అమరావతి: వైసీపీ మాజీ మంత్రి , మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana ) ఏపీ కూటమి పాలన (Alliance government ) పై మండి పడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. విజయనగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్ల సాధనకు శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
ప్రజా స్వామ్యంలో తమ అభిప్రాయాలను చెప్పే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, సచివాలయ వ్యవస్థ ఉందని నాటి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని కొనియాడారు. పోస్టు గ్రాడ్యుయేట్ చదివినవారు ఉద్యోగాల్లో చేరారని అన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా నియామకాలు చేపట్టామని వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలో అరటి, బొప్పాయి, మొక్కజొన్న , వరి పంటలు బాగా దెబ్బతిన్నాయని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.