌద్ధుల సంఖ్య 88 శాతం, క్రిస్టియన్‌ జనాభా 6.5 శాతం, రోహింగ్యాలతో కూడిన ముస్లిం జనాభా 4.2 శాతం, హిందువుల సంఖ్య కేవలం 0.5 శాతం. బర్మా 1948లో స్వాతంత్య్రం పొందిన తరువాత రోహింగ్యాలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఒప్పుకోలేదు. పైపెచ్చు బెంగాలీలు (రోహింగ్యాలు) తమకు తాము ఆపాదించుకున్న  రోహింగ్యా జాతిని బర్మా జాతీయులుగా గుర్తించలేదు. 1962లో బర్మాలో మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోహింగ్యాల  కష్టాలు రెట్టింపయ్యాయి. ఆపరేషన్‌ కింగ్‌ డ్రాగన్‌  పేరుతో నాడు మిలిటరీ చేసిన అకృత్యాలెన్నో. అప్పుడే బంగ్లాదేశ్‌కు వలసలు మొదలయ్యాయి. ఆ తర్వాత మిలిటరీ చేపట్టిన  ఆపరేషన్‌ క్లీన్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ నేషన్‌ పేరుతో  2 లక్షల మంది రోహింగ్యాలను స్వదేశం వదిలిపారిపోయేలా చేసింది. 2012లో మయన్మార్‌ లోని శరణార్థి శిబిరంలోకి లక్షా 40 వేల మంది రోహింగ్యాలను తరలించారు. రోహింగ్యాల మీద ప్రభుత్వ/మిలిటరీ దాష్టీకాన్ని బయటపెట్టిన ఇద్దరు బర్మా దేశ విలేకరులకు ఆ దేశ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంగించారనే నెపంతో ఏడేండ్ల శిక్ష విధించారు. ఇదక్కడి పరిస్థితులకు ఉదాహరణ. అనేక అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు మయన్మార్‌లో కొనసాగుతున్న వివక్షను 1948-1990 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల్లో కొనసాగిన అపార్థీడ్‌ విష సంస్కృతితో పోల్చాయి.  అపార్థీడ్‌ అంటే చట్టబద్ధమైన జాతి వివక్ష. కేవలం తెల్ల జాతీయులకు మాత్రమే ప్రభుత్వ సేవలు, సౌకర్యాలు అందుబాటులో ఉండటం, మిగతావారికి ఆయా సౌకర్యాలు నిషేధం.

బర్మాలోని రాఖైన్‌ రాష్ట్రం అత్యంత  వెనుకబడిన ప్రాంతం. ఆ రాష్ట్రం లోని జనాభాలో 69 శాతం దారిద్య్రరేఖ దిగువన జీవిస్తున్నవారే.1974 లో మూడు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 5. రాష్ట్ర జనాభా 31 లక్షల పైచిలుకు.

1931 నాటి లెక్కల ప్రకారం బర్మా రాజధాని రంగూన్‌లో భారతీయ హిందువుల జనాభా 55 శాతం. సుమారు 5 లక్షల 70 వేల పైచిలుకు. మయన్మార్‌ పాలకులు 1963-67 మధ్యకాలంలో మూడు లక్షల మంది హిందువులను, లక్ష మంది చైనీయులను అక్కడి నుంచి తరిమేశారు. 2014 నాటికి రంగూన్‌లో హిందువుల సంఖ్య 2 లక్షల 52 వేలకు పడిపోయింది. 83 ఏండ్ల తర్వాత రెట్టింపు కావలసిన జనాభా సగానికి పడిపోవడాన్ని చూస్తేనే అర్థమవుతుంది అక్కడ జాతుల సమస్య ఎంతతీవ్రం గా ఉన్నదో. జనాభాపరంగా చూస్తే నేడు బంగ్లాదేశ్‌లో 13 లక్షల మంది రోహింగ్యాలు జీవిస్తున్నారు, మయన్మార్‌లో 4 లక్షల మంది, మలేసియా లో లక్షా యాభై వేల మంది, సౌదీ అరేబియాలో లక్షా తొంభై వేల మంది, యూఏఈలో యాభై వేల మంది, పాకిస్థాన్‌లో 3 లక్షల 50 వేల మంది,  భారతదేశంలో 40 వేల మంది రోహింగ్యాలు బతుకుతున్నారు. మయన్మార్‌లో ఉన్నవారితో సహా అందరూ శరణార్థులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

రోహింగ్యాల ప్రధాన సమస్య బర్మాలో వారికి పౌరసత్వం. మొదటి నుంచి బర్మా ప్రభుత్వా లు వారిని బర్మా జాతీయులుగా నిరాకరిస్తూ వస్తున్నారు. వలస కార్మికులుగా షరతులతో కూడిన పౌరసత్వాన్ని ప్రసాదిస్తూ వచ్చా రు. 1982లో చేసిన మయన్మార్‌ పౌరసత్వ చట్టంతో ఆ సమస్య తీవ్రమైంది. రోహింగ్యాలను మినహాయించి బర్మాలో స్థిరపడిన మిగతా 135 జాతులను సహజ పౌరులుగా గుర్తించారు. రోహింగ్యాలకు మాత్రం 2010 వరకు ఇచ్చిన ఓటుహక్కును కూడా రద్దుచేశారు. 2015 నుంచి పౌరసత్వం తిరస్కరించారు. ఆ చట్టం ప్రకారం 1823కు ముందు బర్మా లో ఉన్నజాతులే పౌరసత్వానికి అర్హులు. మిగితావారు అసోసియేటెడ్‌ పౌరసత్వం, నేచురలైజేషన్‌ పౌరసత్వం పేరుతో పరిమిత పౌరసత్వానికి మాత్రమే అర్హులు. ప్రభుత్వ ఉద్యోగాలు, పౌరహక్కులు, విద్య, వివాహ స్వేచ్ఛ రోహింగ్యాలకు దూరమయ్యాయి.

ఆ క్రమంలో రోహింగ్యాలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు చేసిన పోరా టాలు తీవ్ర నిర్బంధాలకు బలయ్యాయి. మయన్మార్‌ పాలకుల దమనకాండలో 6,700 మంది రోహింగ్యాలు హతులయ్యారు, 7 లక్షల మంది దేశం వదిలి బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నారు. రోహింగ్యాలతో నిండిన బం గ్లాదేశ్‌లోని కుటుపలంగ్‌ శరణార్థి శిబిరం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరం.

రెండు శతాబ్దాల సుదీర్ఘ సహజీవనం తర్వాత కూడా ఒక వలస జాతి స్థానిక జాతితో మమేకం కాలేకపోవడానికి కారణాలేమైనా ఉండొచ్చు, అంతమాత్రాన్నే వారి జాతీయతను తిరస్కరించడం అహేతుకం. వారికి కనీస హక్కులు నిరాకరించడం అమానుషం. రోహింగ్యాల 200 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా స్థానిక రాఖైన్‌లు వారు విదేశీయులు గా, అక్రమ వసలదారులుగా చూడటం అమానవీయం. ఇప్పటికైనా సాటి మనుషులుగా రోహింగ్యాలకు అందరూ అండగా నిలువాలి. వారి హక్కు లకు హామీ ఇవాలి.


logo