ముంబై: బాలీవుడ్ నటి రకూల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)తో పాటు ఆమె మామ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ వాసు భగ్నాని, పనోరమా స్టూడియోస్‌తో పాటు మొత్తం 12 ప్రదేశాల్లో ఇవాళ ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తున్నది. నిధుల తరలింపులో అక్రమాలు చోటుచేసుకున్న కోణంలో ముంబై ఇన్‌కం ట్యాక్స్ శాఖ ఈ సోదాలు చేపడుతున్నది. ఫిల్మ్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ పేరుతో విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై ఐటీశాఖకు చెందిన పలు బృందాలు.. ఇవాళ ఈ కేసులో డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డులను పరిశీలిస్తున్నాయి.
ఓవర్సీస్ లావాదేవీల గురించి కూడా ఐటీశాఖ ఆరా తీస్తున్నది. గత ఏడాది డిసెంబర్లో రకూల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం ఓ డ్రగ్ కేసులో పోలీసులు గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. 2025, డిసెంబర్ 19వ తేదీన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం పోలీసులు ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రామలు ఎండీఎంఏను సీజ్ చేశారు. అయితే ఈ కేసులో ఆ ఇద్దరు పెడ్లర్ల నుంచి అమన్ అయిదు సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.