పల్నాటి సీమ అనగానే తెలుగు పాఠకుడి స్మృతిపథంలో బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు, కన్నమదాసు, మాంచాల వంటి పేర్లే మెదులుతాయి. కారంపూడి యుద్ధం, రక్తపాతం, వీరత్వం, ఎత్తు పైఎత్తుల చుట్టూ తిరిగే వీరగాథగానే పల్నాటి చరిత్రను ఇన్నాళ్లూ చదువుకున్నాం.
విశ్వం అనువదించిన ‘కాదంబరి’ చదివినప్పుడు కలిగిన ఉద్వేగం, బండి నారాయణస్వామి ‘కడపటి యుద్ధం’ అందించిన గాఢమైన పఠనానుభూతి ‘కొండమల్లు’ చదువుతున్నంతసేపూ వెంటాడాయి. అయితే వెంకటేశ్వర్లుది ఎవరి దారీ కాదు. పూర్తిగా తనదైన శైలి. పల్నా టి చరిత్రలో వెలుగు జిలుగుల వెనుక దాగిన అట్టడుగు మనిషిని ఆయన వెలుగులోకి తెచ్చారు. చరిత్ర పుటల్లో స్థానం దక్కని బయ్యన్నను కథాకేంద్రంలో నిలబెట్టి, అతని పక్కన ఒక కారుకోడిని, వెనుక ఒక సజీవ అడవిని చేర్చి అద్భుతమైన సామాజిక ప్రపంచాన్ని నిర్మించారు.
ఒకరోజు బండి నారాయణస్వామి ఫోన్ చేసి, ‘కొండమల్లు’ చదువు భూమన్ అన్నారు. ఆయన మాటపై ఆసక్తితో ‘ఏమున్నదో చూద్దాంలే’ అనే భావనతోనే ఆ పుస్తకం చేతబట్టాను. కొన్ని పేజీలు తిరగేసేసరికే కథ నన్ను తనలోకి లాగేసుకున్నది. ఆ తర్వాత కథ నన్ను అడవిలోకి తీసుకెళ్లింది. అక్కడి నుంచి పల్నాటి సీమకు పట్టుకుపోయింది. నేను ఇప్పటివరకు చూడని సరికొత్త కోణం నుంచి ఆవిష్కరించిన తీరు విస్మయపరిచింది.
చాళుక్యుల దాడుల సమయంలో బ్రహ్మనాయుడికి ప్రాణభిక్ష పెట్టిన అమాయక అడవి బిడ్డల మీద, తర్వాతి కాలంలో రాజ్యవిస్తరణ కాంక్షతో నాయకుడి సైన్యం దాడికి తెగబడటం బయ్యన్నలో అగ్గి రాజేస్తుంది. అది కేవలం ఆవేశం కాదు. ‘మా నేల మీదికి మీరెందుకొచ్చారు?’ అంటూ ఒక ఆదివాసీ సంధించిన నిగ్గదీత. ఆ ప్రశ్నే క్రమంగా తిరుగుబాటై, చివరకు ఆత్మగౌరవ పోరాటంగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడే బయ్యన్న సాధారణ వీరు డి పరిమితులను దాటి ఉదాత్తుడిగా నిలుస్తాడు. అతనికి రాజ్యం అక్కర్లేదు, అధికారంపై మోజు లేదు. రాజుల ప్రపంచంలో భాగస్వామ్యం కోసమూ పాకులాడడు. తన ప్రపంచాన్ని, జీవన మూలాలను యథాతథంగా ఉండనివ్వమని మాత్రమే కోరుతాడు.
