Inflammation | శరీరంలో దీర్ఘకాలంగా కొనసాగే స్వల్పస్థాయి వాపు లేదా ఇన్ఫ్లమేషన్ గుండెపై నిశ్శబ్దంగా ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దాదాపు 4.8 లక్షల మంది బ్రిటన్ వాసుల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించిన పరిశోధకులు, శరీరంలో వాపు స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన హృదయ సంబంధ సమస్యల ముప్పు తక్కువ స్థాయి వాపు ఉన్నవారితో పోలిస్తే 43 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఈ మార్పులు బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే సంవత్సరాల పాటు కొనసాగుతాయని పరిశోధకులు తెలిపారు.
రక్తంలో గ్లైకోప్రొటీన్ ఎసిటైల్స్ (గ్లైక్ఏ) అనే సూచికను పరిశీలించడంతోపాటు గుండె చిత్రాలు, జన్యుపరమైన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. శరీరంలో వాపు స్థాయిలు పెరిగిన కొద్దీ గుండె నిర్మాణంలో కొన్ని మార్పులు కనిపించినట్లు అధ్యయనం తెలిపింది. గుండె గోడలు మందంగా మారడం, గుండె గదుల పరిమాణం తగ్గడం, గుండె సక్రమంగా రక్తాన్ని నింపుకోలేకపోవడం వంటి మార్పులు ఇందులో ఉన్నాయి. ఇవి మొదట్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా కొనసాగినా, కాలక్రమంలో గుండె వైఫల్యానికి దారితీసే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వాపుకు జీవనశైలి మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, పొగతాగడం, శరీరంలో అధిక కొవ్వు వంటి అనేక అంశాలు సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితులు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో వాపు స్థాయిలు అధికంగా ఉండడంతో పాటు గుండె నిర్మాణంలో మార్పులు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే కొంతమందిలో జన్యుపరమైన అంశాలు కూడా శరీరంలో వాపు ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని లేదా దానికి లోనయ్యే అవకాశాన్ని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు.
ఇంటర్‌ల్యూకిన్-1, టీఎన్ఎఫ్ కుటుంబాలకు చెందిన కొన్ని వాపు సంబంధిత ప్రోటీన్లు గుండెలో కనిపించే మార్పులకు కారణమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. వీటిలో కొన్ని ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే మందులపై పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో రక్త పరీక్షలు, జన్యుపరమైన ప్రమాద అంచనాలను కలిపి ఉపయోగించడం ద్వారా గుండె జబ్బుల ముప్పు ఉన్నవారిని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధ్యయనం సూచించింది. అయితే జన్యుపరమైన ప్రభావం లేదా ప్రతికూల జీవన పరిస్థితులు ఉన్నంత మాత్రాన గుండె జబ్బులు తప్పనిసరిగా వస్తాయని అర్థం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. వాపుకు కారణమయ్యే అంశాలను నియంత్రించడం, జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.