ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 18:25:48

కరువు నేల పాలమూరులో గంగమ్మ పరుగులు

కరువు నేల పాలమూరులో గంగమ్మ పరుగులు

కరువు నేలలో గంగమ్మ పరుగులు పెడుతోంది. చుక్క నీటి కోసం కోటి కష్టాలు పడ్డ పాలమూరు బిడ్డల తిప్పలను కడతేర్చేందుకు.. టీఆర్ఎస్ ప్రభ్వుత్వం అపరభగీరథ ప్రయత్నంతో బీడు భూములను పసిడి మాగాణాలుగా మారుస్తున్నది. భూగర్భ జలాలు పెంపొందించేందుకు.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి పంట పొలాలకు తరలించేందుకు చెక్ డ్యాంలను నిర్మిస్తున్నది. ప్రభుత్వం ముందు చూపుతో చేస్తున్న పనుల ఫలితాలు నేడు చేతికి అంది వస్తున్నాయి. బంగారు తెలంగాణ సాకారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.


వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పామాపురం గ్రామ సమీపంలోని ఊకచెట్టు వాగులో నూతనంగా నిర్మించబడిన చెక్ డ్యాం కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో  ఎడారిని తలపించే బీడు భూముల్లో జల సవ్వడుల నాదాలు చూపరులను సమ్మోహితుల్ని చేస్తున్నది. అంతేకాదు వాగు మధ్యలో 36 అడుగుల శివుని భారీ విగ్రహం..శివుడి కొప్పులోని గంగమ్మనే దిగి వచ్చి పాలమూరు నేలల్లో పరుగులిడితోందా అని అచ్చెర్వొందేలా ఈ జల దృశ్యం పరవశితుల్ని చేస్తోంది.

మత్తడి దుంకుతున్న నీటి సోయగం .. ఎదురెక్కుతున్న చేప పిల్లల విన్యాసాలు..వెరసి ఆనందాన్ని నింపుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నది ఈ చెక్ డ్యాం. కలలో కూడా ఊహించని దృశ్యం..కండ్ల ముందు సాక్షాత్కారమవుతుండటంతో ఉప్పొంగే ఉత్సాహంతో ఆ దృశ్యాల్ని తమ కెమెరాల్లో  బందిస్తూ సందర్శకులు ఆనంద సాగరంలో తేలిపోతున్నారు.