హయత్‌నగర్/యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 28 : మదర్ డెయిరీ డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి దొంతిరి సోమిరెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మరోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి డైరెక్టర్‌గా గెలుపొందారు. మహిళా జనరల్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన చీర లావణ్య గెలుపొందారు. నార్ముల్-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్ మదర్ డెయిరీ) పాలకవర్గ సభ్యుల్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎన్నికల్లో రెండు జనరల్ స్థానాలకు పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్), దొంతిరి సోమిరెడ్డి (బీఆర్ఎస్), మహిళా జనరల్ స్థానాన్ని చీర లావణ్య(కాంగ్రెస్) గెలుపొందారు. ఆలస్యంగా అధికార పక్షం మద్దతుతో బరిలోకి దిగిన గూడూరు శ్రీధర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.
రెండు జనరల్ స్థానాలకు పోటీచేసిన వారిలో గూడూరు శ్రీధర్‌రెడ్డికి 106 ఓట్లు, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 163, బెల్లి లింగస్వామికి 9, శీలం వెంకట్నర్సింహారెడ్డికి 7, దొంతి సోమిరెడ్డికి 171 చొప్పున ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లిన 243 ఓట్లలో 5 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో దొంతి సోమిరెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి గెలుపొందారు. జనరల్ మహిళా స్థానానికి పోటీ చేసిన వారిలో అండెం మంజులకు 5 ఓట్లు, కందాల అలివేలుకు 46, చీర లావణ్యకు 190 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లిన 241 ఓట్లలో 7 తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో చీర లావణ్య గెలుపొందారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, అధికారులతో కలిసి నూతన డైరెక్టర్లను అభినందించి సన్మానించారు. గతేడాది జరిగిన డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 డైరెక్టర్ల పదవులను కైవసం చేసుకోగా, ఈసారి మరో డైరెక్టర్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వ్యూహాలు గెలుపునకు బాటలు వేశాయి.
సభలో చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నార్ముల్ మదర్ డెయిరీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఎన్డీడీబీతో సంస్థకు ఎన్వోసీని ఇప్పించారని గుర్తుచేశారు. దీంతోనే మదర్ డెయిరీలో బకాయి పడిన పాల బిల్లులను పాడి రైతులకు చెల్లించామని తెలిపారు. ఈ క్రమంలోనే సంస్థ మాజీ చైర్మన్ శ్రీకర్‌రెడ్డి వర్గీయులు చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకుంటూ ఎమ్మెల్యే ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై కేసీఆర్ అంటూ పెద్దఎత్తున నినదించారు. ఇరువర్గాలు మైక్‌లను లాక్కోవడంతో తోపులాట జరిగింది. హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ చింత శంకరయ్య ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలోనే నార్ముల్ సంస్థ రూ.50 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నూతనంగా గెలుపొందిన నార్ముల్ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి దంపతులు కలిశారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడిరైతుల వ్యతిరేకతకు ఈ గెలుపు చక్కటి ఉదాహరణ అని అభివర్ణించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ గెలువబోతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు, నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, డైరక్టర్లు కస్తూరి పాండు, సందిళ్ల భాస్కర్, మాజీ డైరెక్టర్లు ఒగ్గు భిక్షపతి, పాల సంఘం చైర్మన్ కొండల్‌రెడ్డి, మోటకొండూర్ మాజీ జడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఆలేరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.