ఎల్ఈడీ టెండర్లలో గుత్తాధిపత్యం?
రాజధాని నగరంలో వెలుగులు నింపాల్సిన ఎల్ఈడీ లైట్ల టెండర్లు మరోసారి వివాదాల సుడిగుండంలో చికుకున్నాయి.
- ఒకే కంపెనీకి పెద్దపీట వేయడంపై కాంట్రాక్టర్ల ఆగ్రహం
సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాజధాని నగరంలో వెలుగులు నింపాల్సిన ఎల్ఈడీ లైట్ల టెండర్లు మరోసారి వివాదాల సుడిగుండంలో చికుకున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల పిలిచిన ఎల్ఈడీ లైట్ల టెండర్ నిబంధనలు పూర్తిగా ఒకే కంపెనీకి పెద్దపీట వేసేలా ఉన్నాయని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రముఖ ‘ఫిలిప్స్’ బ్రాండ్‌ను తప్పనిసరి చేయడంతో పాటు, ఆ కంపెనీ నుంచి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ ఆథరైజేషన్ ఫామ్ తీసుకోవాలని నిబంధనలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. టెండర్ ప్రక్రియలో లోపాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..
హెచ్ఎండీఏలోని అన్ని ఎలక్ట్రికల్ టెండర్లపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలనికోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్‌కు కాంట్రాక్టర్లు వినతిపత్రం సమర్పించారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ ఈ నెల 11న జారీ చేసిన (NIT No. HMDA/DEV/ CE/22/ 2026-27) టెండర్ పత్రాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, బీపీపీ కార్యాలయ ప్రాంగణం, లుంబినీ పారింగ్, పీవీఎన్ఆర్ మార్గ్ ప్రాంతాల్లోని 9 మీటర్లు, 6 మీటర్ల స్తంభాలపై ఉన్న పాత ఎల్ఈడీ లైట్ల స్థానంలో 60 వాట్, 120 వాట్ల డెకరేటివ్ లైట్ల డిజైన్, సరఫరా, అమర్చేందుకు ఈ టెండర్ పిలిచారు. ఇందులో ఐదేళ్ల నిర్వహణ (ఏఎంసీ) కూడా భాగమే. దీని అంచనా విలువ పన్నులు కాకుండా రూ.4,14, 08,417గా ఉంది. అయితే బిడ్ల దాఖలుకు చివరి తేదీ సమీపిస్తున్న వేళ టెండర్ నిబంధనలపై అనుమానాలు బలపడుతున్నాయి. టెండర్ పత్రాలను పరిశీలిస్తే ఆరోపణలకు తగినట్టుగానే పలు నిబంధనలు కనిపిస్తున్నాయి:
టెండర్లో నేరుగా ఫిలిప్స్ కంపెనీ…
ఆరోపణలకు బలం చేకూర్చేలా పని పేరులోనే ఫిలిప్స్ కంపెనీ అని స్పష్టంగా పేరొనడం గమనార్హం. ఆమోదిత బ్రాండ్ల జాబితాలో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లకు ల్యూమినారే, ఎల్ఈడీ రెండింటికీ ఫిలిప్స్ పేరు మాత్రమే ఉందనీ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అర్హత మార్గదర్శకాల్లో ఓఈఎం నుంచి తీసుకున్న చెల్లుబాటయ్యే ఎంఏఎఫ్ సమర్పించాలన్న కఠిన నిబంధన పొందుపరిచారు. ప్రస్తుత ఫిక్చర్ల బైబ్యాక్ విలువగా రూ.5 లక్షలను బిల్లుల్లో మినహాయిస్తామని, వాటి స్థానంలో కేవలం ‘ఫిలిప్స్ ఫిక్చర్లు’ మాత్రమే ఏర్పాటు చేయాలని షరతు పెట్టారు.
అయితే కాంట్రాక్టర్లు సర్టిఫికెట్ కోసం తాము ఫిలిప్స్ ప్రతినిధులను సంప్రదించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయని వాపోతున్నారు. సంబంధిత శాఖతో తమకు ఇప్పటికే కమిట్మెంట్ కుదిరిందని, తాము ఇతర కాంట్రాక్టర్లకు ఎలాంటి ఎంఏఎఫ్ ఇవ్వలేమని ఆ కంపెనీ స్పష్టం చేసిందన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, టెండర్లలో ఎవరు పాల్గొనాలో, ఏ సంస్థ గెలవాలో ఓ ప్రైవేట్ కంపెనీ ముందుగానే నిర్ణయం చేసినట్లవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ రంగంలో పారదర్శకతకు, పోటీ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని, ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం నాణ్యమైన వస్తువులు సరఫరా చేసే ఇతర సంస్థలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
మారని అధికారుల తీరు…
గతంలోనూ సరిగ్గా ఇవే నిబంధనలతో టెండర్ పిలవగా, కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయినట్లు వారు గుర్తుచేశారు. నాలుగు ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ అవే వివాదాస్పద నిబంధనలతో నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక పెద్ద తతంగమే నడుస్తోందని ఆరోపించారు. కొన్ని టెండర్లలో కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఇంజినీరింగ్ ఉన్నతాధికారి తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద నిబంధనలతో ఉన్న ప్రస్తుత టెండర్‌ను తక్షణమే నిలిపివేయాలంటున్నారు. అర్హులందరూ సమానంగా పాల్గొనేలా పారదర్శక నిబంధనలతో కొత్త టెండర్ పిలవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకే కంపెనీకి లబ్ధి చేకూర్చేలా బ్రాండ్, నిబంధనలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఉన్నత స్థాయి విచారణ జరపాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన ఎలక్ట్రికల్ టెండర్లన్నింటిపైనా సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టాలన్నారు. నిబంధనలు రూపొందించిన అధికారులు, సంబంధిత కంపెనీల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, రహస్య సమావేశాలపై దర్యాప్తు జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు. ఈ గోల్‌మాల్‌లో అక్రమాలు నిజమని తేలితే బాధ్యులైన అధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

