ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ‘తెలుగు భాషా చరిత్ర’ గ్రంథంలో తెలుగు మాండలికాలు – ప్రమాణ భాష గురించి తెలుపుతూ ‘జీవద్భాషకు మార్పు సహజం. మార్పు వల్ల భాషలో బహురూపత, వైవిధ్యం ఏర్పడతాయంటారు’. అట్లనే ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు భాష నిత్య పరివర్తన శీలి, ప్రజల అవసరాలు, సంస్కృతి మారేకొద్దీ భాష సమాజానికి అనుగుణంగా మారుతుంది తప్ప, సమాజం కోసం భాష ఆగదు అంటారు. సరిగ్గా పైవ్యాఖ్యలను నిజం చేస్తూ నేటి జెన్-జీ నుంచి కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి.
నేటి డిజిటల్ యుగంలో మనం 1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరాన్ని ‘జెన్-జీ’ (జనరేషన్ జెడ్) అని పిలుస్తున్నాం. ఇంటర్నెట్, సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల్ ఒడిలోనే పెరిగిన ఈ తరం సృష్టించుకున్న భాషా సంస్కృతి గత తరాల కన్నా భిన్నమైనది, విలక్షణమైనది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఆధునిక యువత సంభాషణ శైలినే సాధారణంగా ‘జెన్-జీ భాష’ అని పిలుస్తున్నాం. ‘జెన్-జీ’ భాష అనేది డిజిటల్ మాధ్యమాలు సృష్టించిన కొత్త సమాచార అవసరానికి ప్రతిస్పందన. ఇది భాష క్షీణత కాదు. భాషా పరమైన ఒక ‘సరికొత్త మాండలికం’ గా పరిగణించాలి. ఈ సమాజపు జీవనశైలికి, ఆలోచనా విధానానికి, సంస్కృతికి, కాలానుగుణ వస్తున్న మార్పులకు ఈ ‘జెన్-జీ’ భాష అద్దం పడుతుంది.
ఒకప్పుడు ఉత్తరాలు, తర్వాత ఫోన్ సంభాషణలు, ఆ తర్వాత ఎస్ఎంఎస్లు, ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, థ్రెడ్స్, యూట్యూబ్, షార్ట్ వీడియోల వంటి డిజిటల్ మాధ్యమాలు సంభాషణ పద్ధతిని గణనీయంగా మార్చాయి. పూర్వం గ్రాంథికం నుంచి వ్యావహారిక భాషోద్యమం వచ్చినట్టే నేడు వ్యావహారికంలో నుంచి డిజిటల్ వ్యక్తీకరణల దిశగా మార్పులు జరుగుతున్నాయి. జెన్-జీ యువత తమ భావాలు, అంతరంగాలను అత్యంత వేగంగా, సమర్థవంతంగా వ్యక్తీకరించడానికి ప్రస్తుతం సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాల్లో కూడా ఈ ప్రకంపనలు చూశాం.. చూస్తున్నం కూడాను. ఈ ‘జెన్-జీ’లు వాడుతున్న భాషను నిశితంగా పరిశీలిస్తే మనకు కొన్ని స్పష్టమైన అంశాలు
కనిపిస్తాయి. ముఖ్యంగా వేగం, సంక్షిప్తత, సృజనాత్మకత, హాస్యం, భావోద్వేగాల వ్యక్తీకరణ, ఇతర భాషల కలవడం ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి.
అట్లనే వేగంగా చాటింగ్ చేయడానికి పదాలను కుదించి వాడడం ప్రాథమిక లక్షణంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు ఐడీకే (ఐ డోన్ట్ నో), ఎఫ్ఆర్ (ఫర్ రియల్), టీబీహెచ్ (టు బీ హానెస్ట్), ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) వంటి పదాలు. అట్లానే ఒక విషయాన్ని లేదా భావాన్ని వ్యక్తపరచడానికి కొత్త పదాలను నిర్మిస్తున్నారు. ఉదాహరణకు ఘోస్టింగ్ (హఠాత్తుగా మాట్లాడడం మానేయడం), ఫ్లెక్స్ (గొప్పలు చెప్పుకోవడం), రిజ్ (ఆకర్షించే నైపుణ్యం), స్లే (అద్భుతంగా చేయటం) వంటి కొత్త పదాలు విస్తృతంగా నేడు వాడుకలో ఉన్నాయి. ఈ జెన్-జీ భాష కేవలం అక్షరాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎమోజీలు, మీమ్స్, జిఫ్ల ద్వారా సమాచారాన్ని వ్యంగ్యంగా, సూటిగా, తక్కువ సమయంలో ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక రకంగా లిఖిత-దృశ్య రూపాల సమ్మేళనం.
