‘నన్నేం చేయలేవురా’ అని అరుంధతి అన్నట్టే ఆర్టిస్ట్‌లను ఏఐ ఏమీ చేయలేదని హాలీవుడ్ బ్యూటీ మారియన్ కొటిల్లాడ్ అంటున్నది. సమస్త రంగాలనూ ఏఐ ఏలుతుందని చాలామంది చెబుతుంటే మారియన్ మాత్రం మానవ సృజనకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని కొట్టిపడేసింది. హాలీవుడ్, యూరోపియన్ సినిమాలతో ప్రపంచానికి పరిచయమైన ఫ్రెంచ్ నటి మారియన్ కొటిల్లాడ్ ఇటీవల జరిగిన ‘సాన్ సెబాస్టియన్ ఫెస్టివల్’లో డోనోస్టియా అవార్డ్ అందుకున్నది. ఆ సందర్భంగా ఏఐ వినియోగం గురించి జరిగిన చర్చలో నటులకు కృత్రిమ మేధ సవాల్ విసురుతుందా? అని ప్రశ్నించగా.. ఆమె స్పందించింది.
‘ఇలాంటి మాటలు విన్నప్పుడు భవిష్యత్ గురించి భయపడ్డాను. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రాధాన్యం పెరగడం, సినిమా నిర్మాణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎక్కువ కావడం వల్ల నటులకు ప్రాధాన్యం తగ్గిపోతుందని భావించాను. ఆ ఏఐ క్యారెక్టర్లను, నటననూ చూస్తున్నాం. కొత్త ఒక వింతన్నట్టుగా చూస్తున్నారు. అంతే.. ఏఐ క్యారెక్టర్ల హావభావాలు సహజంగా లేవు. వాటి ప్రవర్తనలో సోమరితనం కనిపిస్తున్నది. వాటికి చురుకైన కదలికలు ఉండటం లేదు. ఏఐ వినియోగం సినిమా రంగంలో పెరిగినా.. మానవ కళాకారులను ఏఐ ఆర్టిస్ట్‌లు భర్తీ చేయలేరు. సహజమైన, సృజనాత్మకమైన నటనకే ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ఆ ఏఐ క్యారెక్టర్లను చూస్తే భవిష్యత్ పట్ల భరోసా కలుగుతున్నది’ అని మారియన్ చెప్పుకొచ్చింది.