ఆఎడారి విస్తరిస్తుంటే మనం ఏం చేస్తాం. మనుషుల్ని అక్కడి నుంచి తరలిస్తాం. కానీ, చైనా మాత్రం ఎడారినే వెనక్కు నెట్టాలని ప్రయత్నం చేసింది. ఆ నిర్ణయం నుంచి పుట్టిందే ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ప్రాజెక్టులలో ఒకటైన చైనా ‘గ్రేట్ గ్రీన్ వాల్’. ఎడారి చుట్టూ కంచెలా 3 వేల కిలోమీటర్లకు పైగా చెట్లను నిలిపిన, ఈ హరిత ప్రణాళిక ఇప్పుడు ఎడారీకరణకు వ్యతిరేకంగా ప్రపంచం మాట్లాడుకునే విజయగాథగా నిలిచింది.

సియాలోని సంక్లిష్టమైన ఎడారుల్లో ఒకటిగా నిలుస్తుంది చైనా క్సింగ్జియాంగ్ ప్రావిన్సులోని తాక్లమాకాన్. తరచూ మారుతూ ఉండే పెద్ద పెద్ద ఇసుక మేటలు, అత్యల్ప వర్షపాతం, మొక్కలు బతికేందుకు అతి తక్కువ అవకాశం ఉండే ప్రాంతమది. అక్కడితో ఆగకుండా ఇసుక తుఫాన్ల కారణంగా చుట్టూ ఉన్న పచ్చని పంటచేలు, ఊళ్లు, సారవంతమైన నేలల్నీ ఆక్రమిస్తూ పోతున్నది. ఇదొక్కటే కాదు అక్కడి గోబీ ఎడారి పరిస్థితీ అదే. దీనికి విరుగుడుగా 1978లో చైనా ప్రభుత్వం త్రీ-నార్త్ షెల్టర్‌బెల్ట్ ఫారెస్ట్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.
ఉత్తర, ఈశాన్య, వాయవ్య చైనాలను కలిపేలా ఒక భారీ రక్షణ వ్యవస్థను నిర్మించాలన్న తలంపు ఇది. ఇది 2050 వరకూ వివిధ దశల్లో కొనసాగాలని ప్రణాళిక రూపొందించారు. నేరుగా పెద్ద ఇటుక గోడలు కట్టి దీన్ని పూర్తి చేయలేరు. అందుకే పచ్చని చెట్లు, గడ్డి మైదానాలు, పొదలను ఒక క్రమ పద్ధతిలో దీని కోసం వాడారు. గాలివేగాన్ని తగ్గించడం, ఇసుక కదలికల్ని అడ్డుకోవడం, నేల కోతలను నివారించడం ద్వారా మిగతా సారవంతమైన నేలను కాపాడటం దీని ప్రధాన లక్ష్యాలు.

చైనా గ్రేట్ గ్రీన్ వాల్ విజయగాథలో అత్యంత అద్భుతమైన అధ్యాయం తాక్లమాకాన్ ఎడారి. చైనాలోనే అతిపెద్ద ఎడారి ఇది. దాదాపు 3,37,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ ఎడారిని అకడి ప్రజలు ఒకప్పుడు ‘సీ ఆఫ్ డెత్’ (మృత్యు సముద్రం) అని పిలిచేవారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నిరంతరం కదిలే ఇసుక ఎడారుల్లో ఇదొకటి. ఇకడి ఇసుక దిబ్బలు గాలులతో కదులుతూ చుట్టుపకల ప్రాంతాలకు ముప్పుగా మారేవి. త్రీ-నార్త్ షెల్టర్ బెల్ట్ కార్యక్రమంలో భాగంగా తాక్లమాకాన్ అంచుల వెంట చెట్లు, పొదలు, గడ్డి జాతులను పెంచడం మొదలైంది. అప్పటికే ఉన్న చిన్న చిన్న ఒయాసిస్‌లు, అటవీ ప్రాంతాలను కలుపుతూ క్రమంగా ఒక క్రమబద్ధమైన పచ్చని రక్షణ పట్టీని రూపొందించారు. దీని వెనుక అసలు తెలివి ఏమిటంటే- ముందు ఇసుకను నిలిపారు, తర్వాత పచ్చదనాన్ని పెంచారు!

అత్యంత వేగంగా కదిలే ఇసుక ప్రాంతాల్లో నేరుగా మొకలు నాటడం వల్ల అవి బతకవు. అందుకే గడ్డి, ఇతర పదార్థాలతో చదరంగం బోర్డు మాదిరిగా ‘స్ట్రా చెకర్ బోర్డ్‌లు’ ఏర్పాటు చేశారు. ఇవి నేల ఉపరితలంపై గాలి వేగాన్ని తగ్గించి, ఇసుక కదలికను నియంత్రించాయి. తర్వాత ఆ స్థిరపడిన ప్రాంతాల్లో పొదలు, గడ్డి, ఎడారి పరిస్థితులను తట్టుకునే మొకలను పెంచారు. అన్ని ప్రాంతాల్లో ఒకే పద్ధతి ఉపయోగించలేదు. నీటి లభ్యత ఉన్న చోట మొకల ఆధారిత పద్ధతులు, అత్యంత కఠినమైన ఇసుక ప్రాంతాల్లో ఇంజినీరింగ్ పద్ధతులు అనుసరించారు. ఎడారి పరిస్థితులను తట్టుకునే డెజర్ట్ పాప్లర్, సాక్సౌల్, రెడ్ విల్లో లాంటి మొకలను ఎంపిక చేశారు.

కొన్ని ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ లాంటి సాంకేతికతలను ఉపయోగించి మొకల మనుగడకు తోడ్పడ్డారు. ఈ ఎడారికి ఒక ప్రాంతం గుండా కరిగి ప్రవహించే హిమనీనదాల నీటిని ఒక చోట వినియోగించుకున్నారు. ఈ ప్రాంత స్వభావాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా సైన్స్-టెక్నాలజీ-ప్రకృతి కలగలుపుగా చేసిన అద్భుత ప్రయోగంగా దీనిని చెప్పొచ్చు. మొత్తానికి దశాబ్దాల ప్రయత్నం తర్వాత కొన్నాళ్ల క్రితం ఈ ఎడారి చుట్టూ 3,046 కిలోమీటర్ల పచ్చని కవచం పూర్తయింది.
ఇప్పుడు ఈ ప్రాంతం వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే కార్బన్ సింక్‌లా మారిందని ఇటీవల ఉపగ్రహ సమాచారం వెల్లడించింది. కిరణజన్య సంయోగ క్రియ జరిపే క్రమంలో చెట్లు విడుదల చేసే ప్రత్యేక సిగ్నళ్ల ఆధారంగా శాటిలైట్లు దీన్ని అంచనా వేస్తాయి. తాక్లమాకాన్ కథ ఎడారీకరణను నిలువరించేందుకు చక్కని ఉదాహరణ అని పర్యావరణ సంస్థలు పేర్కొంటున్నాయి. నిజానికి మొక్కల జాడే లేని ఎడారిని కార్బన్ సింక్లుగా మార్చడం చిన్న విజయమేం కాదు కదూ!