చదువులంటే ఏ మాత్రం గౌరవం లేని సీఎం రేవంత్రెడ్డి పాలనలో సర్కారీ బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టు అవుతున్నది. రాష్ట్రంలోని సుమారు 27 వేల బడుల్లో 24 వేల వరకు మూసేయాలనే ఆలోచనను ఆయన ఆ మధ్య బయటపెట్టినప్పుడు తీవ్ర దుమారం చెలరేగడం తెలిసిందే. అంటే దాదాపు 90 శాతం బడులకు ఎగనామం పెట్టాలని సర్కార్ చూస్తున్నది. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చదువు అందించే సర్కారీ బడులపై సీఎంకు ఉన్న అవగాహన ఏపాటిదో దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏందంటే సర్కారీ బడుల మూసివేత లేదా ఊచకోతను నేరుగా కాకుండా సంస్కరణల ముసుగులో, చేయబూనడం అంటే అది మున్ముందు ఏ పరిణామాలకు దారితీస్తుందో చెప్పడం కష్టమేమీ కాదు. సర్కార్ వద్ద ఉన్న ప్రత్యామ్నాయం ఏందంటే అది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రయోగం. ఈ పేరు గొప్ప స్కూళ్ల వల్ల ఇది ఇంకా ఉనికిలోకి రాలేదు కాబట్టి కలిగే ఉపయోగం అనుమానాస్పదం. అంటే కేవలం సర్కారీ బడుల మూసివేతకు ఇది పాలకులకు సాధనంగా మారుతున్నాయి. వీటివల్ల ప్రధానంగా చిన్న, మధ్యతరహా సర్కారీ బడులకు తాళం పడబోతున్నది. ఒక్కో టీపీఎస్ నాలుగైదు స్కూళ్లను మింగేస్తున్నది. ఇదీ అదీ అని తేడా లేకుండా జిల్లా పరిషత్, మాడల్ స్కూల్, కేజీబీవీలను విలీనం చేస్తుండటం మనం చూస్తున్నాం. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 20 టీపీఎస్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం టీపీఎస్ల సంఖ్య 105కు పెరిగింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సర్కార్ విలీనం పేరిట వాటిని మూసివేస్తుండటం ఒక సామాజిక వైపరీత్యం.
జాతీయ స్థాయిలో కూడా దీనికి భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వ బడుల మూసివేతపై నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా పదేండ్లలో సుమారు 94,000 ప్రభుత్వ పాఠశాలలు రద్దయ్యాయి. అంటే రోజుకు సగటున 25 పాఠశాలల చొప్పున మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 2.26 కోట్లు తగ్గింది. మొత్తం విద్యార్థుల నమోదులో ప్రభుత్వ పాఠశాలల వాటా 2005లో 71%గా ఉండగా, 2024-25 నాటికి అది 49.24%కి పడిపోయింది. ఈ మూసివేతల విషయంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్ ముందువరుసలో ఉన్నాయి. ఫిబ్రవరిలో లోక్సభలో సమర్పించిన ప్రభుత్వ గణాంకాలు ఈ పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎన్డీయే పాలనలో ఓవైపు సర్కారీ బడులు భారీస్థాయిలో మూసివేతకు గురవుతుంటే అదేసమయంలో దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 2.88 లక్షల నుంచి 3.31 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో మోదీ సర్కార్ మొగ్గు ఏవైపున ఉన్నదో గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
ఇటు రాష్ట్రంలోనూ సర్కారీ చదువుల పరిస్థితి అధ్వానంగా మారింది. రెండున్నరేండ్ల కాలంలో నాలుగు వేల బడులను మూసివేసిన కాంగ్రెస్ పాలకులు, మొత్తంగా సర్కారీ బడి అస్తిత్వానికే ఎసరు తెచ్చే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తున్నది. సర్కార్కు బడులను నిర్వహించడం చేతకాక తాళం పెట్టడమే తగిన పరిష్కారం అంటున్నది. గవర్నమెంట్ స్కూళ్లు ప్రధానంగా పేదపిల్లలకు చదువును చేరువచేసే వేదికలు. 2019 నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాలకు సర్కారీ బడులు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇది గణాంకాల సమస్య మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయం క్షీణిస్తున్నదని అనడానికి ఒక సంకేతం. ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా పడేది బాలికలపైనే. సమీపంలోని పాఠశాల మూతపడితే ముందుగా ఆగిపోయేది అమ్మాయిల చదువులే. సర్కారీ బడుల క్షీణత సామాజిక అసమానతను మరింత విస్తృతం చేస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, అంతిమంగా ‘విద్య ఒక హక్కు’ కాకుండాపోయే ప్రమాదం ఉన్నది.