Blood Sugar Levels | రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ప్రతిరోజూ కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం వ్యాయామశాలలో గడపకుండా, ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని శారీరక కదలికలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవచ్చు. ముఖ్యంగా భోజనం తర్వాత కొద్దిసేపు కదలడం వల్ల కండరాలు చురుకుగా మారి, శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. దీంతో భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కొంతవరకు నియంత్రించుకోవచ్చు. రక్తంలో చక్కెరను నిర్వహించుకోవడానికి కాలి కండరాలకు సంబంధించిన వ్యాయామాలు, స్క్వాట్స్, నడక వంటి సులభమైన వ్యాయామాలు ఉపయోగపడతాయి.
వీటిలో మొదటిది నిల్చొని లేదా కూర్చొని చేసే కాలి మడమల వ్యాయామం. ఇందులో పాదాలను నేలపై ఉంచి, మడమలను పైకి లేపి తిరిగి కిందకు దించాలి. ఈ కదలిక వల్ల కాలి వెనుక భాగంలోని సోలియస్ కండరం పనిచేస్తుంది. ఈ కండరం గ్లూకోజ్‌ను వినియోగించుకోవడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం చాలా సులభంగా ఉండడంతో ఇంట్లో ఉన్నప్పుడు లేదా కూర్చున్న సమయంలో కూడా చేయవచ్చు. క్రమం తప్పకుండా కండరాలను పనిచేయించడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను కొంతవరకు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
రెండోది ఎయిర్ స్క్వాట్స్. వీటిని ఎలాంటి పరికరాలు లేకుండానే చేయవచ్చు. ముందుగా కాళ్లను కొద్దిగా దూరంగా ఉంచి నిలబడాలి. అనంతరం కుర్చీలో కూర్చున్నట్లుగా మోకాళ్లను వంచి శరీరాన్ని కిందకు దించి, తిరిగి పైకి రావాలి. ఈ కదలికలో ముఖ్యంగా తొడలు, కాళ్ల కండరాలు పనిచేస్తాయి. కండరాల కదలిక పెరగడం వల్ల శరీరం గ్లూకోజ్‌ను వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా స్క్వాట్స్ దిగువ శరీర కండరాలను బలోపేతం చేయడంలో కూడా ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని రోజువారీ వ్యాయామంలో సులభంగా చేర్చుకోవచ్చు.
మూడోది భోజనం తర్వాత నడక. ఇందుకోసం ఎక్కువసేపు లేదా వేగంగా నడవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత కొద్దిసేపు తేలికగా నడిచినా కండరాలు చురుకుగా మారి, శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా భోజనం తర్వాత నడక రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో ఉపయోగపడే జీవనశైలి చర్యల్లో ఒకటిగా ఉంది. కాలి మడమల వ్యాయామం, ఎయిర్ స్క్వాట్స్, భోజనం తర్వాత నడక వంటి సులభమైన కదలికలను రోజువారీ అలవాట్లలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల నిర్వహణకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.