ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తూ మరోసారి మోసం చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల జాక్ ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నది. అయినా సానుకూల స్పందన లేకపోవడంతో ఆగస్టు 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
ఈ నెల 1న నిరసన దినం చేపట్టింది.10న చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈనెల 8 వరకు ప్రభుత్వం చలో హైదరాబాద్ సభకు అనుమతి ఇవ్వలేదు. ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్న తర్వాత 9వ తేదీన చర్చలకు పిలిచి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోమని కోరింది. ప్రభుత్వం ఇచ్చిన హామీపై నమ్మకంతో జాక్ తమ తదుపరి కార్యాచరణను వాయిదా వేసింది. ఈనెల 18న జరిగే చర్చల సందర్భంగా ప్రభుత్వం సముచిత నిర్ణయాలు ప్రకటిస్తుందని లక్షలాది ఉద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున 22 తేదీకి చర్చలు వాయిదా వేసింది. ఈనెల 22, 23 రోజు అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల ప్రహసనం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్చల సందర్భంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు, ఉపముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ప్రభుత్వం రెండు డీఏలు దసరా పండుగకు ఇవ్వడానికి నిర్ణయించింది. మిగతా డీఏలపై స్పష్టత ఇవ్వలేదు. ప్రధాన డిమాండ్లలో ఏ ఒక్క హామీపై కూడా స్పష్టత ఇవ్వలేదు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలో ఎప్పటివరకు చెల్లిస్తారో కూడా చెప్పలేదు. వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి.1/9/2004 ముందు నియమితులైన డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుళ్లు, ఇతర ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కోరుతున్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన పాలకులు అర్హతలు ఉన్నా ఓపీఎస్ రావలసిన ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. బాధిత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో ఓపీఎస్ అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. కానీ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ప్రభుత్వ ద్వంద్వవైఖరికి నిదర్శనం.
ఉద్యోగులు కొత్త కోరికలేమీ కోరడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరో రెండేండ్ల వరకు సమయం ఇవ్వాలని కోరడం ఎంతవరకు సబబు. దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణలో ఉద్యోగులపై చేస్తున్న ఖర్చు తక్కువ అని ఇటీవల పలు నివేదికల ద్వారా వెల్లడైంది. తెలంగాణ రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలో రూ.1,67,000 కోట్లు ఉంటే..అందులో ఉద్యోగులకు ఖర్చు చేస్తున్నది రూ.59,195 వేల కోట్లు. అంటే 35.4 శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో 53.1 శాతం హిమాచల్‌ప్రదేశ్‌లో 81.4, కర్ణాటకలో 42.8, కేరళలో 55.6, పంజాబ్ లో 52.9, తమిళనాడులో 39 శాతం ఖర్చు చేస్తున్నారు. 28 రాష్ర్టాల్లో ఆరు డీఏలు బకాయిలు ఉన్న రెండు రాష్ర్టాలు తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ రెండూ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కావడం గమనార్హం.పీఆర్సీ కథ అంతులేని కథగా మారింది. గత చరిత్రలను తిరుగరాస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ సర్కార్ 2015లో 29 శాతం పీఆర్సీ సూచిస్తూ 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన ఒకే ఒక్క పీఆర్సీగా చరిత్రలో నిలిచిపోయింది. 2018 పీఆర్సీ 7.5 శాతం సూచిస్తే దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం వలన తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలోనూ కేసీఆర్ సర్కార్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కార్ 44 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి పీఆర్సీ గడువును ఈనెల 30 వరకు పొడిగించారు. ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోడ్ అమలయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మళ్లీ మరోసారి గడువు పొడిగించకుండా నివేదిక తెప్పించుకుని దసరా పండుగకు పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఒకే విడతగా చెల్లించాలి. ఇప్పటికే మూడేండ్లలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించడానికి ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. 15 లక్షల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి నేరుగా జోక్యం చేసుకుని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల వరకు ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోతలు లేకుండా ఏజెన్సీలను రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా ముందుకు కదలడం లేదు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు తమ జీవితానికి భరోసా అనే విశ్వాసం కలిగించాలి. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను ఉద్యోగ సంఘాల నాయకుల మీదికి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉద్యోగ సంఘాల భేటీల్లో హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలన్నీ అప్రమత్తమై తమ డిమాండ్ల సాధనకు ఒకేతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
దేవీప్రసాద్