AP News : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మెరకముడిదాం మండలంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు సామూహికంగా రాజీనామా చేశారు. దాంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వివరాల్లోకి వెళ్తే.. మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతోపాటు 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వారు తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపుతున్నట్లు తెలిపారు. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును తామంతా అనుసరిస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టంచేశారు. త్వరలోనే వారంతా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చీపురుపల్లికి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ దంపతులు పార్టీకి రాజీనామా చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని బొత్స సత్యనారాయణ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం బలహీనపడటం ఇబ్బందికర పరిణామంగా మారింది.