జోహన్నెస్‌బర్గ్/కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో కొద్ది గంటల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సామూహిక కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ సమీపాల్లో జరిగిన ఈ రెండు ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది గాయపడ్డారు. రెండు ఘటనలకు కారణమేమిటన్నది కూడా తెలియరాలేదు. శనివారం రాత్రి జోహన్నెస్‌బర్గ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో వెడెలా టౌన్షిప్లో ఓ బార్ వద్ద తొలి ఘటన జరిగింది.
ఎనిమిదిమంది దుండగులు బార్ బయట కూర్చున్న వారిపై, లోపల ఉన్నవారిపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత కేప్‌టౌన్ శివారులోని లాండ్వేల్ టౌన్షిప్లో మరో సామూహిక కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట తర్వాత ఓ దుకాణంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.