గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 23:42:12

ఇవేం కోరికలు!

ఇవేం కోరికలు!

 • నియంత్రిత ప్రాంతాల్లో ప్రజల గొంతెమ్మ కోర్కెలు
 • కండోమ్‌లు, ఐపిల్స్‌ కావాలి..
 • మద్యం అడ్రస్‌ చెబుతా వెళ్లి బాటిల్‌ తీసుకురా
 • చాక్లెట్లు, బిర్యానీలు తీసుకురండి
 • బొగ్గులు కావాలంటూ ఇబ్బంది
 • లేదంటే బూతులు తిడుతున్న వైనం
 • తలలు పట్టుకుంటున్న అధికారులు 
 • అర్ధరాత్రిళ్లూ ఆదేశిస్తున్న ప్రజలు

న్యూస్‌ నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ :కరోనా విస్తరించకుండా ప్రభుత్వం పకడ్బందీగా కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలకు జీహెచ్‌ఎంసీ సిబ్బందే అన్ని సరుకులు తెచ్చి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. అసలు సమస్య అక్కడే మొదలవుతుందని ఎవరూ ఊహించలేదు. నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నిత్యావసరాలు, మందులు అడగడం మామూలే. కానీ.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కోరుతున్న గొంతెమ్మ కోర్కెలు అధికారులు, సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. కాదంటే వారు తిట్టే పచ్చి బూతులు వినలేని పరిస్థితి. అయినా సరే ఎంతో ఓపిగ్గా ప్రజలు అడుగుతున్న వస్తువులను అవసరాల మేరకు అందిస్తున్నారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది.

గొంతెమ్మ కోర్కెలు...

 • కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని ఎల్లమ్మబండ ఖాజానగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన నియంత్రిత జోన్‌లో కొందరు కండోమ్‌లు, ఐపిల్‌లు తెప్పించుకున్నారని సిబ్బంది ఇబ్బంది పడుతూ చెబుతున్నారు. దుకాణాలు మూసివేసిన తర్వాత కూడా పాలు, కూరగాయలు కావాలని, అర్ధరాత్రి మెడికల్‌ షాపునకు వెళ్లాలంటూ ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 • సికింద్రాబాద్‌ పరిధిలోని కౌసర్‌ మసీదు వద్ద ఓ వ్యక్తి బిర్యానీ కావాలని బల్దియా సిబ్బందితో ఏకంగా గొడవకే దిగాడు. మరొకరు రాత్రి 9 గంటలకు బొగ్గులు కావాలని కోరితే.. ఇంకొకరు ఏకంగా మం దుబాటిల్‌ దొరికే అడ్రస్‌ ఇది..వెళ్లి తీసుకురావాలంటూ బలవంత పెట్టాడు. నాకు నిద్రపట్టడంలేదు. వెళ్లి నిద్ర మాత్రలు తీసుకురమ్మని ఓ వ్యక్తి డిమాండ్‌ చేశాడు. 
 • వెస్ట్‌జోన్‌ పరిధిలోని 14 కంటైన్మెంట్‌ జోన్లలో ఎక్కు వ మంది ప్రజలు చికెన్‌ తేవాలని ఆర్డర్‌ వేస్తున్నారు. సిబ్బంది ఓపికగా తెచ్చిస్తున్నారు. తమకు డబ్బులు కావాలని, ఏటీఎం సెంటర్లకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. వాటికి నిబంధనలు ఒప్పుకోవడం లేదు. తాము తెచ్చిపెడతామంటే మాత్రం పిన్‌ నంబర్లు ఇవ్వబోమంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. 
 • పాతబస్తీ కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో బిర్యానీ, మటన్‌, చికెన్‌ కావాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంద్రానగర్‌ ప్రాంతంలోని ఓ కంటైన్మెంట్‌ జోన్‌లో నివాసముండే వారు తమకు పలానా డెయిరీ ఫాం నుంచి మాత్రమే పాలు కావాలని, అదే విధంగా రేపటికి చికెన్‌ తీసుకురావాలని ఆర్డర్లు వేస్తున్నారు. 
 • ఖైరతాబాద్‌లోని ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లోని కంటైన్మెంట్‌ జోన్‌లో కొందరి చర్యలతో సిబ్బంది నిత్యం అసహనానికి గురవుతున్నారు. కొన్ని ఇండ్లలో యజమానులు తమకు మద్యం కావాలని, ఎక్కడైనా దొరికితే పట్టుకురావాలని, బ్లాక్‌లో సైతం తెప్పిస్తే అందుకు ఎంత డబ్బయినా చెల్లిస్తామంటున్నారు. మరికొందరు సిగరెట్లు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు తమ పిల్లలు ఏడుస్తున్నారు చాక్లెట్లు తెచ్చివ్వండి, బిస్కెట్లు కావాలంటూ పదేపదే సిబ్బందిని కోరుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.

ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక... మరోవైపు వారు తిట్టే తిట్లు భరించలేక బల్దియా సిబ్బంది పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.


logo