‘గుమ్ నామ్ హై కోయీ.. బద్నామ్ హై కోయీ..’ ‘నైనా బర్ సే రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్…’దేవత… మందిరాలలోనే కాదు.. మధురమైన సంగీతంలోనూ ఉంటుంది. సినీ సంగీతమైతే లతాజీ స్వరంలో ఉంటుంది. అందుకే ఆమె పాడిన ప్రతీ పాట మన హృదయాన్ని కదిలిస్తుంది. అందునా ఆమె పాడిన దయ్యం తాలూకు నేపథ్య గీతాలు కూడా ఈనాటికీ ఆ పాత మధురాలై అలరిస్తున్నాయి.
దయ్యం పాటలంటే ‘గోతిక్ నోయిర్’ వర్గానికి చెందినవని అంటారు. ఇవి కరుణ, విరహం, విషాదం, ఆర్తి మొదలైన భావోద్వేగాలతో రూపొందుతాయి. పాడుబడిన కోటలు, మంచు కురిసే రాత్రులు, పాత బంగళాలు, ఆత్మలు, దయ్యాలు, శృంగారం కలగలిసిన వాతావరణాన్ని సూచిస్తూ పాశ్చాత్య దేశంలో వెలువడిన సాహిత్యమే ..‘గోతిక్ ’! అలాగే ‘నోయిర్’ అనేది 1940 కాలంనాటి హాలీవుడ్ క్రైమ్ సినిమాల శైలి. ఈ రెండిటినీ కలిపి సినిమాల్లో చూపిస్తే దాన్నే ‘గోతిక్ నోయిర్’ అంటారు. అంటే, ఇక్కడ దయ్యం కేవలం భయపెట్టదు! ఒక వింతైన సమ్మోహనానికి, శృంగారానికి, విరహ వేదనకు గురిచేస్తుంది. దయ్యం లేదా ఆత్మ… చాలా అందంగా, తెల్లటి దుస్తుల్లో కనిపిస్తూ, హీరోను తన మధురమైన గొంతుతో ఆలపిస్తూ ఆకర్షిస్తుంటుంది. ఆమె మనిశా, దయ్యమా అనే సస్పెన్స్ చివరి వరకు సాగుతుంది.

Lag Ja Gale
బాలీవుడ్లో ఇలాంటి పాటలనూ అధిక సంఖ్యలో పాడిన ఖ్యాతి లతాజీ దే!
భారతీయ సినిమాలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి గోతిక్ నోయిర్.. ‘మహల్ ’(1949) చిత్రం. ఈ సినిమాలోని ఓ పాట భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి ఐకానిక్ ‘ఆత్మ’ గీతంగా నిలిచిపోయింది. దీనికి ఖేమ్‌చంద్ ప్రకాష్ సంగీతం అందించగా, నక్షబ్ జార్చవి సాహిత్యం అందించారు. హీరో అశోక్ కుమార్ ఒక పాత, నిర్మానుష్యమైన మహల్లోకి అడుగుపెడతాడు. ఆ రాత్రి సమయంలో ఎక్కడి నుంచో ఒక మధురమైన, అదే సమయంలో గంభీరమైన స్త్రీ గొంతు ‘ఆయేగా ఆనేవాలా…’ అంటూ పాడుతూ వినిపిస్తుంది. ఆ పాట విన్న హీరో ఆ గొంతు ఎవరిదా అని వెతుక్కుంటూ ఆ చీకటి మహల్ అంతా తిరుగుతాడు. ఆ శబ్దాన్ని వెంబడిస్తూ తోట వైపు వస్తాడు. అక్కడ చీకట్లో, దూరం నుంచి ఒక రహస్యమైన స్త్రీ (హీరోయిన్ మధుబాల) ఉయ్యాల మీద కూర్చుని వెనక్కి, ముందుకు ఊగుతూ కనిపిస్తుంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు, కేవలం ఒక నీడలా, ఆకారంలా మాత్రమే కనిపిస్తుంది. హీరో ఆమెను పట్టుకోవాలని, ఎంతో ఆత్రుతగా ఉయ్యాల వైపు పరుగెత్తుకెళ్తాడు. కానీ, అతను అక్కడికి చేరుకునే సరికి, అక్కడ ఎవరూ ఉండరు. కేవలం ఖాళీ ఉయ్యాల మాత్రమే ఊగుతూ ఉంటుంది.

