న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : దేశ ఆర్థిక వ్యవస్థపై రాబోయే రోజుల్లో ఒత్తిళ్లు మరింతగా పెరుగవచ్చని ప్రముఖ బ్రోకరేజీ బీఎన్పీ పరిబాస్ తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని మళ్లీ పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న భారత్‌లో ఈ పరిణామం ద్రవ్యోల్బణం సమస్యలకు దారితీయగలదని అంచనా వేసింది.
ప్రస్తుతం ఇంటా-బయట.. భారత్‌కు ఎదురు గాలే వీస్తున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బీఎన్పీ పరిబాస్ సైతం రిపోర్టులో ఇదే సంకేతమివ్వడం గమనార్హం. గ్రామీణ కార్యకలాపాలు, పారిశ్రామిక పనితీరు, వినిమయ శక్తిపై అధిక ఇంధన ధరలు, వాటితో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నది.
అమెరికా-ఇరాన్ పోరు ముదిరితే గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు దౌడు తీయడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలతో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్కును దాటి 110 డాలర్లకు చేరువగా వస్తున్నది. దీనివల్ల భారత్‌పై దిగుమతి భారం క్రమేణా పెరుగుతూపోతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మున్ముందు ధరలు పెరిగే అవకాశాలు తీసిపారేయలేం. ఇదే జరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందన్న ఆందోళనలు ఆర్థికవేత్తల నుంచి ఉన్నాయి.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఐరోపా, జపాన్ తదితర దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీరేట్లను పెంచేశాయి. దీంతో వచ్చే నెల జరుగబోయే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కూడా రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలపై వడ్డీభారం పెరుగనున్నది. బీఎన్పీ పరిబాస్ కూడా ద్రవ్యోల్బణం పెచ్చుమీరితే.. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకు ఆర్‌బీఐకున్న అవకాశాలు పరిమితం కాగలవని పరోక్షంగా రేట్ల పెంపును సూచించింది. గత నెల ఆగస్టులో ద్రవ్యోల్బణం 4.8 శాతానికి పెరిగిందన్న బీఎన్పీ.. 2025 జనవరి తర్వాత ఇదే గరిష్ఠమని గుర్తుచేసింది. 3 నెలలుగా 4 శాతంపైనే ఉన్నదని చెప్పింది.