ఆదివారం వచ్చిందంటే రిలాక్స్ అయిపోతారు చాలామంది. సినిమాలు, షికార్లు అంటూ సండేని ఫన్‌డేగా మార్చేసుకుంటారు. కానీ, ఇతను మాత్రం వీకెండ్‌ని సమాజ హితానికి కేటాయిస్తాడు. పర్యావరణ పరిరక్షణకు వెచ్చిస్తాడు. అలాగని మొక్కలు నాటడమో, ఉపన్యాసాలు ఇవ్వడమో చేయడు. శుభకార్యాల్లో మిగిలిపోయిన వ్యర్థాలను, పడేసిన ప్లాస్టిక్ గ్లాస్లు, ప్లేట్లను సేకరించి రీసైక్లింగ్‌కు పూనుకుంటాడు. స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడేలా అవగాహన కల్పిస్తున్నాడు పుల్లూరి సంతోష్. ‘అహింసా పరమోధర్మ ఫౌండేషన్’ ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు మూగజీవాలకు బాసటగా నిలుస్తున్న సంతోష్ బతుకమ్మతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
సాటి మనుషులపై ప్రేమ చూపించే మనం.. మూగజీవాలపై కూడా అంతే కరుణతో ఉండాలన్నది నా ఆలోచన. దానికి ప్రేరణ. మా తాతయ్యే. మాది కరీంనగర్. నా చిన్నతనంలో మా తాతయ్య సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు. అందులో ముఖ్యంగా దేవాలయాలు నిర్మించడంతో పాటు మూగజీవాలకు తిండి పెట్టేవాడు. ఆయన చేసే పనులను చూస్తూ పెరగడం వల్ల ఆ లక్షణాలే నాకొచ్చాయి. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయినా నేను ఇంటర్ నుంచే పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ చదువుకున్నాను. వచ్చిన డబ్బును వృథాగా ఖర్చు పెట్టకుండా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని కొనిచ్చేవాణ్ని. స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళం ఇచ్చేవాణ్ని. కొన్నాళ్లకు రాబిన్‌హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థలో చేరి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరే వరకు దొరికిన పనల్లా చేస్తూ ఉండేవాణ్ని. డబ్బు విలువతో పాటు బయటి ప్రపంచం తెలుసుకునేందుకు ఈ పార్ట్‌టైం జాబ్స్ నాకెంతగానో ఉపయోగపడ్డాయి.
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ ఎవరైనా నిరాశ్రయులు ఉన్నారా అని వెతికేవాణ్ని. 14 ఏండ్లపాటు ఉద్యోగం చేసిన నేను పదేండ్ల క్రితం సొంతంగా ఒక కంపెనీ పెట్టుకున్నాను. సుమారు వందమందికి ఉపాధి కల్పిస్తున్నాను. మరోవైపు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాను. ప్రత్యక్షంగా కాకుండా.. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చేవాణ్ని. ఈ సమయంలోనే నేనిచ్చే డబ్బులు నిజమైన నిరాశ్రయులకు చేరుతున్నాయా లేదా అన్న అనుమానం మొదలైంది. ఒకసారి హైదరాబాద్‌కు వరదలొచ్చాయి. అందులో భాగంగా ఖైరతాబాద్‌లో ఉండే బస్తీలోని ప్రజల ఇండ్లలోకి నీళ్లు చేరాయి. వాళ్లకు సహాయం చేసేందుకు నా వంతుగా 50 కుటుంబాలకు దొమ తెరలు, బెడ్షీట్లు, నిత్యవసరాలు, మెడిసిన్ అందజేస్తామని చెప్పడంతో ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళమిచ్చాను. వాళ్లు పంపిణీ చేసే రోజు అనుకోకుండా నేను అక్కడికి వెళ్లాను. నాతో 50 కుటుంబాలకు అందజేస్తామని చెప్పిన ఆ నిర్వాహకులు కేవలం 20 కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేశారు. ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దని రెండేండ్ల కిందట ‘అహింసా పరమోధర్మ ఫౌండేషన్’ సంస్థను ఏర్పాటు చేశాను.

ఈ సంస్థ ఏర్పాటు చేసింది నిరాశ్రయుల కోసమే అయినా.. మా సేవను పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం మనుషులకంటే జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. మనం రోడ్లపై, చెత్త కుప్పలపై పడేసే ప్లాస్టిక్, గాజు వస్తువులను తింటూ అవి గాయాలు, రోగాల పాలవుతున్నాయి. తడిపొడి అనే తేడా లేకుండా చెత్తను ఇష్టానుసారంగా వేయడం వల్ల ఆ మూగజీవాల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతున్నది. ఈ సమస్యకు కారణం వెతికినప్పుడు మనం చేసుకునే వేడుకల్లో కనిపించింది. మనం ఆనందంగా జరుపుకొనే శుభకార్యాల్లో వాడిన ప్లాస్టిక్, పడేసిన వ్యర్థాలు రోడ్లపై కుప్పలుగా పేరుకుపోతున్నాయి. అందుకే, ప్లాస్టిక్ రహితంగా వేడుకలు జరుపుకొనేలా కార్యాచరణ రూపొందించాను. వెయ్యి స్టీల్ ప్లేట్లు, 800 స్టీల్ గ్లాస్‌లతో స్టీల బ్యాంక్ ఏర్పాటు చేశాను. శుభకార్యాలకు నాతోపాటు వాటిని తీసుకెళ్తాను. వాటినే ఉపయోగించేలా నిర్వాహకులకు చెబుతాను. హైదరాబాద్‌లో నిర్వహించిన హిందూ మహాసభలో మొదటిసారి ఈ ప్రయోగం చేశాను. ఇప్పటి వరకు సుమారు 30 వేడుకల్లో ఈ ప్రణాళిక అమలుపరిచాను.
ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడే విశ్వ ఫౌండేషన్ నిర్వాహకుడు వినయ్‌తో పరిచయమైంది. మా ఇద్దరిదీ ఒకే అభిరుచి కావడంతో ఇద్దరం కలిసి పలు ఈవెంట్లలో అవగాహన కల్పించాం. వివిధ వేడుకలకు హాజరైనప్పుడు ముందుగా నిర్వాహకులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తాం. తర్వాత కిచెన్ పరిసరాల్లో మూడు వేస్ట్ డస్ట్బిన్లతో మా టీమ్ సభ్యులు నిలబడి ఉంటారు. ఒకదాంట్లో ప్లాస్టిక్ గ్లాసులు, మరో దాంట్లో వ్యర్థాలు, ఇంకో దాంట్లో యూజ్డ్ ప్లేట్లను వేసేలా అతిథులకు చెబుతాం. వ్యర్థాలను గోతి తీసి అక్కడే పాతిపెడతాం. ‘జీరో ల్యాండ్ ఫిల్’ అనే కాన్సెప్ట్‌తో ముందుకు సాగుతున్న తరుణంలో…భవిష్యత్తులో ప్రధానమైన నగరాల్లో తడి పొడి చెత్తను విడివిడిగా ఇంటింటికీ వెళ్లి సేకరించేందుకు ఓ మొబైల్ యాప్‌ను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాను. దీనివల్ల రోడ్లపై చెత్తను, వ్యర్థాలను తగ్గించి మూగజీవాలను కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడినవారమవుతాం.