కాఫీ తాగడం మన దినచర్యలో భాగమే. కానీ, ఆ కప్పు చుట్టూ ఓ చిన్న ప్రపంచాన్ని సృష్టించుకోవడం ఇప్పుడు ఇంటీరియర్ ట్రెండ్‌గా మారుతున్నది. ఇంట్లోని ఖాళీ మూలకు కాఫీ మెషిన్, అందమైన కప్పులు, సుగంధభరితమైన కాఫీ గింజలు, ఇష్టమైన చిన్న అలంకరణలు జతచేసి ‘కాఫీ కార్నర్’గా తీర్చిదిద్దుతున్నారు. ఒకప్పుడు వంటగది కౌంటర్‌పై కనిపించిన కాఫీ సామగ్రి… ఇప్పుడు ఇంటి అలంకరణ లో భాగమవుతున్నది.
ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్లి కాఫీ కలుపుకోవడం మనకు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు ఆ కాఫీకి కూడా ఇంట్లో ఒక ప్రత్యేక చిరునామా వస్తున్నది. ఇది కేవలం కాఫీ తయారుచేసే ప్రదేశం కాదు. ఉరుకుల పరుగుల జీవితంలో మన కోసం మనం కేటాయించుకునే చిన్న విరామానికి ఇంట్లో ఒక రూపం.
ప్రపంచవ్యాప్తంగా ఇంటీరియర్ డిజైన్‌లో ఇలాంటి వ్యక్తిగత చిన్న ప్రదేశాలకు ప్రాధాన్యం పెరుగుతున్నది. ఒక చిన్న షెల్ఫ్… కొన్ని అందమైన కప్పులు… కాఫీ పొడి డబ్బా… సువాసనలు వెదజల్లే చిన్న దీపం, కాఫీ మెషిన్, చెంచాలు, కాఫీ గింజలు… అన్నిటినీ ఒకేచోట అమర్చి, దానికి ప్రత్యేక రూపం ఇవ్వడమే ‘కాఫీ కార్నర్’. దీనికి పెద్ద ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు. వంటగది కౌంటర్లో ఓ చివర, ఖాళీగా ఉన్న గోడ, కిటికీ పక్కనున్న స్థలం లేదా అల్మారా లోపలి భాగం… ఏ చిన్న ప్రదేశమైనా ఇందుకు సరిపోతుంది.

ఇంటీరియర్ డిజైనర్లలో కనిపిస్తున్న ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే… కాఫీ సామగ్రిని కౌంటర్‌పై వరుసగా పెట్టడం దాటి, దానికో ప్రత్యేక రూపకల్పన చేయడం. ఓపెన్ షెల్ఫ్‌లపై అందమైన సిరామిక్ కప్పులు, గాజు సీసాల్లో కాఫీ గింజలు, చిన్న కళాఖండాలు అమరుస్తున్నారు. మరికొందరు మెషిన్, కప్పులు, ఇతర సామగ్రి మొత్తం సరిపోయేలా ప్రత్యేక క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్నారు. స్థలం తక్కువగా ఉన్న ఇళ్లలో తెరిస్తే కాఫీ స్టేషన్… మూస్తే సాధారణ క్యాబినెట్లా కనిపించే పద్ధతికీ ఆదరణ పెరుగుతున్నది. పాకెట్ డోర్లు, లోపల ప్రత్యేక అరలు, దాచిన విద్యుత్ సాకెట్లు లాంటి ఏర్పాట్లతో చూడటానికి చక్కగా, వాడటానికి సౌకర్యంగా మలుస్తున్నారు.
స్థలం మరికొంచెం ఉంటే పక్కనే ఓ చిన్న టేబుల్, కుర్చీ లేదా కిటికీకి బెంచ్ జత చేస్తున్నారు. వెచ్చని వెలుగు, చెక్క, మట్టి పాత్రలు, పాతకాలపు కాఫీ పరికరాలు కలిస్తే ఆ ప్రదేశానికి కేఫ్ తరహా వైబ్ వస్తుంది. ఇదే ఆలోచన ఇప్పుడు ‘కేఫ్ కోర్’ అనే ఇంటీరియర్ ట్రెండ్తోనూ ముడిపడుతున్నది. బయట కేఫ్‌లో ఉండే సరదా కబుర్లను ఇంటి లోపలికి తీసుకురావాలన్నదే దీని వెనుక భావన.

భారతీయ ఇళ్లలో దీనికి మరింత ప్రత్యేకత ఇవ్వొచ్చు. ఫిల్టర్ కాఫీ పరికరం, ఇత్తడి డబ్బాలు, చెక్క ట్రేలు, చేతితో చేసిన మట్టి కప్పులు… ఇలా. ప్రాంతీయ శైలిని జోడిస్తే ఆ మూలకు సొంత ముద్ర వస్తుంది. కాఫీ కంటే టీ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇదే ఆలోచనను టీకాఫీ స్టేషన్‌గానూ మార్చుకోవచ్చు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన రూల్స్ ఏమీ ఉండవు. మన రోజువారీ జీవితంలోని ఓ చిన్న అలవాటుకు కూడా అందమైన స్థానం కల్పించడమే కాఫీ కార్నర్ ఉద్దేశం కనుక!