Kuldhara Village | యాత్రల్లో సాహస యాత్రలు ప్రత్యేకం! ఘోస్ట్ టౌన్లు, అంతుచిక్కని ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్లడం. అక్కడి రహస్యాలను తెలుసుకోవడం. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. లక్షల్లో లైక్లు సంపాదించడం.. ఇలాంటి సాహసోపేత ప్రయాణాలకు ‘సై’ అంటున్నది నేటితరం. అలాంటి వారికి రాజస్థాన్లోని కుల్ధారా గ్రామం.. ఓ అద్భుతమైన గమ్యస్థానం.
కుల్ధారా అంటే ఒక పాడుబడిన ప్రాంతం మాత్రమే కాదు. ఆ కాలపు ప్రజల ఆత్మగౌరవానికి, కష్టకాలంలో వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి నిలువెత్తు సాక్ష్యం. చారిత్రక నేపథ్యం, అంతుచిక్కని రహస్యానికి ముఖ్య కేంద్రం. అందుకే, ఊరినిండా మొండి గోడలే ఉన్నా.. ఏటా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉందీ గ్రామం.

కుల్ధారా గ్రామాన్ని 13వ శతాబ్దంలో (1291 ప్రాంతంలో) ‘పాలివాల్ బ్రాహ్మణులు’ నిర్మించారు. చుట్టుపక్కల 84 గ్రామాలతో కలిసి ప్రశాంతంగా నివసించేవారు. ఎడారి ప్రాంతంలోనూ వ్యవసాయం, వ్యాపారాలు చేస్తూ.. కుల్ధారాను ఒక సుసంపన్న గ్రామంగా తీర్చిదిద్దారు. అయితే, 1825 కాలంలో జైసల్మేర్ రాజ్యానికి సలీం సింగ్ దీవాన్గా ఉండేవాడు. అత్యంత క్రూరుడు, అధికార పిశాచి అయిన సలీం సింగ్.. ఆ గ్రామ ముఖియా (పెద్ద మనిషి) కూతురిపై కన్నేశాడట. ఎంతో అందగత్తె అయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని వేధించాడట.
ఆ అమ్మాయితో పెళ్లి జరిపించక పోతే.. గ్రామంపై పన్నులు పెంచుతానని, ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్తానని బెదిరించాడట. సలీం సింగ్ వేధింపులతో విసిగిపోయిన 85 గ్రామాలు ఒక్కటయ్యాయి. తమ ఊరి ఆడబిడ్డను ఆ దుర్మార్గుడి బారినుంచి రక్షించడానికి గ్రామ ప్రజలంతా ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పిల్లాజెల్లా, ఇంటి సామగ్రితోపాటు గొడ్డూగోదాతో సహా దాదాపు 1500 మంది.. రాత్రికి రాత్రే గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు ‘ఈ మట్టిపై ఇక ఎవరూ కూడా ఇళ్లు కట్టుకుని బతకలేరు’ అని శపించారట. అప్పటి నుంచి కుల్ధారా దెయ్యాల గ్రామంగా మారిందని స్థానికులు చెబుతారు.

ఒకప్పుడు సంపన్న గ్రామంగా వెలుగొందిన కుల్ధారాలో.. ఇప్పుడన్నీ శిథిలమైన గృహాలే కనిపిస్తాయి. పాతకాలం నాటి అనేక భవనాలు, మొండి గోడలు.. ఇప్పటికీ ఠీవీగా నిలబడి, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. విశాలమైన రోడ్లు, అద్భుతమైన వాస్తుకళతో పద్ధతి ప్రకారం కట్టిన ఇండ్లు, పురాతన ఆలయాలు.. నాటి వైభవాన్ని కండ్లకు కడతాయి. ఏ వీధిలో చూసినా పాత కాలపు ఇండ్లు, రాతి కిటికీలు, వంట గదులు, భూగర్భ రహస్య మార్గాలు విస్తుగొలుపుతాయి. సాహసీకులకు ఎన్నో సవాళ్లు విసురుతాయి.

కుల్ధారా గ్రామం ప్రస్తుతం రాజస్థాన్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్నది. అయితే, ఇక్కడ అసాధారణ శక్తులు ఉన్నాయని, రాత్రి సమయంలో గ్రామంలోంచి వింత శబ్దాలు వస్తాయని కొన్నేండ్లపాటు జోరుగా ప్రచారం సాగింది. దాంతో, దెయ్యాల అన్వేషకులు, సాహసీకులు, పరిశోధకులు ఈ గ్రామాన్ని సందర్శించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పర్యాటక ఆదరణ కూడా పెరిగింది. దాంతో రాజస్థాన్ ప్రభుత్వం కుల్ధారాలో పునరుద్ధరణ పనులు చేపడుతున్నది. కొన్ని పాత ఇండ్లను తిరిగి నిర్మించడానికి కృషి చేస్తున్నది. పర్యాటకుల కోసం మౌలిక వసతులతోపాటు గైడ్లను అందుబాటులో ఉంచుతున్నది.

జైసల్మేర్ నగరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్ధారా. పర్యాటకుల సందర్శన కోసం పగటిపూట మాత్రమే ఈ గ్రామం గేట్లను తెరుస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఊరిలో ఎవ్వరినీ ఉండనివ్వరు. సూర్యాస్తమయానికి ముందే.. గేట్లు మూసివేస్తారు. ఇక్కడి గైడ్లు కూడా సాయంత్రం కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతారు. పిల్లలు, గుండె బలహీనంగా ఉన్నవారు ఈ గ్రామానికి వెళ్లకపోవడమే మంచిది. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో కుల్ధారాను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది.