శనివారం 16 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 01:14:23

దెబ్బ మీద దెబ్బ

దెబ్బ మీద దెబ్బ

  • టీమ్‌ఇండియా ఆటగాళ్లకు వరుసగా గాయాలు 
  • బ్రిస్బేన్‌ టెస్టుకు బుమ్రా, విహారి, జడేజా దూరం  
  • స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లపైనా తీవ్ర ప్రభావం  

నమ్మశక్యంగా అనిపించడం లేదు.. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.. ఒకరా.. ఇద్దరా..  టీమ్‌ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఏ ముహూర్తాన ఆస్ట్రేలియా పర్యటన మొదలైందో కానీ భారత్‌ కష్టాలు పరాకాష్టకు చేరాయి. ఐపీఎల్‌లో గాయపడి కొందరు టూర్‌కు దూరమైతే ఆసీస్‌కు వచ్చాక ఇక్కట్లు రెట్టింపయ్యాయి. టెస్టు సిరీస్‌లో షమీ నుంచి బుమ్రా వరకు ఏకంగా ప్రధాన పేస్‌ దళం మొత్తం వైదొలిగింది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజే.. నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్‌ కానున్నాడు. సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారి, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ ఇలా బ్యాటింగ్‌ విభాగంలోనూ టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బలే తగిలాయి. వచ్చే నెల నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో మొదలయ్యే సిరీస్‌ల్లోనూ గాయాల ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. 

...నమస్తే తెలంగాణ క్రీడావిభాగం

టీమ్‌ఇండియాకు గాయాల బెడద తీవ్రమైంది. సిడ్నీ వేదికగా మూడో టెస్టులో గాయపడ్డ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌కు దూరమయ్యాడు. అద్భుత పోరాటంతో మెప్పించి సిడ్నీ టెస్టును  డ్రా చేసిన తెలుగు ఆటగాడు హనుమ విహారి, సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ జడేజా సైతం వైదొలిగారు.  స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ దెబ్బలతో బాధపడుతున్నా 1-1తో సిరీస్‌ సమమై కీలకంగా మారిన నాలుగో టెస్టులో ఆడేందుకే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాన బౌలర్లందరూ గాయాల పాలవడంతో కెరీర్‌లో మూడో టెస్టులోనే హైదరాబాద్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.. ప్రధాన పేసర్‌గా మారాడు. ఇక బుమ్రా స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌లో ఒకరిని, జడేజా స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను నాలుగో టెస్టుకు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక విహారి స్థానంలో పూర్తి ఫిట్‌నెస్‌తో లేకున్నా మయాంక్‌ అగర్వాల్‌ను తీసుకోవచ్చు. మొత్తంగా బోర్డర్‌ -  గవాస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకొని బ్రిస్బేన్‌లో పట్టుదలగా ఉన్న భారత్‌కు గాయాల దెబ్బ తగిలింది. కాగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. 

హనుమ విహారి  - తొడ కండరాలు

అసమాన పోరాటంతో సిడ్నీ టెస్టులో చివరి రోజు 161 బంతులు ఆడిన హనుమ విహారికి తీవ్రమైన (గ్రేడ్‌-2) కండరాల గాయమైంది. దీంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. అలాగే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు నుంచి విహారి దాదాపు వైదొలిగినట్టే కనిపిస్తున్నది. 

రవీంద్ర జడేజా- ఎడమ చేతి బొటన వేలు 

టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, మంచి ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాకు సైతం మూడో టెస్టులోనే దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ వేసిన బంతి తగలడంతో జడేజా ఎడమ చేతి వేలికి తీవ్రమైన గాయమైనట్టు స్కానింగ్‌లో తేలింది. దీంతో కనీసం రెండు నెలలు అతడు జట్టుకు దూరం కానుండగా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సైతం అందుబాటులో ఉండడం లేదు.  

జస్ప్రీత్‌ బుమ్రా- పొత్తికడుపు 

టీమ్‌ఇండియా గాయాల జాబితాలో భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తాజాగా చేరాడు. మూడో టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తూ అతడు పొత్తికడుపు ఒత్తిడికి గురయ్యాడు. దీంతో ఆ తర్వాత బౌలింగ్‌ వేయలేదు. నొప్పి తీవ్రమవడంతో ఏకంగా బ్రిస్బేన్‌లో జరిగే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. 

