కీళ్ల నొప్పులను కలిగించే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో వ్యాధి నియంత్రణలో ఉన్నా నొప్పి లక్షణాలు పూర్తిగా తగ్గకపోవడానికి గల కారణాలను ఇటీవల ఓ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. అందులో భాగంగా జరిపిన పరిశోధనలు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఒక వ్యక్తిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది నియంత్రణలో ఉన్నప్పటికీ వాళ్ల నిద్ర, బరువు, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత అలవాట్లు కూడా దాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇది తేల్చి చెప్పింది.
హంగరీలోని సెమెల్విస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. సాధారణంగా ఇటీవలి కాలంలో వేల సంఖ్యలోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసులు ఉంటున్నప్పటికీ, మందుల ద్వారా దాదాపు చాలా మందిలో దీన్ని తగ్గించగలుగుతున్నారు. అయితే ఇందులోని 6 నుంచి 28 శాతం మంది రోగుల్లో అది చికిత్సకు లొంగని వ్యాధిగా పరిణమిస్తున్నది. దీనికి మూల కారణాలను పరిశీలించే క్రమంలో ఆ వ్యక్తికి సంబంధించిన శరీర బరువు, కుంగుబాటు, ధూమపానం, మధ్యపానం తరహా అలవాట్లు, నిద్రలేమి, దీర్ఘకాలిక నొప్పులు తదితర అంశాలు వ్యాధిని ప్రభావితం చేస్తున్నాయని గమనించారు. నిజానికి ఇదొక విష వలయంలా ఏర్పడుతున్నదనీ చెబుతున్నారు.
ఉదాహరణకు తీవ్రమైన నొప్పి, మానసిక కుంగుబాటు కారణంగా శారీరక శ్రమ చేయడం తగ్గి పోతుంది. దాని కారణంగా బరువు పెరుగుతారు. దీంతో మానసిక స్థితి, భావోద్వేగాలు, నిద్ర ప్రభావితమవుతాయి. ఈ కారణాలన్నీ మళ్లీ నొప్పిని తీవ్రతరం చేస్తూ, రోజువారీ పనులు చేయడాన్ని కూడా కష్టంగా మార్చేస్తాయి. అలా వ్యక్తిలో వ్యాధి తగ్గకపోవడానికి ఇవన్నీ కారణమవుతాయి. ఈ అధ్యయనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే డాక్టర్ వైద్యం చేసేటప్పుడు రోగితో మరింత వివరంగా మాట్లాడి వాళ్ల జీవన విధానాన్ని తెలుసుకుని నొప్పి తగ్గక పోవడానికి గల కారణాలను అంచనా వేయవచ్చు. దీని వల్ల వ్యాధిని మరింత లోతుగా అర్థం చేసుకుని, వ్యక్తికీ వ్యక్తికీ విడివిడిగా వైద్యం చేసే అవకాశం కలుగుతుంది.