కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘80ల నాటి వైరల్ ఏఐ ఫొటో’ ట్రెండ్ జోరుగా నడుస్తున్నది. రెట్రో లుక్, వింటేజ్-గ్లామర్ పోర్ట్రెయిట్‌లతో ఇంటర్నెట్ మొత్తం నిండిపోతున్నది. లక్షల్లో లైక్‌లు, వేలల్లో షేర్లతోపాటు నెటిజన్లకు ఏదో తెలియని సంతృప్తి దక్కుతున్నది. అయితే, ఈ నోస్టాల్జిక్ జ్ఞాపకాల ప్రయాణం వెనక.. పర్యావరణానికి హాని కలిగించే మరో చీకటి కోణం దాగి ఉన్నది.
మామూలుగా చూస్తే.. పైన చెప్పిన లెక్క చాలా తక్కువగా అనిపించొచ్చు. మీరొక్కరు క్రియేట్ చేసుకునే ఒక్క ఏఐ ఫొటో వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదుకదా! అనుకోవచ్చు. కానీ, ఏదైనా వైరల్ ట్రెండ్ వచ్చినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫాలో అవుతారు. వారంతా కేవలం ఒకే ఒక్క ఫొటోతోనే సంతృప్తి చెందరు. ప్రాంప్ట్‌ను మారుస్తారు. దుస్తులు, హెయిర్ స్టయిల్, బ్యాక్‌గ్రౌండ్.. ఇలా, తమకు నచ్చే, పదిమందీ మెచ్చే ఫొటో కోసం తండ్లాడుతారు. ఈ క్రమంలో డజన్ల కొద్దీ వేరియేషన్లను సృష్టిస్తారు. అలా.. ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో కోట్లకొద్దీ రోజువారీ ప్రాంప్ట్లన్నిటినీ కలిపితే.. మొత్తం వినియోగం వందల కొద్దీ గిగావాట్స్‌కు చేరుకుంటుంది.
ఏఐ ప్లాట్‌ఫామ్ వేదికగా ఒక చిత్రాన్ని రూపొందించడం చాలా సులభం అనిపిస్తుంది. అయితే, అందుకోసం ఆయా సంస్థలు, డాటా సెంటర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో విపరీతంగా పనిచేస్తాయి. ప్రతి క్లిక్, మెరుపు వేగంతో జరిగే మార్పులు, తెరపై కనిపించే అవతార్లు.. వీటి వెనుక బయటికి కనిపించని ఎంతో శ్రమ, ఎన్నో మౌలిక సదుపాయాలు దాగి ఉంటాయి.
ఆధునిక సాంకేతికతను ఆస్వాదించడం, సరదా ట్రెండ్‌లో పాల్గొనడం పెద్ద తప్పేం కాదు. కానీ, దానిపై అవగాహన ఉండటం చాలా అవసరం. ఏఐ, ఇతర టెక్నాలజీని జాగ్రత్తగా వాడటం ఎంతో ముఖ్యం. అందుకే.. 80ల నాటి అవతార్ కోసం 10-20 వేరియేషన్లను సృష్టించడం మానేయండి. బదులుగా ఒకటి లేదా రెండు వేరియేషన్లతో సరిపెట్టుకోండి. ఇక ప్రతి చిన్న డిజిటల్ ట్రెండ్‌లో మీ భాగస్వామ్యం కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. నలుగురూ చేస్తున్నారు కదా అని గుడ్డిగా ఫాలో అవ్వకండి.
అమెరికాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం.. ఒక్క ఏఐ చిత్రాన్ని రూపొందించడానికి 0.01 నుంచి 0.29 కిలోవాట్ల విద్యుత్ ఖర్చవుతుందట. అంటే, ఒక్క ఏఐ చిత్రానికి అవసరమైన శక్తితో 10 వాట్ల ఎల్ఈడీ బల్బును సుమారు 17 నిమిషాలు వెలిగించవచ్చు. ఇక డాటా సెంటర్ల కూలింగ్ సిస్టమ్‌ల కోసం భారీ మొత్తంలో నీరు అవసరం అవుతుంది. ఇందుకు ఖర్చయ్యే విద్యుత్ ఉత్పత్తిలోనూ నీటి వినియోగం ఎక్కువే! ఈ లెక్కన ఒక్క ఏఐ చిత్రం వెనుక సుమారు 29 మిల్లీలీటర్ల నీళ్లు ఖర్చవుతున్నాయి.
ఆధునిక సాంకేతికత వల్ల పర్యావరణాకి కలిగే హాని విషయంలో.. కర్బన ఉద్గారాలు, ఇ-వేస్ట్ పైనే ఎక్కువ చర్చ సాగుతుంది. కానీ, పరోక్షంగా జరిగే ముప్పు మరింత అధికం. డాటా సెంటర్ల నిర్వహణలో నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది నీటి ఎద్దడిని పెంచుతుంది. మార్కెట్లో ఒత్తిడి వల్ల ఏఐ సంస్థలు వేగంగా అప్‌గ్రేడ్ అవుతాయి. ఫలితంగా, ఏటా లక్షలాది టన్నుల ఇ-వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఏఐ మోడల్స్ వేగంగా, చౌకగా మారుతున్న కొద్దీ.. వాటి వినియోగం పెరుగుతుంది. పర్యావరణానికి ముప్పు కూడా అధికం అవుతుంది.