IMF on Debt | రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒకేడాదిలో అంటే 2020లో ప్రపంచ దేశాలు తీసుకున్న రుణాలు పెరిగాయి. గతేడాది ప్రపంచ దేశాల రుణ భారం 226 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. ఇందులో సంపన్న దేశాలే ఎక్కువ రుణాలు పొందాయని అంతర్జాతీయ ద్యవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ జీడీపీలో గ్లోబల్ రుణ భారం 256 శాతం. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో గాడిలో పెట్టడంతోపాటు ఒమిక్రాన్ వంటి న్యూ వేరియంట్లను కట్టడి చేయడానికి వివిధ దేశాలు రుణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపింది.
ప్రజల ప్రాణాల పరిరక్షణ, వివిధ రంగాల ఉద్యోగులను కాపాడుకోవడంతోపాటు సంక్షోభంలో చిక్కుకున్న వివిధ సంస్థలు దివాలా ప్రకటించకుండా ప్రభుత్వాలు భారీ రుణాలు తీసుకోవడం చట్టబద్ధమేనని ఐఎంఎఫ్ అధికారులు అంటున్నారు. రుణ భారం పెరిగితే, కష్టాలు పెరుగుతాయని, ఆర్థిక పరిస్థితులు మరింత కఠినం అవుతాయని చెబుతున్నారు. మధ్యకాలిక రంగంలో ప్రైవేట్ రంగంలో ఇనెస్ట్మెంట్ కోసం మంజూరు చేసే రుణాలను రికవరీ చేసే సామర్థ్యం ప్రభుత్వాలకు ఉండాలి. కానీ అత్యధిక కేసుల్లో ఇదే ప్రధాన అవరోధంగా మారుతుందని ఐఎంఎఫ్ తెలిపింది.
గత 18 నెలల్లో వివిధ దేశాలు తీసుకున్న రుణాలు రికార్డు స్థాయిలో జీడీపీలో 99 శాతం ఉంటాయని ఐఎంఎఫ్ అంచనా. 1965 మధ్య నుంచి పోలిస్తే గత 18 నెలల్లో తీసుకున్న మొత్తం గ్లోబల్ రుణాల్లో అత్యధిక వాటా ప్రభుత్వ రంగానిదే. 2020 కరోనా, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు ఐఎంఎఫ్ సాయం ప్రకటించింది. గతేడాది సంపన్న దేశాల రుణాలు వాటి జీడీపీలో 90 శాతం. ఇక తక్కువ ఆదాయ దేశాలు లక్ష కోట్ల డాలర్ల చొప్పున రుణాలు తీసుకున్నాయి.