ముంబై, సెప్టెంబర్ 28 : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు.. సూచీలను తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. ఉదయం ఆరంభం నుంచే పతనం మొదలవగా.. సమయం గడుస్తున్నకొద్దీ అది పెరుగుతూపోయింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 1,124.02 పాయింట్లు క్షీణించి 72,771.72 వద్ద ముగిసింది.
ఇది 6 నెలల కనిష్ఠం కావడం గమనార్హం. నిఫ్టీ సైతం 360.25 పాయింట్లు నష్టపోయి 22,780.25 వద్ద నిలిచింది. దీంతో ఈ ఒక్కరోజే మదుపర్ల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. ఆర్థిక, ప్రభుత్వ బ్యాంకులు, మెటల్స్, ఎఫ్ఎంసీజీ, చమురు-గ్యాస్, ఆటో షేర్లు నష్టపోయాయి.