గురువారం 04 మార్చి 2021
Rangareddy - Jan 22, 2021 , 00:15:59

స్వచ్ఛపల్లెగా మంగళపల్లి

స్వచ్ఛపల్లెగా మంగళపల్లి

ఆమనగల్లు: మండలంలోని మంగళపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని  ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. దాదాపుగా 400 కుటుంబాలు గల గ్రామంలో మొత్తంగా 2120 జనాభా ఉంది. కొత్త పంచాయతీ ఏర్పాటు సమయంలో మంగళపల్లి నుంచి చింతలపల్లి గ్రామం విడిపోయింది. చెన్నకేశవకాలనీ మంగళపల్లి పంచాయతీలో కొనసాగుతున్నది. మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలో ఉంటుంది. గ్రామానికి బీటీ రోడ్డు మంజురూ కాగా ఇటీవలే పూర్తయి, వినియోగంలోకి వచ్చింది. మండల కేంద్రానికి కేవలం 15 నిమిషాల్లో గ్రామస్తులు చేరుకుంటున్నారు. 

అభివృద్ధి, పనితీరుపై ప్రశంసలు

గ్రామం అభివృద్ధి, పనితీరులో జిల్లా నుంచి మండల స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతున్నది. ప్రభుత్వ పథకాలు సమీక్షించే సందర్భంలో ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలు ఏవున్నా మంగళపల్లిని అధికారులు సందర్శించి తీరాల్సిందే. జిల్లాల్లో పల్లెప్రగతిని అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ ఈ గ్రామం నుంచే ప్రారంభించారు. పల్లెప్రగతి ఉద్దేశం, ప్రజల భాగస్వామ్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించారు. దీంతో గ్రామస్తులంతా ప్రభుత్వం ద్వారా మంజురైన ప్రతీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామంలో హరితహారం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీ ఏర్పాటు, పల్లెప్రకృతి వనాల నిర్మాణంలో మండలంలోనే మొదటి స్థానంలో గుర్తింపు పొందింది. సర్పంచ్‌ నర్సింహరెడ్డి, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తున్నారు.

ఓడీఎఫ్‌ గ్రామంగా గుర్తింపు..

బహిరంగ మల మూత్ర విసర్జనకు దూరంగా  ఉంటూ ఓడీఎఫ్‌ గ్రామంగా గుర్తింపు పొందింది. గ్రామంలో మెజార్టీ కాలనీల్లో అంతర్గత మురుగు కాల్వలు, సీసీరోడ్డు నిర్మాణం పూర్తయ్యాయి. గ్రామానికి వేళ్లే దారిలో రోడ్డుకిరువైపులా స్వాగతం చెప్పేలా మొక్కలు దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా ఎల్‌ఈడీ విధి దీపాలు, సీసీ కెమెరాల నిఘా, సురక్షిత తాగునీటి సౌకర్యం, గ్రంథాలయం, కమ్యూనిటీ హాలు, అన్నిటి కంటే పంచాయతీలో ఉన్న రక్షకట్ట గ్రామానికే తలమానికంగా నిలుస్తుంది. ప్రతీ రోజు ఉదయం సాయంత్రం చెత్తసేకరణ, ప్లాస్టిక్‌ వాడకం నిషేధం, తడి పొడి చెత్త సేకరణ, రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణ పంచాయతీ సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నం అవుతారు.

సమష్టి కృషితోనే అభివృద్ధి..

మంగళపల్లిని ఆదర్శ గ్రామంగా గుర్తింపు తీసుకురావాలని నా తపన. పల్లె ప్రగతి పథకం వల్ల గ్రామం రూపు రేఖలు మారాయి.  ప్రతీ కాలనీలో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణకు ట్రాక్టర్‌ వినియోగిస్తున్నాం. పల్లె ప్రకృతి వనాలు, క్రిమిటోరియం, డంపింగ్‌ యార్డుల నిర్మాణాల వల్ల గ్రామానికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రజలు, పాలక వర్గం సభ్యులు సహకరిస్తే రంగాల్లో అభివృద్ధి చేస్తా.

- తిప్పిరెడ్డి నర్సింహరెడ్డి, సర్పంచ్‌, మంగళపల్లి

VIDEOS

తాజావార్తలు


logo