ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 05, 2020 , 00:58:25

వర్షానందం

వర్షానందం

  • ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం m పొంగిపొర్లుతున్న వాగులు m నిండు కుండలా చెరువులు, కుంటలు

చేర్యాల/ మిరుదొడ్డి/ మద్దూరు/ పెద్దశంకరంపేట/ సిర్గాపూర్‌/ కోహీర్‌ : ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వానకి గ్రామాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. చెక్‌డ్యాంలు అలుగు పారాయి. వర్షంతో కోహీర్‌ మండలంలోని గొటిగార్‌పల్లి పెద్దవాగుకు జలకళ సంతరించుకుంది. మద్దూరు మండల పరిధిలోని లింగాపూర్‌ చెక్‌డ్యాం, లద్నూర్‌ ఎల్లమ్మ చెరువు మత్తడి పోస్తున్నది. మోహితుమ్మెద, జెనిగల వాగులు ప్రవహిస్తున్నాయి. గాగిళ్లాపూర్‌ పెద్ద చెరువు, కూటిగల్‌ నల్ల చెరువు, కమలాయపల్లి, సలాఖపూర్‌, మర్మాముల తదితర గ్రామాల్లోని చెరువు, కుంటలతో పాటు ధూళ్మిట్ట, జాలపల్లి గ్రామాల్లోని చెక్‌డ్యాంలలోకి వరదనీరు చేరుకుంది. సిర్గాపూర్‌ మండలంలో సంగం గ్రామ రహదారి వరద తాకిడికి కొట్టుకుపోయింది. ఈ మార్గమధ్యలోని భారీ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో, తాత్కాలికంగా వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జడ్పీటీసీ రాఘవరెడ్డి, సంగం సర్పంచ్‌ రవీందర్‌ వాగు వద్దకు సందర్శించి రాకపోకలకు సెంట్రింగ్‌ కట్టెలతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. ఈ వర్షంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు నాటుకోవడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.

భారీగా వర్షపాతం నమోదు..

మద్దూరు మండలంలో 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మిరుదొడ్డి మండలంలో 98.6 మిల్లీమీటర్లు, చేర్యాల మండలంలో 46.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెద్దశంకరంపేట మండలంలో 45.66 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఆయా మండలాల అధికారులు తెలిపారు.


logo