‘కొండమల్లు’ ఈ నవలకు పెట్టిన పేరు. అది బయ్యన్న మనస్తత్వానికి, అడవి మనిషి ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. కొండమల్లు అనేది పందెం కోడి. కానీ రచయిత దానిని అలా మాత్రమే చూడనివ్వరు. దాని పెంపకం, దేహదారుఢ్యం, ఆహారం, శిక్షణ, కదలిక, ఎగురడం, ప్రత్యర్థిపై దూకడం..ఇవన్నీ చదువుతుంటే అది ఒక పక్షి శరీర నిర్మాణం గురించి చదువుతున్న అనుభూతి మాత్రమే ఇవ్వదు. దాని వెనుక బయ్యన్న జీవితం, అతని సమాజపు స్వభావమూ కనిపిస్తాయి. అక్కడ కొండమల్లు గెలువడం అంటే ఒక పందెం గెలువడం కాదు. బయ్యన్న తన గౌరవాన్ని కాపాడుకోవడం. నవలలో అమితంగా ఆకట్టుకున్న ఘట్టం..పందెంలో గెలిపించినందుకు ప్రతిఫలంగా నాగమ్మ అధికారం ఇస్తానంటుంది. సాధారణంగా అలాంటి అవకాశం కోసం మనిషి ఎదురుచూస్తాడు.
ఒక పదవి..ఒక హోదా.. ఒక అధికార ముద్ర ఇవి రాజ్యవ్యవస్థలో గౌరవానికి కొలమానాలు. కానీ ‘ఆటవికులం, అడవికి మేమే రాజులం, మేమే బంట్లు.. మమ్ములను మమ్ములుగానే బతకనివ్వండి, పరాయి పెత్తనం వద్దు’ అనే మాటలు బయ్యన్న నోట వినిపించినప్పుడు అది ఒక పాత్ర డైలాగ్గా మిగలదు. రాజ్యాలు, పదవులు, పెత్తనాలు లేని జీవన విధానానికి అతను ఇచ్చిన ప్రకటనలా అనిపిస్తుంది.
ఇక్కడే వెంకటేశ్వర్లు తన కథానాయకుడిని ‘వీరుడు’గా మాత్రమే కాకుండా ఒక జీవనతత్వానికి ప్రతినిధిగా నిలబెడతారు. ఇందులో అడవి నిశ్శబ్ద నేపథ్యం కాదు..కథను నడిపించే ఒక సజీవ పాత్ర. చెంచుల ఆహారపు అలవాట్లు, వేట పద్ధతులు, మూలికా వైద్య పరిజ్ఞానం, వన్యప్రాణులతో వారి సహజీవనం..ఏదీ అలంకారప్రాయంగా రాలేదు. అటవీ మాండలికం, చెంచుల సహజ నుడికారం ఈ కథకు అసలైన ప్రాణం పోశాయి. దాంతో అడవి మన కండ్లకు కనిపించడమే కాదు, చెవులకు వినపడుతుంది, దాని ఘాటైన వాసన ముక్కుకు తగులుతుంది, అక్కడి జీవనం మన చర్మాన్ని తాకుతుంది.
పల్నాటి ప్రసిద్ధ వీరుల జాబితాలో మరో పేరు చేర్చడం ‘కొండమల్లు’ ఉద్దేశం కాదు. చరిత్రను చూసే మన కోణాన్ని మార్చడమే దీని పరమార్థం. రాజ్యాల అట్టహాసాల మధ్య అడవిని, యుద్ధాల బీభత్సం నడుమ ఒక చెంచు గుడిసెను, వీరగాథల మాటున అణిగిపోయిన అడవిబిడ్డ ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించిన ఘనత వర్ధెల్లి వెంకటేశ్వర్లుది.
‘కొండమల్లు’లో బాగా నచ్చిన మరో అంశం అడవి చిత్రణ. చాలా చారిత్రక నవలల్లో ప్రకృతి కథ జరిగే ప్రదేశం. ఇక్కడ మాత్రం అడవి కథలో భాగం. చెంచుల వేట పద్ధతులు, ఆహారం, ఔషధ జ్ఞానం, జంతువుల కదలికలపై వారి అవగాహన, పులి-చిరుతలతో వారి సహజీవనం..ఇవన్నీ రచయిత కథలోకి సహజంగా తీసుకొచ్చారు. ఇది పరిశోధన చేశానని పాఠకుడికి చెప్పే రచన కాదు. పరిశోధనను కథలో కలిపి, పాఠకుడికి జీవితం చూపించే రచన. నేటి మనిషిని కూడా వెంటాడే కథ..ఎనిమిది వందల ఏండ్ల కిందటి కథను చదువుతున్నామని అనిపిస్తూనే, కొన్నిచోట్ల మన కాలంలోకి వచ్చి నిలబడిపోతాం.