మహమ్మద్‌ షమీ-ముంజేయి

ఆసీస్‌తో అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి డే అండ్‌ నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా ఏస్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీకి గాయమైంది. ప్యాట్‌ కమిన్స్‌ బౌన్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో షమీ ముంజేతికి దెబ్బ తగిలింది. దీంతో మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. అలాగే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో షమీ ఆడేది అనుమానంగా మారింది. 

అశ్విన్‌ -వెన్నునొప్పి

భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరిస్తూనే సిడ్నీ టెస్టులో మ్యాచ్‌ సేవింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకుముందు రోజు బాధతో అతడు సరిగా నిద్రపోలేదు. కనీసం షూలేస్‌ కట్టుకునేందుకు కూడా ఇబ్బందులు పడ్డాడు. అయితే పెయిన్‌ కిల్లర్లు వేసుకొని జట్టు కోసం ఆడాడు. నాలుగో టెస్టులో అశ్విన్‌ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్‌ అశ్వినే(134 ఓవర్లు). 

పంత్‌ -మోచేయి 

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ వేసిన బంతి తగలడంతో భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మోచేతికి గాయమైంది. అయితే ఫ్యాక్చర్‌ కాలేదని స్కానింగ్‌లో తేలడంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన అతడు అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 97 పరుగులతో దాదాపు జట్టును గెలిపేంచే ప్రదర్శన చేసిన పంత్‌.. నాలుగు టెస్టులో ఆడనున్నాడు. 

రోహిత్‌ శర్మ   

ఐపీఎల్‌లో తొడ కండరాలు పట్టేయడంతో ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొలుత ఎంపిక కాలేదు. అయితే గాయంతోనే ముంబై ఇండియన్స్‌ తరఫున చివరి మ్యాచ్‌లు ఆడడంతో అతడికి మళ్లీ అవకాశం వచ్చింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు మిస్సయినా ఎట్టకేలకు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. అయితే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండడంతో సిడ్నీ టెస్టుతోనే జట్టులోకి వచ్చాడు. 

కేఎల్‌ రాహుల్‌ -మణికట్టు

ఆసీస్‌ టూర్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌.. టెస్టు అవకాశమొచ్చే ముందు గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా మణికట్టుకు దెబ్బ తగలడంతో అతడిని భారత్‌కు తిరిగి పంపారు. ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం సిద్ధమవ్వాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

అగర్వాల్‌  -చేతి వేలు

తొలి రెండు టెస్టుల్లో విఫలమై ఉద్వాసనకు గురైన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌.. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడ్డాడు. అతడి గ్లౌవ్స్‌కు బంతి తాకి వేలికి దెబ్బతగిలింది. అయితే స్వల్ప గాయమే కావడంతో.. హనుమ విహారి స్థానంలో మరో ఆప్షన్‌ లేకపోవడంతో బ్రిస్బేన్‌ టెస్టులో మయాంక్‌ ఆడకతప్పని పరిస్థితి ఏర్పడింది.

ఉమేశ్‌ యాదవ్‌ - కాలిపిక్క కండరాలు

ఆసీస్‌తో రెండో టెస్టులో కాలిపిక్క కండరాలకు గాయమవడంతో మిగిలిన మ్యాచ్‌లకు భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ దూరమయ్యాడు. త్వరలో అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లనున్నాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌కు జట్టులోకి అతడు తిరిగి వచ్చే అవకాశం ఉంది. 

ఐపీఎల్‌లోనే ఆరంభం 

ఆస్ట్రేలియా పర్యటనకు గాయాల కష్టాలు దుబాయ్‌ వేదికగా  జరిగిన ఐపీఎల్‌లోనే ప్రారంభమయ్యాయి.  హైదరాబాద్‌ తరఫున లీగ్‌లో ఆడిన సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కండరాల గాయం బారిన పడి టూర్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడిన సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ శర్మ కూడా గాయపడ్డాడు. ఇక ఆసీస్‌ గడ్డపై టీ20ల అరంగేట్రం చాన్స్‌ వచ్చినా అప్పటికే భుజం గాయంతో కోల్‌కతా తరఫున ఆడిన స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియాకు రాలేకపోయాడు.