మంగళవారం 11 ఆగస్టు 2020
Sunday - Jul 04, 2020 , 22:54:18

‘నాబికాడ సల్లవడితే నవాబుతో పోట్లాడొచ్చు’

‘నాబికాడ సల్లవడితే నవాబుతో పోట్లాడొచ్చు’

తెలంగాణ తిరుగుబాటు నేల. కుక్కిన పేనులా ముభావంగా ఉండిపోయే మట్టికాదు ఇది. పోరాటాల్లో తన ప్రభావాన్ని చూపిన ప్రత్యేక ప్రాంతం. అందుకే మన మాటల నుంచి పాటలు, పద్యాలు, సామెతల వరకూ అన్ని పలుకుబడుల్లోనూ ఆ పోరాట గాథలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి సామెతే ‘నాబికాడ సల్లవడితే నవాబుతో జవాబు చెప్పవచ్చు/సవాల్‌ చెయ్యవచ్చు/పోరాడవచ్చు’. మనుషుల బొడ్డు దగ్గర(కడుపులో) కాస్త తిండి పడిందనుకోండి, వాళ్ళు ఏకంగా రాజులు అడిగిన ప్రశ్నలకైనా జవాబు చెప్పగలరు. పైగా వాళ్ళనే ఎదురు ప్రశ్నించగలరు. అవసరమైతే పోరాడగలరు. ఎందుకని? ఒకటి తిండివల్ల వచ్చిన బలం. మరోటి ఇక్కడి మట్టి మహత్యం. ఇది తరతరాలుగా ధిక్కార చరిత్ర కలిగిన ధరిత్రి కాబట్టి. అధికారం అనేది కారమై వేధిస్తుంటే తిరగబడే స్వభావం ఉన్న నేల మనది. 

‘నల్లమొకం పిల్లి ఎలుకపక్కల పన్నదట’


సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తన ఉన్నప్పుడు ‘నల్లమొకం పిల్లి ఎలుకపక్కల పన్నదట’ వంటి సామెతను ఉపయోగిస్తారు. ఎందుకంటే.. పిల్లి అనేది ఎలుకలను పట్టాలి. అది పిల్లి జాతి గుణం. కానీ, ఒక  నల్లమొకం పిల్లి.. సహజ స్వభావానికి విరుద్ధంగా ఎలుక పక్కలో పడుకున్నది. ఎంత దిగజారుడుతనం! ఎంత దివాళాకోరు గుణం. ఇది అసహ్యమైన స్థితి. కొందరు తాము చేయాల్సిన పనిని మర్చిపోయి.. ఇతరుల పనుల్లో నిమగ్నమవుతారు. అత్యాశకుపోయి విరోధులకు ఉప్పందిస్తుంటారు. అలాంటి వారి కుతంత్రాన్ని ఎత్తిచూపే సామెత ఇది.

మీకు మొకం గొట్టిందా?


‘మొహం మొత్తింది’ అనే మాటకు అర్థం.. ఒక విషయమ్మీద, వస్తువు మీద, అలవాటు మీద అయిష్టత ఏర్పడటం. దీన్నే తెలంగాణ ప్రాంతంలో ‘మొకం గొట్టింది’ అంటారు. ‘గ్యారలు తినీతినీ  నాకు మొకం గొట్టినట్లయింది. ఇగ నాకు వద్దు’ అంటారు. తెలుగులోని ‘మొత్తడం’లో కొంత నిందార్థం ఉంది. కానీ, తెలంగాణలోని ‘కొట్టుడు’లో ఆ నింద లేకపోగా.. పదమే హూందాగా మారింది. అవమాన భారంతో తలదించుకునే పరిస్థితుల్లో ‘వాడు మొకం నాలెకు ఏసిండు’ అంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని ‘తల’ తెలంగాణలో ‘మొకం’ అయ్యింది. ‘దించుకుని’ నాలెకు ఏసుడుగా మారింది. ‘నాలె’ అంటే ‘నేల’ అని అర్థం.

తెప్ప చినుకులు చూశారా?


 వర్షాకాలంలో ‘రేయ్‌.. తెప్ప చినుకుల్లో తడ్వకు’ అని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఇక్కడ తెప్పలు అంటే మేఘాలు. తెలంగాణలో మేఘాలను తెప్పలుగా పిలుస్తుంటారు. సాధారణార్థంలో ‘తెప్ప’ అంటే జలాశయాల్లో ఉపయోగించే సాధనం. దాని సాయంతో నీటిపై పయనిస్తాం, గట్టుకి చేరుతాం. ఇక్కడ ఆకాశంలోని మబ్బుల్ని ‘తెప్పలు’ అనడం తెలంగాణ ప్రజల ఊహాశక్తికి  ఉదాహరణ. వాళ్ళ ఆకాశం సముద్రం వంటిది. ఎందుకు? సముద్రంలాగే ఆకాశం నీలం రంగులో ఉంటుంది. పైగా విశాలంగా పరచుకుని ఉంటుంది. ఆ నీలాకాశంలో తెల్లగా కనిపించేవి.. తెలంగాణ వాసులకు మేఘాలు కాదు, తెప్పలు. అందుకే వర్షం కొద్దిగా పడితే ‘అవి తెప్ప చినుకులు’ అంటుంటారు. 

కార్టూన్స్‌: మృత్యుంజయ్‌


logo