donkey route : అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లాలనుకున్న ఇద్దరు భారతీయుల కలలు కల్లలయ్యాయి. అంతేకాదు.. చావు అంచుదాకా వెళ్లి బతికి బయటపడ్డారు. విదేశాల్లో కిడ్నాప్‌నకు గురైతే.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్ వల్ల విడుదలయ్యారు. ఇది సినిమా తరహాలో.. నిజ జీవితంలో ఇటీవల జరిగిన క్రైమ్ స్టోరీ. ఇందులో బాధితులు మాత్రం భారతీయులే. గుజరాత్‌కు చెందిన ధృవ్ పటేల్ (22), దీపికా పటేల్ (32).. ఇద్దరికీ అమెరికా వెళ్లాలని డ్రీమ్. ఇద్దరికీ పరిచయం లేదు.
కానీ, అమెరికా వెళ్లాలన్న కల ఇద్దరిని కలిపింది. ఇద్దరూ ముంబైకి చెందిన ఏజెంట్ ద్వారా అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదీ.. అక్రమమైన డాంకీ రూట్ ద్వారా. ఇందుకోసం ధృవ్ రూ.35 లక్షలు, దీపిక రూ.15 లక్షలు ఏజెంట్‌కు చెల్లించింది. తర్వాత ఇద్దరూ జనవరి 30న గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతం నుంచి వడోదరకు, అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడినుంచి విమానం ద్వారా అజర్ బైజాన్ చేరుకున్నారు. ఇది అటు పశ్చిమాసియా ప్రాంతానికి, ఇటు తూర్పు యూరప్ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ఈ మార్గంలో అక్రమ పద్ధతుల ద్వారా అమెరికా వెళ్లొచ్చు. దీన్నే డాంకీ రూట్ అంటారు.
డాంకీ రూట్ అంటే..
ఇది అమెరికా వెళ్లేందుకు అక్రమ మార్గం. ఇండియన్స్, దక్షిణాసియా వాళ్లు మాత్రమే వాడుతారు. ఈ మార్గం చాలా ప్రమాదకరం. అనేక దేశాలు, ప్రమాదకర అడవులు దాటాల్సి ఉంటుంది. దీనంతటికీ అజర్ బైజాన్ కేంద్రంగా ఉంటుంది. అందుకే ఇక్కడినుంచే చాలామంది వెళ్తుంటారు. కానీ, ఇక్కడే ధృవ్, దీపిక ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇక్కడి ఏజెంట్ వారిద్దరినీ గమ్యానికి చేర్చాలి. కానీ, అతడి అధీనంలోకి రాగానే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయించాడు. ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇస్తేనే వారిని మరో గమ్యానికి చేరుస్తానన్నాడు. దీనికి ధృవ్, దీపిక నిరాకరించారు. దీంతో వారిని కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారి కుటుంబ సభ్యులకు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. వీడియో కాల్‌లోనే కిడ్నాపర్లు వీరిపై దాడి చేశారు. వారిని వదిలిపెట్టాలంటే రూ.65 లక్షలు కావాలన్నారు.
లేకుంటే వారి కిడ్నీలు అమ్మేస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ముందుగా సగం డబ్బు సమకూర్చి, క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లించారు. అయినప్పటికీ మరింత కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు డబ్బు సమకూర్చే మార్గం లేకపోవడంతో ఆనంద్ నియోజకవర్గ ఎంపీ మితేష్ పటేల్‌కు చెప్పారు. ఆయన వెంటనే జైశంకర్‌ను సంప్రదించారు. ఆయన ద్వారా అజర్ బైజాన్‌లోని బాకులో ఉన్న భారత ఎంబసీకి సమాచారం అందింది. అక్కడి భారత అధికారులు అజర్ బైజాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ మహిసాగర్ పేరుతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 24 గంటల్లో కిడ్నాపర్ల చెరనుంచి ఇద్దరినీ కాపాడారు. ప్రస్తుతం బాధితులు ఇద్దరూ భారత ఎంబసీ పర్యవేక్షణలో ఉన్నారు.
వారు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో తగిన చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కిడ్నాప్‌నకు పాల్పడింది పవన్ రాకీ అనే గ్యాంగ్‌స్టర్‌తోపాటు, బాబా ఖాన్ అనే ఇరాన్‌కు చెందిన మరో డాన్ గ్యాంగ్‌గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అక్కడి పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. కాగా.. ఈ డాంకీ రూట్ నేపథ్యంలోనే గతంలో షారుక్ ఖాన్ హీరోగా డంకీ అనే సినిమా రూపొందింది.