కథానిక కమామిషు 17
తెలంగాణ ప్రాంతంలో పుట్టి, కథానిక ప్రక్రియకు విశేషమైన సేవ చేసిన కొందరికి నివాళులు అర్పించి, ఇక్కడితో ఈ ప్రయత్నాన్ని విరమించను. కానీ, విరామచిహ్నం పెట్టాలని అనుకుంటున్నా. ఇంతవరకూ కాలక్రమంలో సాగుతూ వచ్చిన ఈ పరామర్శలో ఇప్పుడు ప్రస్తావించవలసిన పేరు భాస్కరభట్ల కృష్ణారావు (1918-1966)ది.
ఉర్దూ, పార్శీ, హిందీ, మరాఠీ లాంటి భారతీయ భాషలతో పాటు దేశమంతటా
తెలిసిన సంధానభాష ఆంగ్లంలో కూడా భాస్కరభట్ల నిష్ణాతుడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణారావుకు బంగాలీ అనే బాంగ్లా భాషా సాహిత్యాలతో కూడా తగిన పరిచయం ఉందట. న్యాయశాస్త్రంలో కూడా పట్టభద్రుడైన భాస్కరభట్ల 1940 దశకం మొదట్లోనే ఉద్యోగ జీవితం ప్రారంభించారు. పొదుపుగా నలభై యెనిమిదేండ్లు మాత్రమే బతికిన ఈ ప్రతిభావంతుడు,
రచయితగా ఇప్పటికీ సాహిత్యరంగంలో చిరంజీవిగా కొనసాగుతూనే ఉన్నారు.
ఆయన 40 కథానికలు రాశారన్నది కొందరి లెక్క. కథానిక, రూపకం, నవల, తదితర ప్రక్రియల్లో సొంతముద్ర వేసిన భాస్కరభట్ల కృష్ణారావు 23 సంవత్సరాలు రేడియో రంగాన్ని కూడా సేవించారు. వికీపీడియా రచయిత(లు) మొదలుకుని భూక్యా భిక్షు నాయక్ వరకూ అందరూ భాస్కరభట్లను ‘తొలితరం తెలంగాణ’ రచయిత అని పరిగణించడం గమనార్హం. ఆ మాట ఎలావున్నా, ఆధునిక మధ్యతరగతి నైతిక జీవనమే ఇతివృత్తంగా రాసిన తెలంగాణ రచయితల్లో భాస్కరభట్ల కచ్చితంగా తొలితరం రచయితే!
భాస్కరభట్ల కృష్ణారావు గొప్ప శిల్పి. ఆయన కథల్లో కొయ్యబొమ్మల్లాంటి పాత్రలు కానరావు-రక్తమాంసాలున్న మనుషులే కథనం చేయడం కద్దు. లేఖల రూపంలో కథనం సాగించడం లాంటి ప్రయోగాలు ఆయనకు ఎడమచేతి పనులు! నేరుగా కథ చెప్పుకునిపోవడం కన్నా, కథ తనంతట తానే మనతో మాట్లాడేలా చేయడం ఆయనలో అనేక సందర్భాల్లో కనిపించే గడుసుతనం. సంఘటనలే కథనాన్ని నడిపించేలా చేయడం ఆయన కథానికల్లో తరచూ కనిపించే టెక్నిక్. ముఖ్యంగా ఆయన రాసిన ‘ద్వితీయ కళత్రం’ కథానికలో ఈ శిల్పం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది! అలాగే, పాత్రల మానసిక చిత్రణ ద్వారా సున్నితమైన విషయాలను సూచించడం ఆయనలో కనిపించే నేర్పరితనం. ఆయన రాసిన ‘పూల పరికిణీ’ కథానికలో ఇదే నేర్పరితనం పూర్తిగా పించం విప్పుకుని నర్తించించింది. ఇదొక తరహా సస్పెన్స్ కథానిక. పాశ్చాత్య కథానికా సాహిత్యం బాగా చదివిన తెలుగు రచయితలు కొద్దిమందిలో మాత్రమే ఈ కథన కౌశలం కనిపిస్తుంది.
భాస్కరభట్ల కృష్ణారావు కథానికల్లో కనిపించే మరో సామాన్య లక్షణం, గ్రామీణ రైత్వారీ కుటుంబ జీవనాన్ని సహృదయంగా చిత్రించడం.
వ్యవసాయదారులు, మారుతున్న కాలానికి తగిన రీతిలో మారడంలో పడే అవస్థలను ఆయన సహానుభూతితో చిత్రించారు.
ఆ తరం రచయితల్లో అత్యధికులది గ్రామీణ నేపథ్యమే. కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ లాంటివాళ్లు ఈ నేపథ్యాన్ని ఆధారం చేసుకుని కథన రీతులను మలచడంలో విమర్శనాత్మకంగా విశ్లేషించడం తరచూ కనిపిస్తూ ఉంటుంది. రెక్కలు రాకముందు నుంచీ రైతు బిడ్డలు ఎంతగా శ్రమపడతారో ఈ మహా రచయితలు ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో చిత్రించారు. గోపీచంద్ వెలువరించిన ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ గల్పికల పరంపరలో ‘అర్రు కడిగిన ఎద్దు’ అనేది ఒకటి. కొ.కు. కథానిక ‘గానుగెద్దు’లో ఇదే వాస్తవాన్ని వేరే కోణం నుంచి చూసి, చూపించారు. వాళ్లకు భిన్నమైన చూపు భాస్కరభట్ల కృష్ణారావుది. ఈ తరం పాఠకులకు భాస్కరభట్ల కృష్ణారావు పేరు కూడా తెలియదేమోనని నా అనుమానం. ఇంత మంచి శిల్పిని ఇలా మర్చిపోగలగడం ఇతరులకెవరికీ సాధ్యం కాదేమో!
మందలపర్తి కిశోర్