ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులను నకిలీ విత్తనాలు నట్టేట ముంచాయి. ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వం, అధికారుల సూచనల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తికి బదులు స్వల్పకాలిక పంట అయిన సోయాను దాదాపు లక్ష ఎకరాల్లో సాగు చేశారు. జూన్ మొదటి వారంలో వేసిన సోయా అక్టోబర్ మొదటి, రెండో వారాల్లో పంట చేతికొస్తుంది. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉన్న దశలో కాయల్లో మొలకలు రావడంతో రైతులు నష్టపోయారు.
సాధారణంగా కాయలు ఎండిపోయిన సమయంలో వానలు పడితే మొలకలు వస్తాయని, జిల్లాలో వేసవిని తలపిస్తున్న వాతావరణం ఉండగా మొలకలు వచ్చే అవకాశం లేదని, నకిలీ విత్తనాల ఇందుకు కారణమని రైతులు అంటున్నారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. లక్షల రూపాయల పెట్టుబడులతో సాగు చేసిన సోయా పంటను నకిలీ విత్తనాలు కారణంగా నష్టపోయామని, తమకు నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.