నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
క్రీడా ప్రపంచంలో విజయాన్ని పతకం రంగు మాత్రమే నిర్ణయించలేదు. దాన్ని సాధించే క్రమంలో ప్రదర్శించిన అసమాన పోరాట పటిమ కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.ఈ ఆసియా క్రీడల్లో ‘తెలంగాణ బుల్లెట్’ ఇషా సింగ్ సాధించిన రజతం సరిగ్గా అలాంటిదే! ప్రపంచ నంబర్ వన్ హోదాలో, ప్రపంచ రికార్డు హోల్డర్‌గా బరిలోకి దిగిన ఈ 21 ఏండ్ల షూటర్.. క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగే క్లిష్ట పరిస్థితుల నుంచి ఫైనల్లో సాంకేతిక అంతరాయాలు, తీవ్రమైన భుజం నొప్పి, ఐదు నరాలు తెగే షూటాఫ్ సిరీస్‌లను అధిగమించి వీరోచితంగా రజతాన్ని ముద్దాడింది. ఆఖరి క్షణంలో చైనా షూటర్ జియావో చేతిలో స్వర్ణం తృటిలో చేజారినా ఇషా కనబరిచిన అసాధారణ పోరాటస్ఫూర్తి భారత షూటింగ్ బృందానికి గొప్ప ఊరటనిచ్చింది.
షూటింగ్ అనేది ప్రత్యర్థితోనే కాకుండా మనసు, ఆలోచనలు, వేగంగా కొట్టుకునే గుండెచప్పుడుతో చేసే నిరంతర యుద్ధం. ముఖ్యంగా ప్రతి షాట్‌ను 3 సెకన్లలోపు పూర్తి చేయాల్సిన 25 మీటర్ల పిస్టల్ ఫార్మాట్లో ఊపిరి పీల్చుకోవడానికీ సమయం ఉండదు. ఇలాంటి క్లిష్టమైన వాతావరణంలో ఫైనల్ సాగుతుండగా తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఇషా షూటింగ్ చేసే చేయి బిగుసుకుపోయి తీవ్ర అలసటకు గురైంది. భుజం నొప్పి వేధిస్తున్నా, నిమిషాల వ్యవధిలో తోటి షూటర్లు ఎలిమినేట్ అవుతున్నా ఈ హైదరాబాదీ స్టార్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ప్రతి షాట్‌ను అత్యంత ఏకాగ్రతతో విసురుతూ తన అద్భుత మానసిక స్థైర్యాన్ని చాటుకుంది.
ఈ ఉత్కంఠ పోరులో రేంజ్ అధికారుల అలసత్వం, జడ్జిల పొరపాట్లు, సాంకేతిక లోపాల వల్ల ఆట దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోవడం ఫైనల్‌కే ప్రధాన మలుపుగా మారింది. సాధారణంగా ఎలాంటి అథ్లెట్‌కైనా ఇలాంటి సుదీర్ఘ జాప్యం ఏకాగ్రతను దెబ్బతీసే అంశమే అయినా, ఇషా మాత్రం ఆ గందరగోళాన్ని వరంగా మలుచుకుంది. ఆ సమయాన్ని మైండ్ రీసెట్ చేసుకోవడానికి ఉపయోగించుకున్న ఆమె తిరిగి రేంజ్‌లోకి వచ్చి పతకాన్ని ఖాయం చేసే వీరోచిత ప్రదర్శనతో మెరిసింది.
గత ఎడిషన్‌లో అలవోకగా నాలుగు పతకాలు గెలిచిన ఇషా ప్రయాణం ఈసారి ఏమాత్రం సులువుగా సాగలేదు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్ చేరలేకపోవడం, మరోవైపు రాహీ సర్నోబత్ సున్నా షాట్ కారణంగా టీమ్ ఈవెంట్లో భారత జట్టు ఐదో స్థానానికి పరిమితమై పతకం కోల్పోవడం వంటి నిరాశజనక పరిణామాల మధ్య ఇషా సాధించిన ఈ రజతం వెలకట్టలేనిదిగా నిలిచింది. తొమ్మిదేండ్ల వయసు నుంచే పిస్టల్ చేతబట్టి 13 ఏండ్లకే జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఇషాకు ఒత్తిడిని జయించడం కొత్తేమీ కాదు. నొప్పులు వేధిస్తున్నా, నరాలు తెగే ఉత్కంఠలోనూ ఆమె మైండ్ సెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆటలో ఎంత వెనుకబడి ఉన్నా ఆఖరి షాట్ వరకు పట్టువదలని, పోరాటం ఆపకపోడం ఇషా అతి పెద్ద బలం. తన పతకం రంగు రజతమే కావచ్చు, కానీ 21 ఏండ్ల వయసులోనే ప్రదర్శించిన మానసిక దృఢత్వం స్వర్ణ సమానమే. స్టార్ షూటర్ మను భాకర్ నిరాశపరిచిన వేళ.. 25 మీటర్ల ఈవెంట్లో టాప్ ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఇషా తెచ్చిన రజతం ఆమె కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఇషా ఇదే జోరు కొనసాగిస్తే తన జీవిత లక్ష్యమైన ఒలింపిక్ స్వర్ణాన్ని 2028 గేమ్స్‌లోనే ముద్దాడినా ఆశ్చర్యం లేదు.