ఖమ్మం, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భూ సంసరణలు అమలు చేయాలని, వ్యవసాయ రంగంపై కార్పొరేట్ నియంత్రణ ఎత్తివేయాలని అఖిల భారత రైతు – కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశీష్ మిట్ట్టల్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల రైతాంగం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, గ్రామాలు వెనుకబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలు ఖమ్మంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ర్టాలుసహా తమిళనాడు, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాల నుంచి అనేకమంది ప్రతినిధులు, రైతు కూలీలు హాజరయ్యారు. తొలుత నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి వైరా రోడ్డు మీదుగా బహిరంగ సభాస్థలి అయిన ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో డాక్టర్ ఆశిష్ మిట్ట్టల్ మాట్లాడారు. వ్యవసాయ పంటలకు తకువ ధరలు నిర్ణయించడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతుల అప్పులు పెరుగుతున్నాయని, వారి ఆదాయం తగ్గుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. భూసంస్కరణలు అమలుచేసి రైతులను, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జితేందర్ సింగ్, సుశాంత్ ఝా, వీ కోటేశ్వరరావు, ధరంపాల్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కే సెల్వరాజ్, మండల వెంకన్న, నిర్భయ్సింగ్, శంభూ ప్రసాద్సింగ్, కేదార్ సబర్, జీ ఝాన్సీ, టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.