రచయితతో వ్యక్తిగత పరిచయం లేకపోవడం వల్లే కావచ్చు-పుస్తకం చదివేటప్పుడు ముందస్తు అభిప్రాయం కూడా లేదు. పేరు చూసి అంచనా వేయలేదు. చదివాను. ఆ తర్వాత రచయిత ఎవరు అనేది తెలుసుకోవాలని అనిపించింది. ఒక రచయితను పరిచయం చేసిన పుస్తకాలు కొన్ని ఉంటాయి. ‘కొండమల్లు’ అలాంటి పుస్తకంగా మిగిలింది. ఇది కేవలం పల్నాటి వీరగాథకు మరో అనువాదం కాదు. చరిత్రలో ప్రసిద్ధులైన వారి వెనుక మిగిలిపోయిన మనుషుల వైపు కెమెరా తిప్పిన నవల. బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు, కన్నమదాసు, మాంచాల పేర్లతో నిండిపోయిన పల్నాటి జ్ఞాపకంలోకి బయ్యన్నను తీసుకొచ్చిన నవల.
అతని చేతిలో కత్తి కంటే ముందుగా అతడి గుండెల్లో ఉన్న ఆత్మగౌరవాన్ని చూపించిన నవల. అతని పక్కన నడిచే కొండమల్లు అనే కారుకోడిని కేవలం పందెం పక్షిగా కాకుండా ఒక అడవి సమాజపు ప్రతీకగా నిలబెట్టిన నవల. చరిత్రపుటల్లో రాజుల పేర్లు నిలిచిపోతాయి. యుద్ధాల తేదీలు నిలిచిపోతాయి. గెలిచినవారి కథలు నిలిచిపోతాయి. కానీ ఆ యుద్ధాల కింద నలిగిపోయిన మట్టి మనుషుల ఊపిరి చాలాసార్లు కాలంతో పాటే కలిసిపోతుంది. ఆ ఊపిరికి అక్షరరూపం ఇచ్చినప్పుడే చరిత్ర సంపూర్ణమవుతుంది.
‘కొండమల్లు’ ఆ ప్రయత్నం. అందుకే ఇది పల్నాటి చరిత్రను కొత్తగా చూడమని బలవంతం చేసిన నవల. బయ్యన్న రగిలించిన ఆత్మగౌరవం, కొండమల్లు కత్తి కట్టుకున్న రెక్కల దూకుడు, నల్లమల అడవి నుడికారం..ఇవన్నీ పుస్తకం మూసిన తర్వాత కూడా మన వెంట వస్తాయి. పల్నాటి వీరభూమిలో ఇప్పటివరకు ఎక్కువగా వినిపించిన గొంతుకలకు మధ్యలో, చరిత్ర అంచున మిగిలిపోయిన ఒక అడవి మనిషి గొంతు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నది. ఆ గొంతు పేరు బయ్యన్న. ఆ గొంతుకు ప్రతీక కొండమల్లు. ఆ గొంతును మనకు వినిపించిన రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు. ఇంతటి అద్భుతమైన నవలను తెలుగు సాహితీలోకం చురుగ్గా పదిమందినీ చదవమని ప్రేరణ కలిగించటమే కాకుండా వివిధ భాషల్లోకి అనువాదమయ్యేలా కృషి చేయాలి. వర్ధెల్లి వెంకటేశ్వర్లు నవలను అగ్రస్థానంలో నిలబెట్టారు.