Gold price : అంతర్జాతీయ మార్కెట్స్ (International Markets) లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చమురు మంటలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో బంగారం, వెండికి గిరాకీ తగ్గుతోంది. ఇవాళ (సోమవారం) ఉదయం హైదరాబాద్ మార్కెట్ (Hyderabad Market) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ.1,53,300గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.2.31 లక్షలకు తగ్గింది.
ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర దాదాపు 2.1 శాతం పతనమై.. ఔన్సు ధర 4,199 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర ఒక రోజులో ఈ స్థాయిలో తగ్గడం సెప్టెంబర్ 1 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. ఇక వెండి కూడా ఔన్సు ధర 62 డాలర్లకు పడిపోయింది. కమొడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబరు డెలివరీ) 10 గ్రాముల ధర రూ.1.48 లక్షలుగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్ కేజీ ధర రూ.2.28 లక్షల వద్ద కొనసాగుతోంది.
హర్మూజ్‌ను తెరిచే శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు తిరస్కరించడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దాంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లకు చేరుకుంది. ఇదే తంతు కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇటీవల వడ్డీ రేట్లను పెంచిన అమెరికా ఫెడ్.. అక్టోబరులోనూ మరోమారు పెంపు చేపట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
మరోవైపు అమెరికా డాలర్ సూచీ కూడా 101.39 కి పెరిగింది. రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గుచూపట్లేదని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా వీటి ధరలు దిగొస్తున్నాయి.