హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రస్తుతం దేశంలో మహిళలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం మఖ్దూంభవన్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి సమావేశం అధ్యక్షురాలు ఉస్తెల సృజన అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యంపై దాడిలాంటిదని విమర్శించారు. మహిళలతోపాటు రైతు, యువజన, విద్యార్థుల న్యాయమైన సమస్యలను పరిషరించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షురాలు రజిని, సీనియర్ నాయకురాలు ప్రేమ్‌పావని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వరింగ్ ప్రెసిడెంట్ మండ సదలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.