Jupally Krishna Rao | ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఓట్లు వచ్చాయా, లేదా? అని లెక్క తేల్చే పనిలో పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ మండలానికి ఎన్ని డబ్బులు పంపింది, అందులో ఎంత ముట్టింది? అని పనిలో పనిగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆయన ఆరా తీస్తున్నారు. ఎక్కువ డబ్బులు పంపిన చోటనేమో తక్కువ ఓట్లు, తక్కువ డబ్బులు పంపిన చోటనేమో ఎక్కువ ఓట్లు రావడం పట్ల జూపల్లికి అనుమానం వచ్చింది. దీంతో పంచాల్సిన డబ్బులు మధ్యలో నొక్కిసిన అనుచరుల బండారం బయట పడటంతో వారు మొకం చాటేస్తున్నారట. ఈ కూపీ లాగడం ఇప్పుడు అవసరమా? దీనివల్ల తనకు నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదని ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆందోళన చెందుతున్నట్టు వినికిడి.
ఆ సంగతి చూడు ముందు
వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారట. ఒకవైపు ఎంపీ ఎన్నికలు జరుగుతుంటే గాలికి వదిలేసి గాంధీభవన్‌లో జగ్గన్న టైమ్‌పాస్ చేస్తున్నారనీ మండి పడుతున్నారు. నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ హయాంలో అలా జరిగింది, ఇలా జరిగిందని మీడియా వాళ్ల మెదడు తింటున్నారని ఎవరో ఫిర్యాదు కూడా చేశారట. దీంతో నెహ్రూ సంగతి తర్వాత ముందు పార్టీ అభ్యర్థి సంగతి చూడండి అని పెద్దలు సూచించినట్టు సమాచారం.
కర్మ కాకపోతే..?
గేట్లు తెరిచినా ఎమ్మెల్యేల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో చోటా మోటా నాయకులు ఎవరు వచ్చినా చేర్చుకోమని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. చివరికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్స్‌గా పోటీ చేసి పార్టీ ఓటమికి కారణమైన వారు వచ్చినా చేర్చుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఖర్మ ఏం చేస్తాం నా ఓటమికి కారణమైన వాడి మెడలో నేనే కండువా కప్పాల్సి వచ్చిందని చేరికల కమిటీ నాయకుడు జగ్గన్న వాపోయారు.
బొమ్మలు పెట్టుకోక తప్పలేదు
బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, నేనేమీ మోదీ, అమిత్ షా బొమ్మలు పెట్టుకొని గెలువలేదని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఇప్పుడు అదే రఘునందన్ రావు తరపున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరూ వస్తున్నారు. గెలిస్తే సరి, ఓడితే మటుకు వారి బొమ్మలు పెట్టుకోవడం వల్లనే తాను ఓడిపోయానని రఘునందన్ అంటారేమో చూడాలి మరి.
– వెల్జాల