Lata
ఈ సీన్ ద్వారా హీరో
ఆ ఇంట్లో ఒక ఆత్మ (దయ్యం) తిరుగుతున్నదని, ఆమె తన కోసమే ఎదురుచూస్తున్నదని నమ్మి, ఆమె మోహంలో, భ్రమలో పడిపోతాడు. దర్శకుడు కమల్ అమ్రోహి ఈ సీన్‌ను లైటింగ్, నీడలు ఉపయోగించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు ఈ సన్నివేశం కోసం.. లతాజీ పాడిన తీరు. సినిమా చూడని వారికి కూడా ఒక భయానక, అతీంద్రియ వాతావరణాన్ని కళ్లముందు ఉంచుతుంది. ఆ కాలంలో ‘ఆయేగా ఆనేవాలా’ పాట రేడియోల్లో ప్రసారమైనపుడు దేశమంతా ఆ ‘దయ్యం’ మాయలో పడి పోయింది.
1958లో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘మధుమతి’లో లతాజీ పాడిన ‘ఆజారే పర్దేశీ’ పాట విరహిణిగా ఉన్న నాయిక అన్వేషణలా సాగుతుంది. ఈ సినిమా కూడా పునర్జన్మ, మిస్టరీ నేపథ్యంలోనిదే! శైలేంద్ర సాహిత్యానికి సలీల్ చౌదరి సంగీతం అందించగా లతాజీ భావబంధురంగా పాడారు. నాయిక మధుమతి (వైజయంతీమాల) ఒక అమాయకమైన కొండజాతి అమ్మాయి. ఆమె హీరో ఆనంద్ (దిలీప్ కుమార్)ని తొలిసారి చూడగానే, అతనిపై ఇష్టంతో ప్రకృతి మధ్య పాడుకునే పాట ఇది. నిజానికి ఈ పాట దయ్యం పాట కాదు. ఈ పాట వచ్చేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో దట్టమైన పొగమంచు, కొండలు, శూన్యత కనిపిస్తాయి.
‘మధుమతి’ సినిమాకు కూడా ‘మహల్’ సినిమా ఎడిటర్ అయిన బిమల్ రాయ్ దర్శకత్వం వహించడం వల్ల, ఆ ‘హారర్/మిస్టరీ’ ఫీల్ ఇందులోనూ కనిపిస్తుంది. దాంతో అందరూ వైజయంతీమాల ఆత్మ రూపంలో పాడుతున్నదేమో అనుకుంటారు. కానీ, ఈ పాట పాడేటప్పుడు మధుమతి బతికే ఉంటుంది. సినిమా చివర్లో విలన్ (ప్రాణ్ ) చేసిన తప్పును నిరూపించడానికి, హీరో ఒక ప్లాన్ వేస్తాడు. మధుమతి లాగే ఉండే మరో అమ్మాయి (మాధవి)ని దయ్యంలా నటించమని అడుగుతాడు. క్లయిమాక్స్‌లో బిల్డింగ్ పైనుంచి ఇదే పాటనులోని ‘ఆజా రే.. మై తో కబ్ సే ఖడీ ఇస్ పార్…’ మరింత గంభీరంగా, పాడుతూ కిందికి దిగి వస్తుంది. అది చూసి విలన్ భయపడిపోయి తనే మధుమతిని చంపేశానని నిజం ఒప్పేసుకుంటాడు. కానీ, సీన్ ముగిసాక హీరోకి అసలు నిజం తెలుస్తుంది… తాను నటించమన్న అమ్మాయి అసలు సమయానికి అక్కడికి రానే రాదు. అంటే అక్కడ పాట పాడుతూ వచ్చింది నిజమైన మధుమతి ఆత్మ అన్నమాట!
అన్పఢ్ (1962)లో మదన్ మోహన్ స్వరపరచిన ‘ఆప్ కీ నజ్రోన్ నే సమ్ ఝా’ మారో అద్భుతమైన పాట. కథా పరంగా ఇది శృంగార గీతం అయినప్పటికీ, సాంకేతికంగా (సంగీతం, గానం, లైటింగ్ పరంగా) ఉపయోగించిన ఎలిమెంట్స్ అన్నీ ఒక క్లాసిక్ హాంటింగ్, మిస్టరీ సాంగ్‌కు ఉండే లక్షణాలను ప్రతిబింబిస్తాయి. అందుకే ఈ పాట వింటున్నప్పుడు శ్రోతలకు ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. హీరోయిన్ (మాలా సిన్హా) చదువుకోని (అన్పఢ్) అమ్మాయి. హీరో (ధర్మేంద్ర) చదువుకున్న వ్యక్తి. వారిద్దరికీ పెళ్లి అవుతుంది. అయితే తాను చదువుకోలేదనే ఒక చిన్న అపరాధభావంతో ఉంటుంది. ఆమె అర్ధరాత్రి వేళ, నల్లటి చీరలో ఆమె చూపులు ఒక మిస్టరీని దాచుకున్నట్లు ఉంటాయి. ప్రేమలోని లోతైన ఆర్తిని, అర్పణ భావాన్ని లతాజీ పలికించిన విధానం పరమాద్భుతం.
