గుండె జబ్బులు.. ఈ మధ్య కాలంలో ఎవరికి, ఎప్పుడు, ఎలా వస్తున్నాయో తెలియని పరిస్థితి. అయితే ఈ గుండె జబ్బులకు చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి థైరాయిడ్. సాధారణంగా థైరాయిడ్ సమస్యలు అంటే బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, అలసట, జీవక్రియలో మార్పులు గుర్తుకొస్తాయి. అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరుకు గుండె ఆరోగ్యంతోనూ కీలక సంబంధం ఉంది. థైరాయిడ్ హార్మోన్లు గుండె వేగం, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సంకోచాలు, గుండె రిథమ్‌పై ప్రభావం చూపుతాయి. అందువల్ల థైరాయిడ్ ఎకువగా పనిచేసినా, తకువగా పనిచేసినా గుండెపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది థైరాయిడ్ బాధితులు పలురకాల గుండె సమస్యలకు గురవుతున్నారు.
థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడాన్ని ‘హైపర్ థైరాయిడిజం’ అంటారు. ఈ పరిస్థితిలో గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు గుండెపై పనిభారం పెరుగుతుంది. హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చే ముఖ్యమైన గుండె సంబంధిత సమస్యల్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (ఏఎఫ్) ఒకటి. ఇది గుండె రిథమ్‌ను దెబ్బతీస్తుంది. తద్వారా రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కొన్నిసార్లు అంతర్లీన థైరాయిడ్ సమస్యకు తొలి సంకేతంగా ఉండవచ్చు.

థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడాన్ని ‘హైపో థైరాయిడిజం’ అంటారు. ఇది కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. హైపో థైరాయిడిజానికి, కొలెస్ట్రాల్‌కు మధ్య సంబంధం కీలకమైనది. హైపో థైరాయిడిజంను నిర్లక్ష్యం చేస్తే, అది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచి, అథెరోస్లెరోసిస్, కరోనరీ ఆర్టరీ వ్యాధికి దారితీసే ప్రమాదం లేకపోలేదు.
గుండె దడ వచ్చినప్పుడు దాన్ని కేవలం ఆందోళన లేదా ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. థైరాయిడ్ అధికంగా పనిచేయడం వల్ల అసాధారణ గుండె రిథమ్‌లు, ముఖ్యంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్యలు రావచ్చు. లేదా ఇప్పటికే ఉన్న సమస్య మరింత తీవ్రం కావచ్చు.
కరోనరీ ఆర్టరీ వ్యాధి, హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె రిథమ్ సమస్యలు ఉన్నవారు థైరాయిడ్ అసాధారణతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా లేదా తకువగా ఉన్నా గుండె వేగం, రక్తపోటు, లక్షణాలు, లిపిడ్ స్థాయులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ మందులను వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి. సొంతంగా మందులు ప్రారంభించడం, ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకూడదు.
-మహేశ్వర్‌రావు బండారి