‘హౌజ్ వైఫ్‌లే ఎందుకు ఉండాలి? హౌజ్ హజ్బెండ్స్ ఎందుకు ఉండకూడదు?’ ఈవీవీ సినిమాల్లో చూసిన ఇలాంటి మార్పు గురించి కొత్తగా న్యాయస్థానం మాట్లాడింది. హోమ్ మేకర్ అనేది డిక్షనరీల ప్రకారం ఇంటి బాధ్యతలు చూసుకునే వ్యక్తిగా ఉంది. ఈ బాధ్యతను కేవలం మహిళలే చూసుకుంటున్నారు. కాబట్టి హోమ్ మేకర్స్‌గా మగవాళ్లు కనబడటం అరుదు. కాబట్టి హౌజ్ వైఫ్ తప్ప హౌజ్ హజ్బెండ్లు ఎక్కడా కానరారు. ఈ విషయం గురించి మద్రాస్ హైకోర్టు, మదురై ధర్మాసనం ఇప్పుడు కొత్తగా మాట్లాడింది. తిరువన్నమలై ప్రాంతంలో నివసించే ఇద్దరు వైద్య దంపతులు విడాకుల కోసం తేని జిల్లా కోర్టుకెక్కారు.
ఆ కోర్టులో వాళ్ల పంచాయితీ తేలక హైకోర్టుకు రావాల్సి వచ్చింది. ఇందులో ఉన్న చిక్కేమిటంటే.. భార్యాభర్తలిద్దరూ వైద్య విద్యను అభ్యసించినవాళ్లే. భర్త ఎండీ చదువు పూర్తయిన తర్వాత కార్డియాలజీలో మరో కోర్స్ చదవాలనుకున్నాడు. ఆయన చదువు కోసం ఆమె ఉద్యోగం చేయకుండా ఇద్దరు చిన్న పిల్లల్ని, ఇంటి పెద్దల్ని చూసుకుంటూ ఉంది. భర్త కొన్నేళ్లకు ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరి మధ్య స్పర్ధలు వచ్చాయి. విడాకుల కోసం కోర్టుకెక్కారు.
భరణం విషయంలో సమస్య వచ్చింది. భార్యకు ఎలాగైతే ఉద్యోగం లేదో భర్తకూ ఉద్యోగం లేదు. అయినా సరే ఆయన వైవాహిక జీవితంలో లాభపడ్డాడని కోర్టు తీర్పు చెప్పింది. ఆమె కుటుంబం కోసం ఉన్నత చదువు చదవకుండా భర్తకు అవకాశం కల్పించింది. భర్త ఆ బాధ్యత తీసుకుంటే భార్య చదువుకునేది కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అంతటితోనే ఆగలేదు. భర్తకు సంపాదన లేకున్నా అతని చదువు మరిన్ని అవకాశాలకు దారి చూపిస్తుంది. ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తుంది. కానీ, భార్యకు అంతే స్థాయిలో ఉండవు. కాబట్టి ఆమె త్యాగానికి తగ్గ భరణం చెల్లించాలని చెప్పింది.
పిల్లలకు కూడా కొంత డబ్బు బ్యాంకులో జమ చేయాలంది. ఈ సందర్భంలో హోమ్ మేకర్స్ అంటే ఆడవాళ్లే కాదు మగవాళ్లు కూడా ఉండాలని అది కుటుంబానికి, సమాజానికి మంచిదని సూచించింది. ఎదుగులకు వైవాహిక జీవితం ఆటంకంగా ఉందని చదువుకునే మహిళలు వివాహాన్ని వాయిదా వేస్తున్నారని కోర్టు చెప్పింది. కాబట్టి మగవాళ్లు మారితే మహిళలు కూడా చదువుకుంటారు. మీరు ఇంటి పని పంచుకుంటే మహిళల జీవితాల్లో మార్పు వస్తుందని సూచించింది. మహిళల ప్రగతి, గుర్తింపు, గౌరవానికి భర్తలు హోమ్ మేకర్స్గానూ పని చేయాలని కోర్టు ఒక సూచన చేసింది.