భీమదేవరపల్లి, జూలై 31: సహకార రంగంలో ముల్కనూరు చేస్తున్న సేవలు భేష్ అని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కితాబిచ్చారు. గురువారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం, ముల్కనూరు మహిళా సహకార డెయిరీలను సందర్శించారు. డెయిరీ ప్రారంభం, పాల సేకరణ, పాల ఉత్పత్తులు తదితర కార్యకలాపాలను గురించి జీఎం మారుపాటి భాస్కర్ రెడ్డి వివరించారు. డెయిరీ నిర్వహణపై పవర్ ప్రజంటేషన్ ను తిలకించారు. అక్కడి నుండి భీమదేవరపల్లి మండల కేంద్రంలోని పాల సేకరణ కేంద్రాన్ని సందర్శించారు.
పాల నాణ్యతను పరీక్షించే విధానం, పాడి రైతులకు బిల్లుల చెల్లింపు తదితర వాటిని గురించి మహిళలు వివరించారు. అనంతరం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘాన్ని సందర్శించారు. సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సూపర్ బజార్, విత్తన శుద్ధి కర్మాగారం, పెట్రోల్ పంపు తదితర వాటిని సందర్శించారు.
ముల్కనూరు సహకార సంఘం రైతులకు ఇస్తున్న రుణాలు, రికవరీ, సంక్షేమ పథకాలను గూర్చి జీఎం రాంరెడ్డి, సిబ్బంది వెంకటేశ్వర్ రావు వివరించారు. అనంతరం పవర్ ప్రజెంటేషన్ తిలకించారు. సహకార రంగంలో దశాబ్దాలుగా మహిళా డెయిరీ, సహకార గ్రామీణ పరపతి సంఘం విజయవంతంగా సాగుతుండడం పట్ల కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు డిఆర్ డి ఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, తదితరులు పాల్గొన్నారు.