సస్పెన్స్ థ్రిల్లర్ ‘బీస్ సాల్ బాద్’ (1962)లో లతాజీ పాడిన ‘కహీన్ దీప్ జలే కహీన్ దిల్’ (హేమంత్ కుమార్ సంగీతం) పూర్తి స్థాయి దెయ్యం పాట!! హీరో బిస్వజిత్‌కు తొలి చిత్రమిది. అర్ధరాత్రి వేళ దట్టమైన పొగ మంచులో, చిత్తడి నేలల మధ్య ఒక అదృశ్య ఆత్మ (వహీదా రహమాన్) పాడుతూ హీరోను వెంబడించే ఈ పాట గుండెల్ని పిండేస్తుంది. దర్శకుడు రాజ్ ఖోస్లా, సంగీత దర్శకుడు మదన్ మోహన్ కాంబినేషన్లో గోతిక్ నోయిర్ శైలిని శిఖరాగ్రానికి తీసుకెళ్లిన చిత్రం ‘వో కౌన్ థి’ (1964). ఇందులో లతాజీ పాడిన పాటలన్నీ స్వర శిఖరాలే!! ఈ చిత్రంలో ‘లగ్ జా గలే..’ పాటలోని సస్పెన్స్, విరహం అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. ఈ రేయి తిరిగి రాదు ఆనే భావం గల పాటను మృదువుగా పాడి, సినిమా చూడని వారిని కూడా ఆ పాత్ర పొందే వేదనలో భాగస్వామిని చేశారు లతాజీ. అలాగే ‘నైనా బర్సే రిమ్‌ఝిమ్’ పాటను అభినయిస్తూ మంచు కురిసే కొండల్లో తెల్లటి చీర కట్టుకుని, కథానాయిక సాధన దెయ్యంలా కనిపిస్తూ పాడుతుంటుంది. లతాజీ ఇందులో ఒక ఆత్మ తాలూకు నిశ్శబ్ద పిలుపును స్ఫురింపజేస్తుంది. పాటకు ముందు లతాజీ ఆలాపన మన హృదయాలను కదిలిస్తుంది. ఈ చిత్రానికి రీమేక్‌గా తీసిన ‘ఆమె ఎవరు’లో హిందీ బాణీలనే యథాతథంగా తీసుకోవడం విశేషం.

Lata
1965లో మనోజ్ కుమార్, నందా నటించిన సస్పెన్స్ మిస్టరీ చిత్రం ‘గుమ్నామ్’లో లతాజీ పాడిన ‘గుమ్ నామ్ హై కోయీ’ పాట ప్రేక్షకులతోపాటు శ్రోతలకూ ఉత్కంఠ కలిగిస్తుంది. శంకర్-జై కిషన్ తమ శైలికి భిన్నంగా దయ్యం పాటను అద్భుతంగా స్వరపరచడం విశేషం. ఇక సునీల్ దత్, సాధన నటించిన ‘మేరా సాయా’ (1966)లో చనిపోయిన భార్య ఆత్మ తాలూకు నీడ భర్తను వెంటాడుతున్నట్లుగా సాగే ‘తూ జహా జహా చలేగా మేరా సాయా‘ (నువ్వు ఎక్కడికి వెళ్లినా నా నీడ నీతోనే ఉంటుంది) పాటను లతాజీ అత్యంత వేదనతో కూడిన అనుభూతిని తన స్వరంలో ఆవిష్కరించారు.
దో బదన్ (1966)లో ‘ఆగయీ ఉన్కీ యాద్’ అనే పాటను లతాజీ తన గొంతులోని గంభీరతతో శ్రోతల హృదయాలకు హత్తుకునేలా పాడారు. ప్రేమించిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలకు సంబంధించిన పాట ఇది. రాజేశ్ ఖన్నా హీరోగా నటించిన తొలి చిత్రం రాజ్ (1967) రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో, కళ్యాణ్ జీ- ఆనంద్ జీ.. చారుకేశి రాగంలో స్వరపరచిన ‘అకేలే హై చలే ఆవో రాజ్’ గుండెల్ని కదిలించే పాట. ఒక అడవి నేపథ్యంలో హీరోను ఒక అదృశ్య శక్తి పిలుస్తున్నట్లుగా సాగే ఈ సస్పెన్స్ సాంగ్‌పై బబిత అభినయించింది.
