సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Jan 23, 2020 , 03:11:48

పుర పోలింగ్.. ప్రశాంతం

 పుర పోలింగ్.. ప్రశాంతం


నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలుండగా.. బుధవారం వీటికి పోలింగ్ నిర్వహించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 80వార్డులుండగా.. 1,47,055మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 72,163మంది పురుషులు, 74,879 మంది మహిళలు, 12మంది ఇతరులు ఓటర్లున్నారు. నిర్మల్ 89,590మంది ఓటర్లు, భైంసాలో 41,731మంది ఓటర్లు, ఖానాపూర్ 15,734మంది ఓటర్లున్నారు. వీటిలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్ రెండు వార్డులను టీఆర్ ఏకగ్రీవంగా దక్కించుకోగా.. భైంసాలో మూడు వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా దక్కించుకుంది.

జిల్లాలో 75వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. దీంతో జిల్లాలో 75వార్డుల్లో 1,37,988మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 67,423 మంది పురుషులు, 70,553మంది మహిళలు, 12మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. నిర్మల్ 42వార్డులకుగాను.. రెండు ఏకగ్రీవమైన వార్డులకు పోలింగ్ లేకపోగా.. 40వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో 85,171మంది ఓటర్లు ఉండగా... ఇందులో 41,277మంది పురుషులు, 43,892మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటర్లు ఉన్నారు. భైంసాలో 26వార్డులకుగాను.. 3వార్డులు ఏకగ్రీవమవగా.. 23వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో 37,083మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 18,497మంది పురుషులు, 18,576మంది మహిళలు, 10మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు.

217 కేంద్రాల్లో పోలింగ్

జిల్లాలో బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మూడు మున్సిపాలిటీల్లో 217పోలింగ్ కేంద్రాలను 88ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నిర్మల్ 127పోలింగ్ కేంద్రాలను 52ప్రాంతాల్లో, భైంసాలో 66కేంద్రాలను 25 ప్రాంతాల్లో, ఖానాపూర్ 24కేంద్రాలను 11ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఏకగ్రీమైన ఐదు వార్డుల్లో 15 పోలింగ్ కేంద్రాలు మినహాయించి.. 75వార్డుల్లో 202 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. నిర్మల్ జిల్లాలో 1,37,988 మందికిగాను 91,598 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ 85,171మందికిగాను 55,628మంది ఓటు వేయగా..65.31 శాతం పోలింగ్ నమోదైంది. భైంసాలో 37,083మందికిగాను 23,994 మంది పోలింగ్ పాల్గొనగా..64.70శాతం పోలింగ్ నమోదైంది.

ఖానాపూర్ 15,734మందికిగాను 11,976 మంది పోలింగ్ పాల్గొనగా.. 76.12శాతం పోలింగ్ జరిగింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా.. తొలి రెండు గంటల్లో ఉదయం 9గంటల వరకు సగటున 13.22శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11గంటల వరకు 28.65శాతం, మధ్యాహ్నం 1గంట వరకు 52.10శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 59.93శాతం, సాయంత్రం 5గంటల వరకు 66.38శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 65.93శాతం పోలింగ్ పాల్గొనగా.. మహిళలు 66.82శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో అత్యధికంగా ఖానాపూర్ 76.12శాతం, అత్యల్పంగా భైంసాలో 64.70శాతం పోలింగ్ నమోదు కాగా.. నిర్మల్ 65.31శాతం పోలింగ్ నమోదైంది.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖ నాయకులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఎం.ప్రశాంతి, ఎస్పీ సి.శశిధర్ జిల్లా కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఎం.ప్రశాంతి ఆర్ కార్యాలయంలోని 123వ పోలింగ్ కేంద్రంలో వరుసలో నిలబడి ఓటు వేశారు. ఎస్పీ సి.శశిధర్ శిశుమందిర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, టీజీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ ఖానాపూర్ మున్సిపాలిటీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా.. అధికారులు, పోలీసులు అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించగా.. వెబ్ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ లైవ్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో మొత్తం 296 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భైంసాలో 26వార్డులకుగాను 3 వార్డులు ఏకగ్రీవం కాగా.. 23వార్డుల్లో 88 మంది, నిర్మల్ 42వార్డులకుగాను 2వార్డులు ఏకగ్రీవంకాగా.. 40వార్డుల్లో 148మంది, ఖానాపూర్ 12వార్డులకు 60మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన అధికారులు

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా ఉన్నతాధికారులు మూడు మున్సిపాలిటీల్లో పర్యటించి.. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. భైంసాలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి, ఎస్పీ సి.శశిధర్ జాయింట్ కలెక్టర్ ఎ.భాస్కర్ సందర్శించి.. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ పట్టణంతో పాటు ఖానాపూర్ పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎం.ప్రశాంతి సందర్శించి.. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఖానాపూర్ ఏఎస్పీ శ్రీనివాసరావు బందోబస్తు పర్యవేక్షించగా.. ఆర్డీవో ప్రసూనాంబ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. నిర్మల్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను టీఆర్ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, తిరుపతిరెడ్డి, దివ్యారెడ్డి, వినోదమ్మలు సందర్శించి.. పోలింగ్ సరళిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు.logo