‘కేజీఎఫ్’ వేదికగా సినీరంగ ప్రవేశం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధిశెట్టి. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకొని.. కన్నడ, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. హిట్ 3, తెలుసుకదా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’లో విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా శ్రీనిధి పంచుకున్న కార్వాన్ కబుర్లివి…
చదువుతోపాటు డ్యాన్స్, వాలీబాల్, త్రో బాల్, స్విమ్మింగ్ క్రీడల్లో ముందుండేదాన్ని. డాక్టర్ అవ్వాలన్నది నా కల. కానీ, ఇంజినీరింగ్ చదివి, ఉద్యోగం చేశా. నటనపై ఆసక్తితో మాడల్‌గా కెరీర్ ప్రారంభించా.
ఇండస్ట్రీలో ఒకప్పుడు పెండ్లయిన నటీమణులు మాత్రమే తల్లి పాత్రలు వేస్తుండేవారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్ మారింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్… తల్లి పాత్రలో ఒదిగిపోయింది. మనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడమే నాకు తెలిసిన యాక్టింగ్. చాలామంది నెటిజన్లు అంతపెద్ద పాత్ర ఇంత చిన్న వయసులో చేయొద్దని కామెంట్లు పెట్టారు. సినిమా చూసిన తరువాత మీ అభిప్రాయం మార్చుకుంటారని భావిస్తున్నా.
మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చేస్తా. అందుకే గత శివరాత్రికి ఈషా ఫౌండేషన్ వేడుకలకు హాజరయ్యా. ఆ రోజంతా శివుడి ధ్యానంలోనే గడిపా. ఎంతో ఊరట చెందా!
సామాజిక మాధ్యమాల్లో అంతగా కాలక్షేపం చేయలేను. హీరో ప్రభాస్ కూడా ఎక్కువ వాడడని విన్నాను. చాలాసార్లు నేను లేడీ ప్రభాస్నని మా స్నేహితులంతా
పిలుస్తుంటారు. అది కూడా మన మంచికే కదా అని నవ్వి ఊరుకుంటాను.
రామాయణ చిత్రంలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అది అబద్ధం. సీత పాత్ర కోసం నేను ఆడిషన్ ఇచ్చిన మాట వాస్తవమే! కానీ, ఆ పాత్రకు నన్ను ఎంపిక చేయలేదు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను చెప్పండి.