బుల్లెమ్మ బుల్లోడు (1972) సినిమాను హిందీలో ‘జైసే కో తైసా‘ (1973)గా రీమేక్ చేశారు. ఆర్.డి.బర్మన్ సంగీతంలో లతాజీ పాడిన ‘సాజన్ సజనా రే.. సాజన్ కహా జావూంగీ మై’ దయ్యం పాటవంటిదే. ఆత్మహత్య చేసుకున్న తన సోదరి చావుకు కారణం హీరో (జితేంద్ర) అనుకుని, అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, శ్రీవిద్య ఒక అడవిలో తిరుగుతూ అతనికి వినిపించేలా పాడుతుంది. జితేంద్ర తీవ్రమైన భయంతో, కంగారుగా అడవి అంతా వెతుకుతుంటాడు. ‘బసేరా’ (1981) సినిమాలో ‘జానే కైసే బీతేగీ యే బర సాతేం’ గుండెలు పిండేసే పాట. ఈ పాటలో రేఖ తన అక్క (రాఖీ) కోసం తన భర్తను, సంసారాన్ని త్యాగం చేసి, మళ్లీ పాత వితంతువు దుస్తులు వేసుకుని ఒంటరిగా అనుభవించే నరకాన్ని, గుండె కోతను ఆర్.డి. బర్మన్ సంగీతంలో ఆవిష్కరించారు.
ఇంకా ‘పురానా మందిర్’ (1984), తాహ్ఖానా (1986), వీరానా ( 1988), పురానీ హవేలీ (1989) మొదలైన హారర్ సినిమాల్లో చేతబడి, ఆత్మ, దయ్యాల పాటలున్నాయి. ఈ పాటలను లతాజీ పాడలేదు. అవి అంతగా హిట్ అవ్వలేదంటే.. లతాజీ గాత్ర వైచిత్రిని అర్థం చేసుకోవచ్చు. 1991లో లతా మంగేష్కర్ స్వయంగా నిర్మించిన ‘లేకిన్” ఆధునిక కాలపు గోతిక్ నోయిర్ చిత్రం. రాజస్థాన్ ఎడారిలోని ఒక పాత కోట నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక ఆత్మ… తను అనుభవించిన విరహ వేదనకు విముక్తి లభించక, ఆ ఇసుక తిన్నెల మధ్య ‘యారా సీలీ సీలీ… విరహ కీ రాత్ కా జల్నా’
(ఓ ప్రియుడా… ఈ విరహ రాత్రి నెమ్మదిగా కాలిపోతోంది) అని తిరుగుతుంది. ఈ పాట పాడే సమయానికి లతాజీ వయసు 61 సంవత్సరాలు. కానీ, స్క్రీన్‌పై పాతికేళ్ల యువతి ఆత్మగా నటిస్తున్న డింపుల్ కపాడియా క్యారెక్టర్‌కు ఆమె గొంతు పక్కాగా సరిపోయింది. లతాజీ గొంతులో ఒక ‘దైవిక పవిత్రత’ (Pure, Divine, Ethereal Space) ఉంటుంది. అందువల్ల ఆమె పాడితే ఆ దయ్యం లేదా ఆత్మ చాలా పవిత్రమైనదిగా, అమాయకత్వంతో కూడిన వేదనతో ఉన్నట్లు అనిపిస్తుంది.

బాలీవుడ్ దర్శకులు ఒక సూత్రాన్ని నమ్మారు…
‘ఒక ఆత్మ పడే బాధకు శ్రోత అనుభూతి చెంది ఆవేదన చెందాలంటే లతాజీ పాడాలి… అదే ఒక అందమైన రూపం హీరోని లొంగదీసుకోవాలి లేదా భయపెట్టాలి అంటే ఆశాజీ పాడాలి’.. పక్కా విరహ వేదనతో కూడిన దయ్యం పాటలు లతాజీకే ఎక్కువగా దక్కాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లతాజీ పాడిన దయ్యం పాటలు సినిమాలో హీరోలను వెంటాడే పాత్రలైతే వినే వారందరికి మాత్రం హాంటింగ్ మెలోడీలే..‘తూ జహాఁ జహాఁ చలేగా… మేరా సాయ సాథ్ హోగా’… అని లతాజీ పాడినట్లు ఆమె భౌతికంగా ఈ లోకాన్ని వీడినా, ఆమె గానం నీడలా, ఓదార్చే తోడులా నిరంతరం తమన్నా ఉంటుంది.
– డాక్టర్. వి.వి.రామారావు
రచయిత, గాయకుడు, 98492 37663