నేడు తెలుగు, ఇంగ్లిష్, హిందీ మొదలైన ‘భాషల మిశ్రమ’ పదజాలం సంక్షిప్త రూపంలో కనిపిస్తున్నది. ఉదాహరణకు ఈ సినిమా చాలా బాగుంది అని తెలుగులో అంటాం. దీన్ని జెన్-జీ భాషా శైలిలో సినిమా ఫుల్ ఫైర్ అని చెప్తుంటారు. నాకు అతని ప్రవర్తన నచ్చలేదు. జాగ్రత్తగా ఉండాలి అనడానిక జెన్-జీలు అతని బిహేవియర్ చూస్తే రెడ్ ఫ్లాగ్ మాట్లాడుతారు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనే మాటను జెన్-జీలు ఓవర్ థింకింగ్ చేయకు, చిల్ అని క్లుప్తంగా అంటుంటారు. ఎవరైనా అకస్మాత్తుగా మాట్లాడటం మానేస్తే, నన్ను గోస్ట్ చేశారు అని చెప్తారు. నీ పని చాలా అద్భుతంగా ఉన్నది అని అనడానికి ఇది ఫుల్ స్లే అని వ్యాఖ్యానిస్తుంటారు. ఇవే కాకుండా ఇంకా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న కొన్ని పదాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు ఫుల్ వైబ్, టైమ్ పాస్, క్రష్, లిటరల్లీ, రియల్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, చిల్, ఫైర్, బ్లాస్ట్, మాస్, అదుర్స్, గూస్ బంప్స్, ఓఎంజీ, ఎల్వోఎల్, మ్యూట్, టాక్సిక్, స్పేస్ మొదలైనవి.
తెలుగులో ఇంగ్లిషు పదాలు సహజంగా కలిపి మాట్లాడడం
కనిపిస్తున్నప్పటికీ ఇది గతంతో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ మాధ్యమాల కారణంగా మరింత వేగం పుంజుకున్నది. విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఒకరకంగా నేడు ‘సోషల్ మీడియా ఒక నూతన భాష ప్రయోగశాల’గా మారుతున్నది. ప్రస్తుత భాషావేత్తలకు, భాషాభిమానులకు ఈ జెన్-జీ భాషపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని భాషా పరిణామానికి సహజ రూపంగా, యువత కొత్త అనుభవాలకు, కొత్త సాంకేతికతకు నిదర్శనంగా భావిస్తున్నారు.
మరోవైపు మాతృభాషలో ఇంగ్లిష్ పదాల అధిక వినియోగం వల్ల తెలుగు పదజాలం మరుగున పడే ప్రమాదం ఉన్నదని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా భాషను ఒకే చోట నిలిచిపోయే వస్తువుగా చూడలేం కాలంతో పాటు భాష కూడా మారుతున్నది. ఒక తరం ఉపయోగించిన పదాలు మరో తరానికి కొత్తగా అనిపించవచ్చు. కానీ, తర్వాత అవే సాధారణ భాషలో భాగమవుతాయి. అందువల్ల జెన్-జీ భాషను అర్థం చేసుకోవడం అంటే నేటి యువత ఆలోచన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే. అందుకే వివిధ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు డిజిటల్ భాషా పరిజ్ఞానం అవసరాన్ని గుర్తించి ‘తెలుగు భాష సాంకేతికత’ అనే పాఠ్యాంశాలను కూడా జోడిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ‘జెన్-జీ’ వాడుతున్న భాషను చాలామంది వ్యాకరణం లేని భాషగా లేదా సంప్రదాయ భాషకు ముప్పుగా అభివర్ణిస్తున్నారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా విస్తరిస్తున్న ఈ నూతన సంభాషణల ధోరణిని భాషా సహజ గుణంగా గుర్తించి అర్థం చేసుకోవడమే సమగ్రమైన వైఖరి. భాష మారడం అనేది భాష బలహీనత కాదు. మారుతున్న సమాజాన్ని స్వీకరించే భాషా చైతన్యానికి ఒక సంకేతంగా పరిగణించాలి. అయితే మార్పును స్వీకరిస్తూనే మాతృభాష మూలాలను కాపాడుకోవడం కూడా ఇప్పుడు మన ముందున్న బాధ్యత, అతిపెద్ద సవాలు కూడాను.
ప్రొఫెసర్ జీడి రమేశ్