High BP Reading | వయసు పైబడిన వారితో పాటు యువతలో కూడా ఎక్కువగా వస్తున్న అనారోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. ఒత్తిడి, ఆందోళన, వ్యాయామం చేయకపోవడం, ఉప్పు కలిగిన ఆహారాలను , ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. రక్తపోటు కారణంగా ధమనులు సంకోచానికి గురి అవుతాయి. దీంతో శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేయడం గుండెకు కష్టమవుతుంది. ఈ సమస్యకు మందులు ఉన్నప్పటికీ వీటిని ఎక్కువ కాలం పాటు వాడాల్సి ఉంటుంది. రక్తపోటు మందులు వాడడం వల్ల రక్తపోటు స్థాయిలు అదుపులో ఉన్నప్పటికీ గుండెపోటు, స్ట్రోక్స్ వంటి గుండె సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి విఫలమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాకుండా మందులు వాడడానికంటే ముందు అధిక రక్తపోటుకు గల కారణాలను తెలుసుకుని వాటిని ఆపడం మంచిదని సలహా ఇస్తున్నారు. రక్తపోటు సమస్య ఒక హెచ్చరిక లాటిందని ఇది మన శరీరంలో ఒత్తిడిని, వాపును, రక్తనాళాలు పనిచేయకపోవడాన్ని, పోషకాల లోపాన్ని, శరీరంలో పేరుకుపోయిన విషాలను సూచిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక రక్తపోటును మిల్లీమీటర్ల పాదరసం( mm Hg) లో కొలుస్తారు. దీనిలో రెండు రకాల రీడింగ్ లు ఉంటాయి. మొదటిది సిస్టోలిక్ రీడింగ్, ఇది గుండె సంకోచించినప్పుడు ధమని గోడపై ఒత్తిడిని తెలియజేస్తుంది. రెండవది డయాస్టోలిక్ రీడింగ్, ఇది గుండె సడలించినప్పుడు బీట్ ల మధ్య ఒత్తిడిని తెలియజేస్తుంది. 120/80 mm Hg రీడింగ్ సాధారణ రక్తపోటుగా పరిగణించబడుతుంది. అలాగే పై రీడింగ్ 120 నుండి 129 మధ్యలో, కింద రీడింగ్ 80 కంటే తక్కువగా ఉంటే అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. అలాగే పైసంఖ్య 130 నుండి 139 మధ్యన, దిగువ సంఖ్య 80 నుండి 89 మధ్యన ఉన్నట్లయితే దానిని ఒకటవ దశ రక్తపోటుగా పరిగణిస్తారు.
అలాగే పైసంఖ్య 140 కంటే ఎక్కువగా దిగువ సంఖ్య 90 కంటే ఎక్కువగా ఉంటే 2వ దశరక్తపోటుగా పరిగణిస్తారు. అదే విధంగా 180/120 mm Hg కంటే ఎక్కువ రీడింగ్ ను హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీగా పరిగణిస్తారు. దీనికి తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక రక్తపోటుతో బాధపడే వారు రోజూ వ్యాయామం చేయాలి. ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. తృణ ధాన్యాలను, కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాన్ని తీసుకోవడం తగ్గించాలి. శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ధూమపానం మానేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.